.
(బండారు రాంప్రసాద్ రావు) నిప్పు లేకుండా హృదయాన్ని కాల్చే రక్త బంధాలు!!
రాధాకృష్ణారావు గారికి కీసర దగ్గర లంకంత కొంప ఉంది… వంశపారంపర్యంగా నాయన ఇచ్చిన ఇంత సాగు భూమి, ఇల్లు, తప్ప పిత్రార్జితం వందలెకరాల భూమి అన్యాక్రాంతం అయింది… ఒక్కప్పుడు లాండ్ లార్డ్ ఇప్పుడు లాండ్ లేస్ వారుగా మిగిలారు…
Ads
అదృష్టవశాత్తూ తన తండ్రికి ఒక్కడే కొడుకు కావడం… దానికి తోడు ఇంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి తనకు పుట్టిన పిల్లలనిద్దరిని ఉన్నత చదువులు చదివించారు…
ఇప్పుడు రాధాకృష్ణారావుకు డెబ్భై ఏళ్ళు…
పెళ్లయి యాభై సంవత్సరాలు…
“ముత్తైదువగా పోవాలి” అని భార్య జానకి ఎప్పుడూ అనుకునేది…
కానీ షుగర్ బీపీ ఉన్న రాధాకృష్ణారావు రాయిలా ఉన్నాడు కానీ ఆరోగ్యంగా ఉన్న జానకి హఠాత్తుగా కన్ను మూసింది…
ఉన్నన్నాళ్ళు చిటికిమాటికి భార్యతో తగువు పెట్టుకున్న రావు గారికి… ఆమె పోయాక ఆమె లేని లోటు అణువణువు కనబడుతుంది…
ఆఫీస్ ఉన్నప్పుడు హాయిగా సాగిన సంసారం…
ఆయన రిటైర్ అయ్యాక తన బీపీ అంతా భార్య మీద చూపించేసరికి ఎన్నోసార్లు నువ్వు పోతే సుఖంగా ఉంటాను అన్న మాట అప్పుడప్పుడూ జానకి నోట రాగానే…
అలిగి గదిలో తలుపు బిగించుకునేవాడు…
జానకి మళ్ళీ బ్రతిమాలాడుతూ
“నాకు కోపం తెప్పించకండి” అని కన్నీళ్ళ పర్యంతం అయ్యేది…
ఆ జ్ఞాపకాలు…
ఆమె బుజ్జగించిన ఆ రోజులు అన్నీ రావు గారికి గుర్తుకు వస్తున్నాయి…
ఎటూ చూసిన ఇల్లంతా జానకి ప్రతిరూపం కనబడుతుంది…
ఉన్నన్నాళ్ళు కూర బాగాలేదని, పచ్చడి బాగా లేదని ఆమెను వేధించుకు తిన్న రోజులు గుర్తుకు వచ్చి రావు కన్నీటి ధారగా విలపిస్తున్నారు..
