Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బొడ్డు అంటేనే డంపింగ్ యార్డ్… పూలు, పళ్ళు కాదు… సీసాలు కూడా..

September 3, 2025 by Rishi

.

కుక్కపిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . పూలు పళ్ళు బిందెలు చెంబులు గిన్నెలు కావేవి పాటకు అనర్హం అన్నాడు రాఘవేంద్రరావు .

ఈ సినిమా దర్శకుడు రవిచంద్రకు ఎక్కడ నుండి వచ్చిందో ఐడియా ! గోల్డ్ స్పాట్ , థమ్సప్ సీసాల మధ్య బాలకృష్ణ , విజయశాంతిల గగన వీధుల్లో గాజు మేడల్లో అంటూ ఓ డ్యూయెట్టునే పెట్టేసాడు . హైలైట్ సినిమాకు .

Ads

అదృష్టం ఏమిటంటే పూలు పళ్ళు హీరోయిన్ ఒంటి మీద వేసినట్లు ఈ సీసాలను వేయలేదు . బతికిపోయింది విజయశాంతి .

1986 బాలకృష్ణకు లక్కీ ఇయర్ . ఏడు సినిమాలు రిలీజయితే ఆరు హిట్టయ్యాయి . ఆ ఆరింట్లో ఒకటి ఆగస్టులో విడుదలయిన ఈ దేశోధ్ధారకుడు సినిమా . గొల్లపూడి మారుతీరావు ఈ సినిమా కధను డిఫరెంటుగా నేసారు .

అనగనగా ఓ ఊళ్ళో అల్లరిచిల్లరిగా బాధ్యత లేకుండా ఆకతాయిగా ఇంటి మీదకు తగాదాలు తెస్తుంటాడు హీరో బాలకృష్ణ … నాటకాలు , ఆటపాటలు నిత్యకృత్యాలు . వీటన్నింటికీ అతని చుట్టూ ఓ తొట్టి గేంగ్ ఉంటుంది . ఈ క్రమంలో చెల్లెలికి తాంబూలాలు తీసుకోబోయే ఆఖరి క్షణంలో ఆకతాయి అన్న వలన సంబంధం చెడిపోతుంది . తాత ప్రాణాలు వదులుతాడు .

ప్రయోజకుడు కావటానికి ఈ సగం స్వాతిముత్యం పట్టణానికి బయలుదేరి మధ్యలో మంచినీళ్ళకు రైలు దిగి రైలుని మిస్ చేసుకుంటాడు . ఆ ఊళ్ళో ఇద్దరు విలన్లు గ్రామాన్ని ఏలుతుంటారు . వాళ్ళ అక్రమాలను పరిశోధిస్తానికి వచ్చిన స్పెషల్ ఆఫీసరు అనుకొని హీరో గారిని ఎత్తుకుపోయి ఆఫీసర్ మర్యాదలన్నీ చేస్తారు .

అదే ఊళ్ళో ఉన్న హీరోయిన్ , హీరో కలిసి ఆ విలన్లను ఆటపట్టిస్తూ వాళ్ళ డబ్బులతోనే ఊరిని అభివృద్ధి చేయిస్తారు . నిజం తెలుసుకున్న విలన్లు ఒకటయి హీరో మీద తిరగబడటం , హీరో హీరోచితంగా పోరాడి ప్రభుత్వానికి అప్పచెప్పటంతో శుభం కార్డ్ పడుతుంది . అప్పటిదాకా ఆ ఊళ్ళో పిచ్చోడిగా తిరుగుతున్న గొల్లపూడి మారుతీరావే అసలు స్పెషల్ ఆఫీసరని తెలుస్తుంది .

పగ , కక్షలు వంటి రొటీన్ అంశాలు లేకుండా కాస్త పాజిటివ్ పంధాలో నడుస్తుంది కధ . బాలకృష్ణ శివాజీ వంటి వేషాలు వేస్తాడు . అన్ని సినిమాల్లో విలన్ వేషాలేసే రావు గోపాలరావు ఉదాత్తమైన తాత పాత్ర వేసారు . నూతన్ ప్రసాద్ , సత్యనారాయణలు విలన్లు . వారిద్దరి మధ్య నిప్పును రాజేసి చలి కాచుకుంటూ ఉంటాడు సుత్తి వీరభద్రరావు .

ఇతర పాత్రల్లో కాంతారావు , సుధాకర్ , ముచ్చెర్ల అరుణ , వై విజయ , సంయుక్త , టెలిఫోన్ సత్యనారాయణ , వంకాయల , అరుణ్ కుమార్ , మాడా , రాళ్ళపల్లి , కల్పనారాయ్ , తదితరులు నటించారు . వై విజయకు ఆమెకు తగ్గ పాత్ర లేదు పాపం ! Underused . నూతన్ ప్రసాద్ విలనీ బాగుంటుంది . సుధాకర్ , ముచ్చెర్ల అరుణల ఆదర్శ విధవా పునర్వివాహ ఘట్టం బాగుంటుంది . బాలకృష్ణ , విజయశాంతిల జోడీ అందంగా అలరిస్తుంది . 17 సినిమాలు నటించారట .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు బాలకృష్ణ అభిమానులను సీట్లలో కూర్చోనివ్వవు . వచ్చె వచ్చె వాన జల్లు వాన పాట , అమ్మాయి ముద్దబంతి బుగ్గేమన్నది , ఎంత పని చేసిందమ్మ బిళ్ళంగోడు , పట్టుకుంటె మాసిపోయె డ్యూయెట్లు బాలకృష్ణ , విజయశాంతిలు విజృంభించేసారు . కధ గొల్లపూడిదే అయినా డైలాగులను మాత్రం సత్యానంద్ వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు హుషారుగా పాడారు .

విజయ భాస్కర ప్రొడక్షన్స్ బేనరుపై ధనేకుల మురళీమోహనరావు నిర్మించిన ఈ సినిమా యూట్యూబులో ఉంది . It’s a commercial mass romantic entertainer .బాలకృష్ణ , విజయశాంతి అభిమానులకు బాగా నచ్చుతుంది . సినీ ప్రేమికులు ఆస్వాదించగలరు . చూడనివారు చూడవచ్చు .

#తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions