తెలంగాణ వాగ్గేయకారులుగా పిలుచుకుంటున్న గోరటి వెంకన్న (Gorati Venkanna), దేశపతి శ్రీనివాస్ (Desapthi srinivas)ల గొంతుల ఈ రోజు వింటే మతిపోయే విధంగానే ఉంది. నిజానికి వాగ్గేయకారులనేది పెద్ద మాట. ఉద్యమకాలంలో కొన్ని Over tones ఉంటాయి. తెలంగాణ ఉద్యమ కాలంలోని ఓవర్ టోన్ వాగ్గేయకారులనేది. అయితే, దానికి సాధారణమైన అర్థం కూడా చెప్పుకోవచ్చు. పాటలు రాసి, వాటిని ఆలపించేవాళ్లను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. ఈ పరిమితి తెలంగాణ ఉద్యమకాలంలోని పాట కవులకు ఉంటుంది. వారిద్దరు కూడా తెలంగాణ సమాజం (Telangana society) నుంచి విశేషమైన గౌరవాభిమానాలను పొందినవారు. కానీ ఈ రోజు వారి మాటలు వింటే మనలను మనమే కించపరుచుకుంటున్నట్లుంది.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వారిద్దరు మాట్లాడారు. గోరటి వెంకన్న సన్నాయి నొక్కులు నొక్కితే, దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ రాసిన పాటను ఉటంకించడాన్ని తప్పు పట్టారు. దేశపతి శ్రీనివాస్ భాష గురించి, సంస్కారం గురించి మాట్లాడడం కొంచెం వింతగానే ఉంటుంది. ఇన్నాళ్లు కలుగులో ఉండి ఇప్పుడు బయటకు వచ్చిన ఆయన మాట్లాడినట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నిర్బంధాల గురించి మాట్లాడారు. కేసీఆర్ (KCR) ప్రభుత్వ పాలనలోని నిరంకుశత్వాన్ని, నిర్బంధాన్ని అణచివేతను చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ఆయన దాని గురించి మాట్లాడారు. శాసనసభలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలైన నిర్బంధాన్ని, అన్యాయాన్ని బీఆర్‌ఎస్ సభ్యుడొకరు ఎత్తిచూపారు. అధికార కాంగ్రెస్ పక్షం నుంచి దానికి సమాధానం వచ్చింది. అందుకే కదా, మేం కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందనేది మేం మాట్లాడుతున్నాం అని మంత్రి ఒకరు అన్నారు. కేసీఆర్ పాలనలో అమలైన అణచివేతకు, నిర్బంధానికి, నిరంకుశత్వానికి బీఆర్‌ఎస్ నుంచి వచ్చే సమాధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) రాష్ట్రంలో అమలైనవాటిని ఎత్తిచూపడం సమాధానం కాదనే ఎరుక కూడా కవి అయిన దేశపతి శ్రీనివాస్ లేకుండా పోయిందంటే ఆయన గొంతు ఎలా వంకర్లు పోయిందో అర్థం చేసుకోవచ్చు.
Ads
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్, ఆయన పక్కన ఉన్న తాము మాత్రమే పోరాటం చేశామని, మిగతా తెలంగాణ వాళ్లకు సంబంధం లేదని దేశపతి శ్రీనివాస్ మాటల్లోని ఆంతర్యంగా అర్థం చేసుకోవచ్చు. ఉద్యమంలో పాల్గొన్న నిజాయితీగల బుద్ధిజీవులను, రచయితలను, కవులను, కళాకారులను విస్మరించడం అనేకన్నా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఎలా ఉండాలని ఆశించారో అలా లేకపోవడం వల్లనే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మట్టికరిచిందనే ఎరుక ఇప్పటికీ రాకపోవడం విచిత్రమే. కేసీఆర్ మాత్రమే కాదు, కేసీఆర్ పక్కన ఉన్న రచయితలు, కవులు, బుద్ధిజీవులు కూడా ఓటమిని ఒక గుణపాఠంగా తీసుకోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకుంటున్నట్లు లేదు.
దేశపతి శ్రీనివాస్ ఈ రోజు భాష గురించి, సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy) అందెశ్రీ (Andesri) రాసిన పాటను ఉటంకించారు. గత తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ పాలన తీరుపై అందెశ్రీ ఆ పాట రాశారు. దానిలోని భాషను, సంస్కారాన్ని దేశపతి తప్పు పట్టారు. ముఖ్యమంత్రికి ఆయన సుద్దులు చెప్పారు.
ముఖ్యమంత్రి స్థాయి గంభీరమైందని దేశపతి శ్రీనివాస్ అన్నారు. అలా అంటూ ముఖ్యమంత్రి ఉటంకించే కవిత ఉదాత్తంగా, గంభీరంగా ఉండాలని ఆయన సూచించారు. అందులోని భాష సంస్కారవంతంగా ఉండాలని కూడా అన్నారు. రంకెలేస్తున్నవేందిరా, పొంకనాలేందిరా అనే భాష ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆ కవికి సంబంధించిన పాటనే ఉటంకించాలనుకుంటే ఉదాత్తమైనవి ఉన్నాయని అంటూ జయ జయహే తెలంగాణ (Jaya Jayahe Telangana) పాటను ప్రస్తావించారు.
దేశపతి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంభీరంగానూ ఉదాత్తంగానూ సమాధానం ఇస్తూ ఓ ప్రశ్న వేశారు. అందెశ్రీ తెలంగాణ ఆకాంక్షను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన కవి అని అన్నారు. జయ జయహే తెలంగాణను జాతీయ గీతంగా ప్రకటిస్తామని చెప్పి ఈ తొమ్మిదిన్నరేళ్లలో ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా ఆ పాటను ఆలపింపజేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను బట్టి దేన్నయినా ఉటంకిస్తామని, సమయమూ సందర్భాన్ని బట్టి అది ఉంటుందని, ఇతరులు రాసినదాన్ని తనదిగా చెప్పుకోవడం సరి కాదని, అందుకే తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతున్న ఆ కవితను ఉటంకించానని రేవంత్ రెడ్డి వివరించారు.
జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్రీయ గీతంగా చేస్తామని ఇచ్చిన హామీని కేసీఆర్ ఎందుకు అమలు చేయలేకపోయారనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. కేసీఆర్‌కు అన్ని వర్గాల పట్ల, అందరి పట్ల సమదృష్టి లేదని, కేసీఆర్ చెప్పిన మాటలకు చేసిన చేతలకు పొంతన లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ మాత్రమే.
ఒక గోరటి వెంకన్న విషయానికి వస్తే ` ఆయన రైతుబంధు (Rythu Bandhu) గురించి మాట్లాడారు. పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు ఉండాలని ఆయన అన్నారు. తాను ఈ విషయం చెప్పానని కూడా అన్నారు. అంతేకాదు, సినీ నటులకు, వందలాది ఎకరాలున్నవారికి, ఐఎఎస్‌లకు, ఐపీఎస్‌లకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని కూడా చెప్పినట్లు ఆయన తెలిపారు. ఎక్కడ చెప్పారో తెలియదు. చెప్పే ఉండవచ్చు. కాస్తా గొంత పెద్దది చేసి చెప్పి వుంటే అందరికీ అది వినిపించేది. గోరటి వెంకన్నకు ఉన్న పాపులారిటీ చిన్నదేం కాదు ఎల్లలు దాటిన పాపులారిటీ. ఆయన ఆ మాట చెప్పి ఉంటే ప్రధానమైన వార్త అయి ఉండేది. ప్రజలకు వెంటనే చేరి ఉండేది. సరే, ఇప్పటికైతే ఆయన ఎవరి చెవిలోనైనా ఊది ఉంటారని సరిపుచ్చుకుందాం.
కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిన తీరుపై మాట్లాడుతూ తనదైన భాష్యం చెప్పారు. కోదండరామ్ (Kodandaram) ఇంటి తలుపులు బద్దలు కొట్టడం, హరగోపాల్ (haragopal)పై ఉపా ప్రయోగించడం వంటివి అధికారులు కావాలనే చేశారని ఆయన అన్నారు. అధికారులు కావాలని చేసినప్పుడు వాటిని నిలువరించే శక్తి గానీ, వాటిని సరిదిద్దే విచక్షణ గానీ కేసీఆర్‌కు లేకుండా పోయిందా అనేది ప్రశ్న. కేసీఆర్‌ను తాత్వికుడిగానూ దార్శనికుడిగానూ ఆయన అభివర్ణించారు. అది నిజమే కావచ్చు. కానీ పాలనలో ఆయన చేసిన నిర్వాకాలేమిటనేది ప్రశ్నించుకోవాల్సిందే.
ఒక రకంగా దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న తమ చరిత్రలను తామే రద్దు చేసుకుంటున్నారు. ఉద్యమ చరిత్రలో వారికి దక్కిన ప్రతిష్టపై వాళ్లే బురద చల్లుకుంటున్నారు. దానికి మనం ఏమీ చేయలేం… – కాసుల ప్రతాపరెడ్డి
Share this Article