తెలుగు హీరో అంటే ఎవడు..? వాడు సూర్యుడికన్నా ప్రచండుడు… ప్రచండామారుతం… పేలిన అగ్నిపర్వతం… అంటుకున్న దావానలం… ఇసుక తుఫాన్… అణు విస్ఫోటనం … ఆకాశంకన్నా ఎత్తు… సముద్రంకన్నా లోతు… వాడు దేవుడికన్నా మిన్న… హమ్మయ్య, నేనింకా చెప్పలేను… తెలుగు పాటల రచయితలు మాత్రమే సమర్థులు… పైన చెప్పినదానికన్నా బాగా బాగా రాస్తారు.,. కూస్తారు… మనం చూస్తాం, ఈలలు వేస్తాం, చప్పట్లు కొడతాం, థియేటర్ల హుండీల్లో వందల కోట్ల దక్షిణలు వేస్తాం…
అప్పట్లో గుర్తుంది కదా… పవన్ కల్యాణ్ ఏదో గొడవతో ఇండియాలోనే ఉండిపోయిన మేనత్తను తీసుకురావడానికి ఇండియాకు వెళ్తాడు… అదేదో బుద్ధుడు, రామానుజుడు, ఆదిశంకరాచార్య, చంద్రగుప్తమౌర్యలలాగా ఏదో మహత్తర, బృహత్తర లక్ష్య సాధనకు ఏదో ఎటో పోతున్నట్టు… ఆ యాత్రలకన్నా మిన్నగా ఓ పాటలో చెబుతాడు గీత రచయిత… త్రివిక్రమే అనుకున్నా, కాదట, ఎవరో శ్రీమణి అట…
గగనపు వీధి వీడి వలస వెళ్ళి పోయిన నీలిమబ్బు కోసం, తరలింది తనకు తానే ఆకాశం పరదేశం… శిఖరపు అంచునుంచి నేల జారిపోయిన నీటిచుక్క కోసం విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం… అని ఆకాశమెత్తు కీర్తన అందుకుని, అంతలోనే తనకే డౌటొచ్చి వీడు భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో అంటాడు… రచయితే చెప్పినట్టుగా… తెలుగు పాటల సాహిత్యం… శత్రువంటు లేని వింత యుద్ధం, ఇది గుండెలోతు గాయమైన శబ్దం…
Ads
మొన్ననే కదా పుష్పరాజ్ కోసం నాటు నాటు ఆస్కారుడు చంద్రబోస్ ఏదో కూశాడు, సారీ, రాశాడు… ‘నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలె, నిన్ను కొలవాలంటే ఇంకా సముద్రం లోతే తవ్వాలె’ అన్నాడు… పంచెలు తడవాలె, ఇంకేదో కారాలె అని రాయలేదు నయం… మరి తాను మామూలు హీరో కాదుగా… గడ్డం అట్టా సవరిస్తా ఉంటే దేశం దద్దరిల్లిందట… భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్ధలైందట… పెద్ద గద్దలాగా మబ్బులపైన హద్దుదాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ల కింద కురిసేయదా… ఇవన్నీ చంద్రబోసే చెప్పాడు… వర్షం తలవంచడం ఏమిటి..? కాళ్ల కింద కురిసేయడం ఏమిటి.. అంటారా..? పిచ్చి ప్రశ్న, మళ్లీ అడక్కండి, మర్యాద దక్కదు.,.
మరి జూనియర్ ఏమైనా తక్కువా..? తను కూడా ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా స్టారుడు కదా ఇప్పుడు… ఈసారి రామజోగయ్య శాస్త్రి భజస్కంధాల మీద పడింది హీరో కీర్తన బాధ్యత… ‘దూకే ధైర్యమా, జాగ్రత్త, రాకే, ఎగబడి రాకే, దేవర ముంగట నువ్వెంత, దాక్కో అని హెచ్చరిస్తున్నాడు… ఎమోషన్లను కూడా తెలుగు హీరోకు బానిసల్ని చేయడం, భయపడేట్టు చేయడం సరస్వతీపుత్ర రామజోగయ్యకే చెల్లు… పైగా పుష్పరాజ్ పాటకు దీటుగా రావాలి కదా…
అగ్గంటుకుంది సంద్రం, ఆ గుండె మండే ఆకాసం… అని ఏదేదో రాశాడు, అంతకుమించి పాట చరణాల్లోకి వెళ్లేందుకు నాకే ధైర్యం చాల్లేదు… తనే పాటలో రాసినట్టు అది జాగ్రత్తపడి నా దగ్గరకు రానంటోంది ఈ పాట సాహిత్యం చూసి బెంబేలెత్తి…! చల్లారే చెడు సాహసం అంటాడు అదేమిటో మరి… అవునూ, సంద్రంలో అగ్గి ఉంటుంది సరే, బడబానలం, బడబాగ్ని… కానీ సంద్రానికే అగ్గంటుకోవడం ఏమిటి..? ఓహో, కవి భీకర హృదయమా… సరే, సరే… ఆకాసం మండుతుందా..? పోనీ, ఖగోళం పేలింది, అంతరిక్షం అదిరిపడింది అని రాసేయకపోయారా… ఇంకెవరూ ఆ రేంజుకు రాలేకపోయేవాళ్లు…
రక్తసిక్త సముద్రం, తెగిపడిన శరీరభాగాలు, దారుణమైన మారణాయుధాలతో పాట సూపర్ వచ్చేసిందట, కొందరు జర్నలిస్టులు రామజోగయ్యను మించిపోయి రాస్తున్నారు… హలో… ఇదీ పాన్ ఇండియా సినిమాయే… పైగా డీఎస్పీ, థమన్‌ల తాత అనిరుధ్ సంగీతం అట… ఇక చూసుకొండి నా రాజా..! తను సిధ్ శ్రీరామ్‌కూ తాతే… తనే పాడాడు… కాకపోతే ఒక్క రిలీఫ్… తన ఇన్‌స్ట్రుమెంట్ల జోరులో పదాలు వినిపించడం లేదు సరిగ్గా… దీని పేరు కూడా సరిగ్గా పెట్టారు… ‘ఫియర్ సాంగ్’… ఎవరికి ఫియర్ అనడిగారో… రామజోగయ్యే చెప్పినట్టు… అది చల్లారే చెడు సాహసం అవుతుంది..!!
Share this Article