యాభై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఇద్దరిదీ ఒకే మాట…
రిటైర్ అయ్యాక మాత్రం కాస్త నోటి దురుసు రావు గారికి ఎక్కువైంది…
బయటకు వెళితే “బీపీ టాబ్లెట్స్ వేసుకున్నారా?” అని అడిగేది…
టిఫిన్ చేసి ముందు “టాబ్లెట్స్ వేసుకొండని” ఫోన్ లో చెప్పేది…
ఇంట్లో ఉంటే ఎప్పుడో తెల్లవారు ఝామున లేచి పూజా పునస్కారాలు చేసి తొమ్మిదికల్లా టిఫిన్ రెడీ చేసి భర్తకు పెట్టీ, ఆమె తినేది… ఎప్పుడైతే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయో అప్పట్నుంచి ఆమెకు రావు గారికి వైరం మొదలైంది…
వాళ్ళ ఉద్యోగాలు హైటెక్ సిటి వైపు, వాళ్లకు వచ్చే జీతం ఏమి సరిపోతుంది అని ఉన్న రెండెకరాలు అమ్మి అమ్మాయికి అబ్బాయికి రెండు ఇళ్ళు కొనిచ్చే వరకు జానకి పోరు ఆగలేదు! పిల్లలకు సిటీలో ఇళ్ళు కొన్నాక ఇద్దరూ వాళ్ళ దగ్గర ఇమడలేక సిటీకి దూరంగా ఇలా ఒంటరి జీవితం గడుపుతున్నారు…
పైగా “నేను ముందు పోతే మీకు చేసే వారు ఉండరు” అని ఏడిపించేది…
ఎంత గిల్లికజ్జాలు పెట్టుకున్నా కూడా భార్యాభర్తలు ఒక గంట సేపటి తరువాత మాట పట్టింపులు పక్కన పెట్టి దగ్గరయ్యేవారు…
రావు గారిదే ఎప్పుడూ తప్పయ్యేది. జానకి ఓపిక వల్ల సంసారం ఇంత వరకు సాగింది…
పిల్లల పెంపకం…
వాళ్లకు ఉద్యోగాలు …
వాళ్లకు ఇళ్లు పెళ్ళిళ్ళు అయ్యే సరికి ఉన్న ఆస్తి మొత్తం అయి పోయింది…
ఇప్పుడు తన పూర్వీకులు కట్టించిన ఇల్లు…
పెన్షన్ తప్ప రాధాకృష్ణారావు ఏమి మిగలలేదు!!
ఈ తరం పిల్లల అభిరుచులు వేరు, దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు… తీరిక లేని పనుల వల్ల తల్లిదండ్రులను చూసే ఓపిక వారికి లేదు…
పైగా తన కన్న వాళ్ళని స్కూలుకు పంపడం…
తీసుకురావడం…
ఇదే ఒత్తిడితో ప్రతి కుటుంబంలో వృద్ధ తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఇమడలేక పోతున్నారు…
వాళ్ళు తినే తిండి…
ఆచార వ్యవహారాలు….
వాళ్ళ వస్త్ర ధారణ ఇప్పటి పేరంట్స్ కు నచ్చడం లేదు…
పైగా మనవలు, మనవరాళ్లతో అన్యోన్యంగా ఉందామన్నా కూడా
“పిల్లల చదువు పాడై పోతుంది”
“మీరు గారాబం చేయకండి” అనే మాట
కొడుకు – కూతురు నుండి రావడం…
పైగా కొడుకు ఇంట్లో కోడలి సంబంధీకులు, కూతురు ఇంట్లో అల్లుడి సంబంధీకులు తిష్ట వేసుకు కూర్చోవడం…
తన పిల్లలకు కొన్న ఇంట్లో కూడా తనకు స్థానం లేదని తెలిసి వచ్చేసరికి ఆప్యాయత అనురాగం అంతా కనుమరుగై పోతుంది…
ఇప్పుడు కన్న తల్లిదండ్రులు పిల్లలకు బరువు!!
