Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి… మళ్ళీ మంత్రిగా పనిచేయడమా..?

December 5, 2024 by M S R

.

ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ మంత్రిగానా?

మాహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజుల తరువాత NDA కూటమి ముఖ్యమంత్రి ఎంపిక మీద కసరత్తు పూర్తి చేసింది. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా శివసేన నేత, నిన్నటివరకు సీఎంగా ఉన్న ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

Ads

కౌంటింగ్ రోజు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే చర్చలో నావోటు షిండేకు వేసాను. కానీ బీజేపీ తన దీర్ఘకాల రాజకీయ ప్రణాళికకు చిన్న కామా పెట్టి ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. 12 రోజులు అంటే, షిండేను అజిత్ పవర్ ను కూడా బాగానే సముదాయించినట్లే.

అయితే ముఖ్యమంత్రి పదవి చేసిన తరువాత ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు చేపట్టటం మీద చర్చ నడుస్తుంది.. ఉప ముఖ్యమంత్రి అంటే టెక్నికల్ గా మంత్రి మాత్రమే , ప్రమాణ స్వీకారం కూడా మంత్రి అనే చేస్తారు. ముఖ్యమంత్రిగా పనిచేసి తరువాత ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రిగా పనిచేసిన వాళ్లు చాలా మందే ఉన్నారు.

ముఖ్యమంత్రిగా పనిచేసి తరువాత మంత్రి అయిన వారిలో మొదటివారు బెజవాడ గోపాల్ రెడ్డి, రెండవవారు శంకర్‌రావు చవాన్‌ (S.B .చవాన్).

బెజవాడ గోపాల్ రెడ్డి – ఆంధ్ర రాష్ట్రం
బెజవాడ గోపాల్ రెడ్డి గారు 1955లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసారు . 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నీలం సంజీవ్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. సంజీవ్ రెడ్డి క్యాబినెట్ లో బెజవాడ గోపాల్ రెడ్డి మొదట హోమ్ తరువాత ఆర్ధిక శాఖ మంత్రిగా పనిచేశారు.

శంకర్‌రావు చవాన్‌ – మహారాష్ట్ర
1975లో కాంగ్రెస్‌ నేత శంకర్‌రావు చవాన్‌ మహారాష్ట్ర సీఎంగా. కాంగ్రెస్ వర్గ కుమ్ములాటలు, 1977 లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవలేక పోవటం తదితర కారణాలతో 1977 మే నెలలో S.B .చవాన్ రాజీనామా చేయటంతో వసంత దాదా పాటిల్ సీఎం అయ్యారు.

1978 ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించకపోవటంతో శరద్ పవర్ Progressive Democratic Front పేరుతో కూటమి ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. పవార్‌ కేబినెట్‌లో చవాన్‌ ఆర్థిక మంత్రి అయ్యారు.
అయితే చాలా మందికి మళ్ళీ సీఎం అయ్యే అవకాశం రాలేదు కానీ శంకర్‌రావు చవాన్‌ మాత్రం 1986-1988 మధ్య మరోసారి సీఎం అయ్యాడు. ఇప్పటి వరకు ఇలా సీఎం- మంత్రి- సీఎం అయిన వాళ్ళు ఇద్దరే. ఒకరు శంకర్‌రావు చవాన్‌, మరొకరు ఒరిస్సా మాజీ సీఎం హేమానంద్ బిశ్వాల్ . శంకర్‌రావు చవాన్‌ పీవీ క్యాబినెట్ లో కేంద్ర హోమ్ మంత్రిగా కూడా పనిచేశారు.

హేమానంద్ బిశ్వాల్ – ఒరిస్సా
ఒరిస్సాలో హేమానంద బిశ్వాల్ అనే కాంగ్రెస్ నేత 1989 డిసెంబర్ – 1990 మార్చ్ మధ్య 88 రోజులు సీఎంగా పనిచేశారు . మార్చ్ 1990లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బిజూ పట్నాయక్ జనతాదళ్ తరుపున సీఎం అయ్యారు.

1995 ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి గెలిచింది, జెబి పట్నాయక్ సీఎం అయ్యారు. ఆ క్యాబినెట్ లో హేమానంద బిశ్వాల్ మంత్రి అయ్యారు. అయితే 2000 ఎన్నికల ముందు కాంగ్రెస్ మరోసారి హేమానంద బిశ్వాల్ ను సీఎంను చేసింది. ఈసారి కూడా 90 రోజులు సీఎంగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బిజూ జనతాదళ్ గెలిచి నవీన్ పట్నాయక్ సీఎం అయ్యారు.

నవీన్ పట్నాయక్ వరుసగా నాలుగుసార్లు గెలిచి దాదాపు 20 సంవత్సరాలుగా సీఎం పదవిలో ఉన్నారు. మొన్నటి 2024 ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ ఓడిపోయారు. దీనితో సుదీర్ఘ కాలం సీఎంగా పనిచేసిన లిస్టులో రెండో స్థానంలో ఆగిపోయారు. మొదటి స్థానంలో 24 సంవత్సరాల 165 రోజుల రికార్డుతో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చాంలింగ్ ఉండగా , 24 సంవత్సరాల 99 రోజులు సీఎంగా పనిచేసిన నవీన్ పట్నాయక్ రెండోస్థానంలో ఉన్నారు.

మొహమ్మద్ కోయ – కేరళ
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నేత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారన్న విషయం కూడా ఇప్పటి తరానికి తెలిసి ఉండకపోవచ్చు. మొహమ్మద్ కోయ ముస్లిమ్స్ లో వెనుకబడిన తెగకు చెందిన నేత. చదువు ద్వారా ఎదిగిన నేత. కేరళ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా,స్పీకర్ గా , ముఖ్యమంత్రిగా పనిచేశారు.

కమ్యూనిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అని ఇప్పుడు స్లోగన్స్ ఇవొచ్చు కానీ ఆ నినాదం రావటానికి ప్రధాన కారణం 1964- 1980 మధ్య వచ్చిన చీలికలే . 1964లో సిపిఐ నుంచి చీలి సిపిఎం ఏర్పడిన తరువాత 1980 ఎన్నికల వరకు సిపిఐ, సిపిఎం పోటీపడటం, మధ్యలో మరో పార్టీ గెలవటం జరిగింది. సిపిఐ ఇందిరా ఎమర్జెన్సీని సమర్ధించగా సిపిఎం వ్యతిరేకించింది.

కేరళలో కాంగ్రేస్ మద్దతుతో సిపిఐ అధికారంలోకి కూడా వచ్చింది. కేరళ 1977 ఎన్నికల్లో (ఎమర్జెన్సీ తరువాత) కాంగ్రెస్, సిపిఐ, కేరళ కాంగ్రెస్ (కాంగ్రెస్ చీలిక పార్టీ ), RSP (Revolutionary Socialist Party – బెంగాల్లో ఇప్పటికీ ఉంది) ,ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) ఒక కూటమిగా పోటీ చేసి, సిపిఎం కూటమి మీద గెలిచి కాంగ్రెస్ కరుణాకరన్ సీఎం అయ్యారు.

కరుణాకరన్ సీఎం అయిన నెలలోపే “రాజన్ కేస్ ” (లాకప్ డెత్) మీద హైకోర్ట్ తప్పుపట్టటంతో 32 రోజులకే రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కూడా కాని ఏకే ఆంటోని (అప్పట్లో youngest సీఎం- 37 ఇయర్స్) సీఎం అయ్యారు. ఆయన 18 నెలల తరువాత రాజీనామా చేయటంతో సిపిఐ వాసుదేవ నాయర్ సీఎం అయ్యారు. అయన దాదాపు ఒక సంవత్సరం పాటు పదవిలో ఉన్నారు. ఆయన రాజీనామాతో ముస్లిమ్ లీగ్ నేత మొహమ్మద్ కోయా సీఎం అయ్యారు. కానీ 50రోజుల్లోనే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటంతో కోయా రాజీనామా చేసి 52 రోజుల సీఎంగా రికార్డులో నిలిచిపోయారు.

1982- 1983 మధ్య కరుణాకరన్ క్యాబినెట్ లో మొహమ్మద్ కోయ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1983లో బ్రెయిన్ హేమరేజ్ తో చనిపోయారు. మొహమ్మద్ కోయ ముస్లిం లీగ్ అటు కాంగ్రెస్ ఇటు సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ రెండు కూటముల్లో పనిచేయటం విశేషం.

పన్నీర్ సెల్వమ్ – తమిళనాడు
ఇప్పటి వరకు చూసిన వారిలో అందరూ ఒక్కసారి సీఎం అయిన తరువాత మంత్రులు అయినవారే కానీ పన్నీర్ సెల్వం మూడుసార్లు సీఎం అయ్యారు.

2001లో జయలలిత కోర్టు తీర్పుతో రాజీనామా చేయటం వలన పన్నీర్ సెల్వం మొదటిసారి సీఎం అయ్యారు. 2001 సెప్టెంబర్ నుంచి 2002 మార్చ్ అంటే ఆరు నెలలు సీఎంగా ఉన్నారు. ఆయనకు ఉన్న ఏకైక అర్హత లాయలిటీ . 2002 మార్చ్ లో జయలలిత సీఎం అవ్వగా పన్నీర్ సెల్వమ్ మరోసారి మంత్రి అయ్యారు.

2014లో మరోసారి జయలలిత కోర్టు తీర్పుతో రాజీనామా చేయటంతో 2014 సెప్టెంబర్ – 2015 మార్చ్ మధ్య పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. 2015 మే లో జయలలిత మరోసారి సీఎం అయ్యారు, పన్నీర్ సెల్వమ్ మంత్రి అయ్యారు.

జయలలిత మరణంతో 2016 డిసెంబర్లో పన్నీర్ సెల్వమ్ సీఎం అయ్యారు. పార్టీ వర్గ పోరుతో పన్నీర్ సెల్వమ్ రాజీనామా చేయటంతో 2017 ఫిబ్రవరిలో పళనిస్వామి సీఎం అయ్యారు , పన్నీర్ సెల్వమ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇన్నిసార్లు సీఎం అయిన తరువాత మంత్రి అయిన రికార్డ్ మాత్రం పన్నీర్ సెల్వమ్ దే .

జగదీష్ శెట్టర్ – కర్ణాటక
బీజేపీ తరుపున సీఎం అయిన తరువాత మంత్రి అయిన వారిలో దేవేంద్ర ఫడ్నవీస్ కన్నా ముందు జగదీష్ శెట్టర్ ఉన్నారు. మొదట యడ్యూరప్ప తరువాత సదానంద గౌడ తరువాత జులై 2012 – మే 2013 మధ్య జగదీష్ శెట్టర్ కర్ణాటక సీఎం అయ్యారు.

కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చి 2019 జూలైలో మరోసారి యడ్యూరప్ప సీఎం అయినప్పుడు అయన క్యాబినెట్ లో జగదీష్ శెట్టర్ మంత్రి అయ్యారు. 2008లో యడ్యూరప్ప సీఎంగా ఉన్నప్పుడు జగదీష్ శెట్టర్ స్పీకర్ గా పనిచేశారు.

ఈ లిస్ట్ లో కనీసం మరో 7, 8 మంది ఉన్నారు. ఒక్క గోవా నుంచే రవి నాయక్, విలియం డి సౌజా, చర్చిల్ అలేమో , ఫాలీరో నలుగురు ఉన్నారు…

ఇదే మహారాష్ట్ర నుంచి కూడా శివాజీరావు నింగ్లేకర్ (కాంగ్రెస్ జూన్ 1985 – మార్చ్ 1986), నారాయణ్ రాణే (శివసేన, ఫిబ్రవరి 1999 – అక్టోబర్ 1999, (ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు), అశోక్ చవాన్ (కాంగ్రెస్ , డిసెంబర్ 2008 – నవంబర్ 2010) లు కూడా తరువాత మంత్రులుగా పనిచేశారు.

అయితే సీఎం డిప్యూటీ సీఎంలు పరస్పరం మారిన సందర్భాలు మాత్రం పన్నీర్ సెల్వం & పళనిస్వామి , ఏకనాథ్ షిండే & ఫడ్నవీస్ మాత్రమే.

స్థూలంగా పెద్ద పదవులు చేపట్టి తరువాత చిన్న పదవులు చేపట్టటం అనేది మొదటి నుంచి ఉన్నదే. ఈ కేటగిరీలో ఫడ్నవీస్ , షిండే తొలి వారు కాదు, చివరి వారు కూడా కాదు. ప్రధాని , రాష్ట్రపతి పదవులు మాత్రమే ఇప్పటి వరకు ఈ కేటగిరిలో పడలేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవి తరువాత ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏమీ లేదు కానీ సమీప భవిషత్తులో కూడా ప్రధాని, రాష్ట్రపతులుగా చేసిన వారు రాజకీయంగా మరే ఇతర పదవులు చేపట్టకపోవచ్చు……. ( శివ రాచర్ల )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions