Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!

July 1, 2025 by M S R

.

ఏదో వన్ ప్లస్ టూ సినిమాలు చేసుకునే శోభన్ బాబును ఈ ఆలోచనాత్మక కథకు ఒప్పించడం అప్పటి థింకర్ దర్శకుడు టి.కృష్ణ గొప్పతనం… ఆ పాత్రను పండించడం శోభన్ బాబు గొప్పతనం…

విజయశాంతి గురించి చెప్పడానికేముంది..? టి.కృష్ణ అభిమాన హీరోయిన్… ఆమె కోసమే కొన్ని అద్భుత పాత్రల్ని క్రియేట్ చేశాడు తను… ఆస్తికత్వం, నాస్తికత్వం చర్చను బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు… దర్శకుడు చేసి చూపించాడు…

Ads

తను ఇంకొన్నాళ్లు బతికి ఉంటే ఎన్ని రత్నల్లాంటి సినిమాలు వచ్చేవో… నో డౌట్ ప్రస్తుత దర్శకుల్లో టి.కృష్ణకు కిిలోమీటర్ దూరం వరకూ చేరేవాళ్లు కూడా లేరు… సినిమా అనేది క్షుద్ర, చిల్లర వినోదం కోసం కాదు, ఈ బలమైన మాస్ మీడియా జనాన్ని ఆలోచనలో పడేయాలనే ధోరణిలో టి.కృష్ణ ప్రజెంట్ చేసిన ఒక మంచి సినిమాను పరిచయం చేస్తున్నారు Subramanyam Dogiparthi... 



దేవాలయం

శోభన్ బాబు నటించిన గొప్ప చిత్రాలలో గొప్ప చిత్రం 1985 లో వచ్చిన ఈ దేవాలయం సినిమా . తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా . నాస్తికుడిగా , దురాచారాలను హేతుబధ్ధత లేని దుస్సాంప్రదాయాలను ప్రతిఘటించే వ్యక్తిగా , మానవత్వమే ఆస్తికత్వం అని వివరించే సామాజిక సంస్కర్తగా శోభన్ బాబు అద్భుతంగా నటించారు . ఏ నటుడికి అయినా , నటికి అయినా తమ ప్రతిభను చూపేందుకు సరయిన పాత్ర రావాలి . అలాంటి పాత్రే శంకరం పాత్ర ఈ సినిమాలో .

విప్లవ ఆస్తికత్వ చిత్రం ఈ దేవాలయం . ఈ సినిమా కధను తయారు చేసిన A.C. కాలేజి విద్యార్ధి , మా గుంటూరు జిల్లా మోదుకూరి జాన్సన్ని మెచ్చుకోవాలి . గుర్రం జాషువా గారి శిష్యుడిగా గురువునే మించి ఈ సినిమా లోని సన్నివేశాలను , పాత్రలను సృష్టించారు . శ్మశానాన్నే కళ్యాణ వేదికను చేసారు .

అంతే పదునుగా సంభాషణలను వ్రాసారు మోదుకూరి జాన్సన్ , యం వి యస్ హరనాధరావులు . ఇలాంటి అత్యంత సున్నితమైన కధాంశం కలిగిన సినిమాకు మాటలు వ్రాయడమంటే కత్తి మీద సామే . ఎందరో మనోభావాలతో ముడిపడి ఉండే వ్యవహారం . త్రాసులో తూకం తూచి వేసినట్లు పడ్డాయి మాటలు . హేతుబధ్ధతను విడవకుండా ఆస్తికత్వాన్ని చాలా ఎఫెక్టివుగా ఆవిష్కరించారు .

ఈ విప్లవాత్మక ప్రయత్నానికి సారధి , విజయసారధి టి కృష్ణ . ఒక్కోసారి నాకు అనిపిస్తుంది . విజయశాంతి కోసమే ఈయన పుట్టాడా అనిపిస్తుంది . కేవలం 36 సంవత్సరాలు మాత్రమే జీవించిన ఈ కళాకారుడు ఏడు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహిస్తే ఆరింటిలో విజయశాంతే కధానాయిక . ఆరూ హిట్లు , సూపర్ హిట్లు , బ్లాక్ బస్టర్లు . సావిత్రి , వాణిశ్రీల తర్వాత అంతకన్నా ఎక్కువ స్టార్డంని , పారితోషకాన్ని డిమాండ్ చేసే స్థాయికి ఆమెను తీర్చిదిద్దిన వ్యక్తి టి కృష్ణ . రోజూ లేవగానే ఈ దర్శకుడి ఫోటోకు దండం పెట్టుకోవాలి విజయశాంతి…

ఈ సినిమాలో విజయశాంతికి లభించిన పాత్ర అద్భుతమైన పాత్ర . బాధ్యత కల స్త్రీగా , మిత్రుడు శంకరానికి తోడుగా , చాలా బాగా నటించింది . ముఖ్యంగా నృత్య సన్నివేశాలలో ప్రేక్షకులు మరచిపోలేని ప్రతిభను ప్రదర్శించింది . ఈ ఇద్దరి పాత్రల తర్వాత మరో గొప్ప పాత్ర భగవాన్ దాసు పాత్ర . ఈ పాత్రలో పి యల్ నారాయణ కూడా నట తాండవం చేసాడు .

దేవాలయం ధర్మకర్తగా ఎన్ని అఘాయిత్యాలు చేయాలో అన్నింటినీ చేస్తాడు ఈ సినిమాలో ట్రస్టీ రావు గోపాలరావు . గుడి మాన్యాల దగ్గర నుండి కొబ్బరి చిప్పల దాకా , అనాధ పిల్లలకు అన్నం పెట్టకుండా పస్తులతో అలమటించేలా హింసించే నరరూప రాక్షసుడిగా రావు గోపాలరావు జీవించాడు .