అందుకే పండుటాకులుగా మిగిలిపోయి “దేవుడు ఎప్పుడు తీసుకెళతాడా?” అని చూస్తున్నారు…
రాధాకృష్ణారావు గారు ఇవ్వాళ ఎంతో బాధకు గురయ్యారు…” చ… ఇలాంటి పిల్లలను కన్నందుకా నేను ఇంత శ్రమ పడింది…. దానికి కారణం తనను కొడుకు అన్న మాటలు …
“మనసు బాగాలేక దైవ దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్లి వస్తా” అని పిల్లలిద్దరికీ చెప్పాడు…
తానే రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాడు…
ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉన్నారు నాన్నా అని పిల్లల నుండి ఫోన్ లేదు…
తిన్నారా? పడుకున్నారా? అని బాగోగులు కూడా అడిగిన పాపాన పోలేదు…
రావు గారికి పిల్లల పట్ల ద్వేష భావం ఏర్పడడానికి బోలెడు సంఘటనలు జరిగాయి…
ఒక రోజు కొడుకు ఇంట్లో ఉంటే అర్ధరాత్రి రాజమండ్రి నుండి దిగిన అత్తామామలను తీసుకురావడానికి కొడుకు కారులో వెళ్లి తీసుకువచ్చాడు…
తాను రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి అంటే క్యాబ్ లో వెళ్ళమని ఆఫీస్ కు వెళ్లి పోయాడు…
వారింట్లో ఉంటే పిల్లలకు వాళ్ళు టిఫిన్లు క్యారేజ్ లు కట్టి, అటు ఆఫీస్ కు ఇటు స్కూల్ కి పిల్లలను పంపాక “నాన్నా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఉంది… తినండి” అని కొడుకు ఫోన్ చేసి చెప్పాడు…
ఇంట్లో ఉన్న రెండు రోజుల్లో కోడలు “ఎలా ఉంటున్నారు మావయ్యా” అని కూడా అడగలేదు…పైగా మనవరాలు మనవడితో గదిలో పడుకుందామని అనుకుంటే హాల్లో మంచం వేసి పరుపు వేసి పడుకోండి… అని కొడుకు అన్నప్పుడే అదే అర్ధరాత్రి తన ఇంటిలో వెళ్లి పోదామని కోపం వచ్చింది రావు గారికి..
అయిన తమాయించుకొని ఉన్నాడు…
తెల్లవారే తన బట్టలు సర్దుకొని, వెళ్లి వస్తా బాబు అంటే సరే నాన్నా అన్నాడు తప్ప ఉండమని అనలేదు! తాను క్యాబ్ మాట్లాడుకొని కూతురు ఇంటికి వెళితే వెళ్ళిన రోజు బాగానే చూసింది… మరో రోజు ఉందామని అనుకొని తాను టీవీ చూస్తుంటే “నాన్నా అల్లుడు గారి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ బంధువులు వస్తున్నారు… వాళ్ళు మూడు నాలుగు రోజులు ఉంటారట… మీరు అన్నయ్య ఇంట్లో ఈ మూడు రోజులు ఉండండి, తిరిగి నా దగ్గరికి రండి” అన్న మాట కూతురు నోట వినగానే, స్నానం చేయకుండానే ప్యాంట్ షర్ట్ వేసుకొని, బ్యాగ్ సర్దుకొని, సరే అమ్మా ఆరోగ్యం జాగ్రత్త అని లిఫ్ట్ దిగాడు…
వెంటనే ఆటో మాట్లాడుకొని పబ్లిక్ గార్డెన్ వెళ్లి ఒక చెట్టు చాటుకి వెళ్లి బోరున విలపించాడు…
తాను – జానకి ఏ యాత్రలకు వెళ్ళినా కూడా పిల్లలను అల్లారుముద్దుగా చూసుకొని… చలి పెడుతుందేమో అని రగ్గులు కప్పి, పొదివి పట్టుకొని పెంచిన వీళ్ళు మా ఇంట్లో పడుకోవడానికి స్థానం లేదు అని నిర్మొహమాటంగా అనడం రాధాకృష్ణారావు గారు జీర్ణించుకోలేక పోతున్నారు…!!
జ్వరాలు, రోగాలు వస్తే ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళు స్వస్థత చేకూరే వరకు ఆసుపత్రి వరండాలో పడుకొని పిల్లలను పెంచితే ఇదా వాళ్ళు చేసే నిర్వాకం! తనలాగే పబ్లిక్ పార్కుల్లో మూగ రోదన చేస్తున్న తన వయసు వాళ్ళు కనబడ్డారు రావు గారికి…
భారతీయ కుటుంబ వ్యవస్థ ఇంత చిన్నాభిన్నం కావడానికి కారణం ఈ సాఫ్టు వేర్ జాబులా? లేక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విలువలు పాటించక పోవడానికి మా తరమే కారణమా?! అన్న ప్రశ్న రావు గారిలో మొదలైంది…
అసలు పిల్లలపై ప్రేమ పెంచుకోవడం మొదటి తప్పు…
రెండోది వారి బాగోగుల గురించి ఆలోచించడం రెండో తప్పు…
అసలు జీవితం అనే రైలు ప్రయాణంలో ఫ్లాట్‌ఫామ్ ఫ్రెండ్‌గా పిల్లలతో ఉండాలి…
స్టేషన్ రాగానే దిగిపోయే ప్రయాణికుడిలా మనం మారాలి…
అన్న దృఢ నిశ్చయం రావులో మొదలయింది…
వెంటనే తన ఫోన్ లో నుండి కొడుకు కూతురు కాంటాక్ట్ నెంబర్లు తీసేశాడు…
తన ఇంటికి చేరి ఇల్లంతా పని వాళ్ళతో శుభ్రం చేయించి కేవలం జానకి ఫోటో మాత్రమే ఇంట్లో తనకు కనబడేలా… బెడ్ రూంలో పెట్టాడు…
పక్కనే హోటల్ వాడి దగ్గరికి వెళ్లి ఉదయం టిఫెన్, మధ్యాన్నం భోజనం రాత్రి రెండు చపాతీలు పంపేలా ఏర్పాట్లు చేసుకున్నాడు…
పక్కనే ఉన్న టీ కొట్టు వాడితో ఉదయం సాయంత్రం కాఫీ తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాడు…
తన సెల్ లో టైమ్ ప్రకారం ట్యాబ్ లెట్స్ వేసుకునేలా అలారమ్ పెట్టుకున్నాడు…
నెలకు పది రోజులు ఇండియా టూర్ ట్రావెల్స్ వాడికి టికెట్ బుక్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు…
ఇపుడు పిల్లలు ఫోన్ చేసినా ఎత్తడం లేదు…
భవబంధాలు అన్నీ తెంపుకుని తనకు నచ్చిన జీవితాన్ని గడిపేలా ప్లాన్ చేసుకున్నాడు!
ఒంటరి తనం అనేది మనసు మాట! తన మాటే మనసు వినేలా, మనోనిబ్బరం తెచ్చుకున్నాడు! ఇప్పుడు ఆయన రోగాలు తగ్గుముఖం పట్టాయి! తొంబై ఏళ్ళ వయసులో కూడా చలాకీగా ఉన్న తన దగ్గరికి… రిటైరయి ఫారిన్ లో సెటిల్ అయిన తన కొడుకుల దగ్గర ఇమడలేక తండ్రి పంచన చేరిన తన కొడుకు హాల్లో టీవీ చూస్తుంటే… గదిలో నుండి వచ్చిన రావు గారికి తన కోడలు కొడుకుతో మట్లాడుతున్న సంభాషణ వినపడింది… “ఏమండీ నేను అమెరికాలో ఇమడలేక పోతున్నాను, ఇక్కడ మన పిల్లలు పనిమనుషులకన్నా హీనంగా చూస్తున్నారు, నేను మీ దగ్గరికి వస్తాను అన్న భార్య మాటలకు, చూసావా వృద్దాప్యం ప్రాయశ్చిత్తం ఏమిటంటే……
భార్యా వియోగశ్చ జనాపవాదో
ఋణస్య శేషః కుజనస్య సేవా
దారిద్ర్య కాలే ప్రియ దర్శనం చ
వినా౭గ్నినాపంగ్చ దహంతి కాయం
భార్యా వియోగం, (స్త్రీలు భర్త అని అన్వయించుకోవాలి) లోక నింద, రుణభారం (అప్పులు), నీచులకు తగ్గి ఉండాల్సిన పరిస్థితి, దారిద్ర్యం అనుభవిస్తున్న తరుణంలో ఇష్టమైనవారు వచ్చి పలకరించడం – ఇవన్నీ తట్టుకోలేని బాధలు. ఈ ఐదు అంశాలు నిప్పు అవసరం లేకుండా హృదయాన్ని కాల్చేస్తాయి. అవమాన భారంతో దహించుకుపోతారు !!
Share this Article