.
Subramanyam Dogiparthi …….. ఇది యన్టీఆర్ దేవాంతకుడు కాదు ; చిరంజీవి దేవాంతకుడు . 1960 లో వచ్చిన యన్టీఆర్ దేవాంతకుడు సినిమాను ఈతరం వాళ్ళు చూసి ఉండకపోవచ్చు . అప్పట్లో సూపర్ హిట్ . గోగోగో గోంగూర జైజైజై ఆంధ్రా పాట వీర హిట్ . తెగ పాడుకుంటూ ఉండే వాళ్ళం .
1984 ఏప్రిల్లో వచ్చిన ఈ చిరంజీవి దేవాంతకుడు సినిమా కూడా అంతే హిట్టయింది . అయితే ఈ రెండు సినిమాల కధాంశం ఒక్కటి కాదు . ఈ చిరంజీవి దేవాంతకుడు సినిమా కన్నడంలో ఫ్లాపయిన గెలువు నన్నదే సినిమాకి రీమెక్ . అంబరీష్ హీరోగా నటించారు .
Ads
కన్నడం సినిమా షూటింగులో ఉన్నప్పుడే తెలుగు సినిమా నిర్మాత , నటుడు , చిరంజీవి మిత్రుడు నారాయణరావు రీమెక్ రైట్స్ కొన్నాడు . తెలుగు సినిమా షూటింగ్ మొదట్లో ఉండగా కన్నడ సినిమా ఫ్లాపయింది . అప్పటికప్పుడు స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసుకుని షూటింగ్ కొనసాగించారు . చిరంజీవి , నారాయణరావుల అదృష్టం . బాగా ఆడింది . 22 లక్షల రూపాయల బడ్జెటుతో తీసారట .
సినిమా అంతా చిరంజీవే . పందేలరాయుడి కేరెక్టర్ . గెలవటమే ధ్యేయం . ఎంత రిస్కయినా తీసుకుని పందెం గెలవటం అతని అలవాటు . ఆ బలహీనత చుట్టూనే సినిమా అల్లబడింది . అతని మిత్రుడు నారాయణరావు ఆ బలహీనతను ఉపయోగించుకునే క్రమంలో చిరంజీవి చేయని హత్యలో ఇరుక్కుంటాడు . ఆ చేయని నేరంలో నుండి బయటపడటమే మిగిలిన సినిమా అంతా .
ఆ ప్రయత్నంలో ప్రియురాలు విజయశాంతి తోడ్పడటం , పోలీసుల కళ్ళు కప్పటానికి మారు వేషాలు వేసుకుని గ్రూప్ డాన్సులు వేయటం వంటి సీన్లు ఉంటాయి . చిరంజీవి ఫైట్లు , డాన్సులు సినిమాను ఉరుకెత్తిస్తాయి .
ఇంత డేరింగ్ హీరోకి పైరోఫోబియా (Pyrophobia) ఉంటుంది . అంటే నిప్పు చూస్తే భయపడిపోవటం , గతంలో జరిగిన దుర్ఘటనలు గుర్తుకు రావటం ఈ రుగ్మత లక్షణాలు . ఈ పైరోఫోబియాకు ఓ ఫ్లాష్ బేక్ ఉంటుంది . విలన్ గోకిన రామారావు తన తండ్రిని పెట్రోల్ పోసి దారుణంగా చంపుతాడు . అదే విధంగా క్లైమాక్సులో విలన్ని చంపి పగ తీర్చుకుని , జైలుకెళ్ళి , బయటకొచ్చి హీరోయిన్ని పెళ్లి చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది .
సినిమా విజయానికి జె వి రాఘవులు సంగీతం , వేటూరి , గోపి , జ్యోతిర్మయిలు వ్రాసిన పాటలు బాగా తోడ్పడ్డాయి . డ్యూయెట్లు అన్నింటిలోనూ చిరంజీవి , విజయశాంతిలు అదరగొట్టేస్తారు . ఘడియకో కౌగిలింత గంటకో పులకరింత (వానపాట, విజయశాంతి అందాల ఆరబోత) , చిలకొచ్చి కొడుతుంటే చిరుబుగ్గ , ఆకేసి పీటేసి ముంగిట్లో ముగ్గేసి డ్యూయెట్లను బాగా తీసారు .
ఇప్పటి తరం బస్తీవాసులకు పీట అంటే తెలియదేమో ! ఇప్పుడంటే అందరి ఇళ్ళల్లో డైనింగ్ టేబుల్స్ వచ్చాయి . ఒకప్పుడు అందరూ నేల మీద పీట వేసుకుని భోంచేసేవారు .
ఈ సినిమాలో ఒక హైలైట్ చిరంజీవి , సిల్క్ స్మిత క్లబ్ డాన్స్ . డాన్సులో ఇద్దరూ ఇద్దరేగా . నే కుబుసం విడిచిన పాముని అంటూ సాగుతుంది పాట . ఖైదీ లోని రగులుతుంది మొగిలి పొద వాసన కనిపిస్తుంది . మరో మంచి పాట . చెల్లెమ్మకు పెళ్ళంట అన్నయ్యకు సంబరమంట పాట చక్కని ఫేమిలీ సెంటిమెంటుని ఆవిష్కరిస్తుంది . యమ్మా గుమ్మా ముద్దుగుమ్మా చిరంజీవి టీజింగ్ సాంగ్ హుషారుగా ఉంటుంది .
డైలాగులను తోటపల్లి మధు వ్రాసారు . అతనికి ఇదే మొదటి సినిమా . S A చంద్రశేఖర్ దర్శకుడు . చిరంజీవి , నారాయణరావు , చంద్రశేఖర్లది లక్కీ కాంబినేషన్ అని చెప్పవచ్చు . 1984 లో చిరంజీవి నటించిన సినిమాలు మొత్తం పది వచ్చాయి . ఇది అతనికి 68 వ సినిమా . స్వయంకృషీవలుడు ….
బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , యస్ పి శైలజలు పాటల్ని శ్రావ్యంగా పాడారు . ఇతర ప్రధాన పాత్రల్లో హరి , గుమ్మడి , అన్నపూర్ణ , వరలక్ష్మి , రోహిణి , గొల్లపూడి మారుతీరావు , పి జె శర్మ , కోట శ్రీనివాసరావు , ప్రభృతులు నటించారు .
వంద రోజుల ఫంక్షన్ హైదరాబాద్ సంధ్య థియేటర్లో జరిగింది . An entertaining , family-sentimental , action , masala movie . ఇంతకుముందు చూసి ఉండకపోతే వాచ్ లిస్టులో వేసుకోవచ్చు . చిరంజీవి అభిమానులు మళ్ళా చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article