Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డెస్టినీ..! ఆ ఒక్కడూ మిగిలిపోయాడు… ఐనవారందరూ ‘బుగ్గి’..!

June 6, 2026 by M S R

.

Priyadarshini Krishna …. చికిత్స పొందుతున్న తండ్రి సమీపంలో ఉండాలని తపించి వచ్చి అనంత లోకాలకు…..

కనిపించే శత్రువుతోనైనా పోరాడొచ్చు. కానీ విధి రూపంలో వచ్చే అదృశ్య విపత్తు ముందు మనుషులు ఎంత అల్పులో గుర్తుచేసే హృదయ విదారక ఘటన ఇది. ఢిల్లీలోని మాళవియానగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో బుధవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాదం 21 మంది ప్రాణాలను బలిగొన్న విషయం యావత్ భారతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ మంటలు కేవలం ఒక భవనాన్నే కాదు… ఒక నిండు సంసారాన్ని, మూడు తరాల ప్రేమానురాగాలను బూడిద చేసేశాయి. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సజీవ దహనమైన తీరు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.

Ads

తాతయ్యను చూడాలని బెంగళూరు నుంచి వచ్చి..

సెక్టార్ 46 లోని వివేక్ (48) నివాసం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తోంది. వివేక్ ఒక ప్రైవేట్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా (CA) బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, ఆయన భార్య తర్జిని (47) ఒక ఎన్జీఓ (NGO) ద్వారా సమాజ సేవలో ఉండేవారు. నిన్నటివరకు నవ్వుతూ, పలకరిస్తూ తిరిగిన ఆ దంపతులు, వారి తల్లి ప్రేమ్ లత, కుమార్తెలు జివిషా, వారియ ఇప్పుడు లేరంటే పొరుగువారు నమ్మలేకపోతున్నారు.

ఈ కథనంలో అందరినీ కలచివేసే మరో కోణం… వివేక్ చిన్న కుమార్తె జివిషా. బెంగళూరులో ఉంటున్న ఆమె, ఆసుపత్రిలో మంచంపై ఉన్న తన ప్రియమైన తాతయ్యను చూడాలనే తపనతో, ప్రమాదానికి కేవలం ఒక్క రోజు ముందే ఢిల్లీకి వచ్చింది. తాతయ్య చేతిని పట్టుకుని ఓదార్చాలనుకున్న ఆ మనవరాలు, ఇలా చిరునవ్వుల వయసులోనే అనంత లోకాలకు వెళ్ళిపోతుందని ఎవరూ ఊహించలేదు.

ఆసుపత్రికి దగ్గరగా ఉండాలనే ఆరాటమే శాపమైంది!

వివేక్ తండ్రి రాధే శ్యామ్ అగర్వాల్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సమీపంలోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అవసాన దశలో ఉన్న తండ్రికి ఏ అర్ధరాత్రి ఏ అవసరం వస్తుందో, తాము ఎల్లప్పుడూ దగ్గరుండి సపర్యలు చేయాలనే ఆరాటంతోనే వివేక్ ఆసుపత్రికి సమీపంలో ఉన్న ‘ఫ్లరిష్ స్టే బి&బి’ హోటల్‌లో రెండు గదులను బుక్ చేశారు. రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నుండి వచ్చిన వివేక్ మేనమామ అశోక్ గోయల్, అత్త కమలా గోయల్, బంధువు ఝుమ్రీ లాల్ గోయల్ కూడా తాతగారిని పరామర్శించేందుకే అక్కడికి వచ్చి వివేక్ కుటుంబంతో కలిశారు.

కానీ, బుధవారం ఉదయం కాలయముడిలా దూసుకొచ్చిన మంటలు ఆ ఎనిమిది మందినీ కోలుకోలేని విధంగా దహించివేశాయి. ఆసుపత్రి మంచంపై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధ తండ్రికి సేవలు చేయాలనుకున్న కొడుకు, కోడలు, మనవరాలు, బంధువులు… అంతా ఒక్కసారిగా మాయమైపోయారు. ఇప్పుడు ఆ పెద్దాయనకు తను ఒంటరివాడిననే చేదు నిజం కూడా చెప్పలేని పరిస్థితి.

చట్టాల ఉల్లంఘన.. పౌరుల మౌనం: దీనికి బాధ్యులెవరు?

కనీసం ఫైర్ ఎన్‌ఓసి (Fire NOC) కూడా లేకుండా, కరుడుగట్టిన నిబంధనల ఉల్లంఘనలు, నిర్లక్ష్యం మధ్య ఒక ఇరుకైన గల్లీలో నడుస్తున్న ఆ హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం 21 మంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఇందులో తమ బంధువుల వైద్యం కోసం విదేశాల నుంచి వచ్చిన 12 మంది విదేశీయులు కూడా ఉండటం గమనార్హం.

ఈ ఘోరానికి బాధ్యులెవరు? కేవలం వ్యవస్థేనా? ఒక రకంగా పౌరులమైన మన మౌనం కూడా దీనికి కారణమే. కళ్లముందే నిబంధనలు ఉల్లంఘిస్తూ భవనాలు లేస్తున్నా, భద్రతా ప్రమాణాలు పాటించకపోయినా “మనకెందుకులే” అని వదిలేసే మన నిర్లిప్తతే ఇలాంటి లాభాపేక్ష గల వ్యాపారులకు పెట్టుబడిగా మారుతోంది.

చికిత్స పొందుతున్న తండ్రికి నీడగా నిలవాలనుకున్న ఒక కొడుకు తాపత్రయం… విగతజీవులుగా మారిన ఆ కుటుంబ సభ్యుల రూపంలో ముగిసిపోయింది. చట్టాలు మారినా, నిబంధనలు కఠినతరం చేసినా… పోయిన ప్రాణాలను, అనాథగా మిగిలిన ఆ వృద్ధ తండ్రి గూడును ఏ వ్యవస్థ తిరిగి ఇవ్వగలదు?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డెస్టినీ..! ఆ ఒక్కడూ మిగిలిపోయాడు… ఐనవారందరూ ‘బుగ్గి’..!
  • రేవంత్ ససేమిరా..! చంద్రబాబు ‘రూట్’ మార్చాడు – ఇక మహానదిపై కన్ను..!!
  • ఆదానీ చెప్పిందే శాసనం..! లేదంటే ఈడీ దాడులేనా..? వేదాంతపైనా..?!
  • ఇంట్రస్టింగ్..! సుప్రీంకోర్టు తీరుపైనే ఓ హైకోర్టు తీవ్ర అసంతృప్తి..!!
  • ‘లిఫ్టులతో డబ్బు ఎత్తిపోసుకుని- ప్రాజెక్టును పఢావు పెట్టేశాడు కేసీయార్’
  • అబద్ధాలు, జనం కళ్లకు గంతలు… మరీ హరీష్ ఇలా మారిపోయాడేంటి..?
  • పేరు లేని ఊరు… నేనూ చూశాను, ‘పెద్ది’లా ఓ ఫైటూ చేశాను…
  • అన్నా మలై..! తన కొత్త పొలిటికల్ జర్నీలో రజినీకాంత్ కూడా..?!
  • బస్తీమే సవాల్… లై డిటెక్టర్ టెస్టుకు రెడీయా… పీకేకు కేవీపీ సవాల్…
  • ‘వరి వేస్తే ఉరే’ అన్న కేసీయార్‌ది ఒప్పట..! రేవంత్ చెబితే తప్పట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions