ఓ సూపర్ హిట్ సినిమాకు ఇరవై అయిదేళ్ళ తర్వాత సీక్వెల్ తీయాలనే ఆలోచన రావటమే సంచలనం . హేట్సాఫ్ టు దాసరి . దానికి తగ్గట్టుగా ప్రధాన పాత్రధారులు జీవించి ఉండటం. ఇదీ గొప్ప విషయమే . దేవదాసు సినిమాలో ఎక్కువ మందికి దేవదాసు , పార్వతిల పాత్రలు నచ్చుతాయి . నాకు ఆ రెండు పాత్రల కన్నా ఎక్కువ నచ్చే పాత్ర , నేను గౌరవించే పాత్ర చంద్రముఖిదే . ఒక వేశ్య ఒక అభాగ్యునికి నిస్వార్థంగా సేవచేయటం , ఆరాధించటం చాలా గొప్ప విషయం . ఈ పాత్రను సృష్టించిన శరత్ కూడా అభినందనీయుడే .
దేవదాసు సినిమాలో దేవదాసు చంద్రముఖితో అనే ఓ డైలాగే ఈ దేవదాసు మళ్ళీ పుట్టాడు సినిమాకు ప్రధాన కారణం . మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో నిన్ను విడిచి ఉండను అమ్మీ డైలాగే ఈ సినిమాకు మూలం . పూర్వ జన్మ స్మృతులతో సినిమాలు అన్ని భాషల్లో కుప్పలుకుప్పలు వచ్చాయి . మన తెలుగుతో సహా . కానీ సీక్వెల్ గా , ఆ పాత్రల్లో నటించిన పాత్ర అదే పాత్రలో జీవించి ఉండటం , ఆ నటి కూడా జీవించి ఉండటం సాధారణంగా సాధ్యం కాదు .
ఈ సినిమాలో నృత్యాలను దృశ్యకావ్యాలుగా తీసారు దాసరి . వాణిశ్రీ దసరాబుల్లోడు , ప్రేమనగర్ వంటి బ్లాక్ బస్టర్లలో డాన్సులు చాలానే చేసింది . చెల్లెలి కాపురం , భక్త కన్నప్ప సినిమాల తర్వాత శాస్త్రీయ నృత్యాలు అద్భుతంగా నృత్యించింది మళ్ళా ఈ సినిమాలోనే . గత జన్మ విషయాలు ఆమెను వెంటాడే సన్నివేశాలలో ఆమె నటన సూపర్బ్ .
Ads
మరో నటి జయప్రద . ఆమెకు చాలా అందమైన నృత్యాలు రెండు ఉన్నాయి . ఒకటి ఎంకి నాయుడు బావ గెటప్సులో ఒకటి , మరొకటి అమరప్రేమ అనే టైటిలుతో నడిచే నృత్యనాటకం . ఈ నృత్యనాటకంలో అక్కినేనిని చాలా మెచ్చుకోవాలి . 53 ఏళ్ల వయసులో శాస్త్రీయ పధ్ధతిలో , అందులో జయప్రదతో నృత్యించటం సాధారణ విషయం కాదు . కమల్ హసన్ , చిరంజీవిలు నృత్యించినా , వాళ్ళు అలాంటి శాస్త్రీయ నృత్యాలు యువకులుగా ఉన్నప్పుడు నృత్యించారు . ఇలా 1978 లో వచ్చిన ఈ దేవదాసు మళ్ళీ పుట్టాడులో అక్కినేని , వాణిశ్రీ , జయప్రదల పాత్రలు , వారి నటన , నృత్యాలు తప్పక ఆస్వాదించవలసినవే .
ఇంక మహానటి సావిత్రి . చెప్పేదేముంది !! ఇతర ప్రధాన పాత్రల్లో గుమ్మడి , ప్రభాకరరెడ్డి , కాంతారావు , రాజనాల , షావుకారు జానకి , అల్లు రామలింగయ్యలు నటించారు . మోహన్ బాబు మోహన్ బాబు అనే పేరు కల పాత్రలోనే నటించారు .
యస్ రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . కొన్ని బయట కూడా హిట్టయ్యాయి . నృత్యాలకు దర్శకత్వం వహించిన పసుమర్తి కృష్ణమూర్తి , చిన్ని సంపత్ లను అభినందించాలి .
ఓపలేకున్నాను చందురూడా , నడివీధిలో దీపం ఒకటి సుడిగాలికి ఊగుతున్నది , ఎవరికి ఎవరు చివరికి ఎవరు , ఓ ప్రణయ జీవనీ , దోసిట సిరిసిరి మల్లెలతో , అనురాగమే ఒక ఆలయం ఆ భావనకే మన జీవితం పాటలు అన్నీ బాగుంటాయి . క్లైమాక్సులో యస్ పి బాలసుబ్రమణ్యం పాడిన వేటూరి వారి పాట దిక్కులు కలిసే సమయం ఇది పాట క్లైమాక్సుని బాగా పండించింది . ఎంతగా అంటే క్లైమాక్సుకు ముందు , పార్వతి పాత్ర ఎంటరయ్యే ముందు స్లో అయిన సినిమాను పరుగెత్తించి , ప్రేక్షకులను తృప్తిగా థియేటర్ నుంచి బయటకు పంపుతుంది .
ఎక్కడ ఏం తక్కువ ఉందో ఏమో కానీ , ఈ కధకు , ఇంత అందమైన నటీమణుల అందమైన శాస్త్రీయ నృత్యాలు ఉన్న ANR , వాణిశ్రీ , జయప్రద , దాసరిల సినిమా సక్సెస్ కావలసినంత లెవెల్లో సక్సెస్ కాలేదేమో అని అనిపిస్తుంటుంది .
Yet , a good movie . Visual feast . సినిమా యూట్యూబులో ఉంది . చూడని రసహృదయులు తప్పక చూడండి . ఇద్దరు హీరోయిన్లు అందంగా నటించారు . A thing of beauty is a joy forever . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article