ఈ నాలుగు పాత్రల తర్వాత చాలా గొప్ప పాత్ర దేవదాసి కళావతి పాత్ర . బహుశా కన్నడ నటి అనుకుంటా . పేరు శశికళ . అందంగా ఉంది , బాగా నటించింది . నీలాగా నీతి లేని దాన్ని కాను అని ఎండోమెంట్ ఆఫీసరుతో చెప్పే గొప్ప పాత్ర ఇది .

తర్వాత చెప్పుకోవలసిన పాత్ర పూజారి పాత్ర . సోమయాజులు గారికి ఈ పాత్ర కొట్టిన పిండి . బాపు గారి బుధ్ధిమంతుడు సినిమాలో మాధవాచార్యులులాగా నిరంతరం దేవుడి సేవే . ఆస్తికత్వం మీద , ఆచార సాంప్రదాయాల మీద అపారమైన గౌరవం , విశ్వాసం కల పాత్ర . సోమయాజులు గారు జీవించారు . ఆయన భార్యగా భర్త కొడుకు మధ్య నలిగిపోయే స్త్రీమూర్తిగా అన్నపూర్ణ చాలా గొప్పగా నటించారు .

ధర్మకర్తకు చెంచాలుగా ఎండోమెంట్ ఆఫీసర్ పాత్రలో హరనాధరావు , బిచ్చగాళ్ల దగ్గర కూడా అప్పులు చేసే అర్భకుడిగా సుత్తి వేలు , విలన్ భార్యగా అత్తిలి లక్ష్మి , బిచ్చగాళ్ల ప్రెసిడెంటుగా నర్రా వెంకటేశ్వరరావులు నటించారు . మరెంతో మంది రాళ్ళెత్తారు .

ఈ సినిమా అఖండ విజయానికి ప్రధాన సారథులు ఇంకా ఉన్నారు . సంగీత దర్శకుడు చక్రవర్తి , పాటల్ని వ్రాసిన గొప్ప రచయితలు వేటూరి , సి నారాయణరెడ్డి , వంగపండు , అదృష్ట దీపక్ , వాటిని ఎంతో శ్రావ్యంగా పాడిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు .

మొట్టమొదటగా చెప్పుకోవలసింది దశావతారాల మీద పాట . జీవన పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా చెప్పే ప్రయత్నమే ఈ పాట . విజయశాంతి , శోభన్ బాబులు అద్భుతంగా నృత్యించారు . విజయశాంతికి చక్కటి నృత్యాన్ని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించిన పాట నమో నాగాభరణా పాట . సినిమా ప్రారంభంలోనే వస్తుంది .

ఈ సినిమాకు ఒక విధంగా ఐకాన్ పాట దేహమేరా దేవాలయం జీవుడే సనాతన దైవం నేనే బ్రహ్మ నేనే విష్ణు నేనే శివుడై నిలబడితే పాట . బహుశా వేటూరి వ్రాసిందే అయిఉండాలి . క్లైమాక్స్ హేయస్మరాంతక అంటూ సాగే పాట . శోభన్ బాబు శివుడుగా తాండవం చేసింది ఈ సినిమాలోనేనేమో ! శోభన్ బాబు , పి యల్ నారాయణల నటన ఈ పాటలో అత్యద్భుతం .

అలాగే విజయశాంతి నృత్యించటానికి అవకాశం కల్పించిన డ్యూయెట్ హృదయాలయాన తొలిసారి వెలిశాడు దైవం అనే శోభనం రాత్రి డ్యూయెట్ . అమ్మో బయలెళ్ళినాడె దేవుడు అంటూ సాగే జానపద బాణీలో ఉండే ఎర్ర పాటను బహుశా వంగపండు వ్రాసి ఉండాలి . శోభన్ బాబు పాత్ర ఈ గ్రూప్ డాన్స్ ద్వారానే పరిచయం అవుతుంది సినిమాలో .

మరో పాట నీ నుదుట కుంకుమ నిత్యమై వెలగాలి చాలా శ్రావ్యంగా ఉంటుంది . విజయశాంతి నృత్యాలను అద్భుతంగా కంపోజ్ చేసిన పసుమర్తి కృష్ణమూర్తి , తారను మెచ్చుకోవాలి . ముఖ్యంగా దశావతారాల నృత్యం . ఈ సినిమా అంతా మా గుంటూరు జిల్లా లోని పుణ్యక్షేత్రం అమరావతి లోనే షూటింగ్ చేసారు . రాశి కన్నా వాశి ముఖ్యం . టి కృష్ణ వాశిలో చిరంజీవి . ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో నాకు ఎంతో నచ్చిన సినిమా ఇది .

An unmissable , thought-provoking , musical and visual splendour . సినిమాల ద్వారా కూడా సంస్కరణలను బోధించవచ్చని నమ్మే బాపు , విశ్వనాధుల సరసన చేరారు టి కృష్ణ ఈ సినిమాతో . ఆస్తికులు , నాస్తికులు , హేతువాదులు , దుస్సాంప్రదాయులు , అందరూ చూడవలసిన చిత్రం .

యూట్యూబులో ఉంది . ఒకసారి కాదు . వీలున్నప్పుడల్లా చూడండి . మనసుకు ఆహ్లాదం , బుర్రకు ఆలోచనలను కలిగిస్తుంది . A great movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions