.
Paresh Turlapati ……… రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని శిఖరం నుంచి అగాధంలోకి జారుకుంటారు కొందరు, రాజకీయాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని లోయ నుంచి శిఖరానికి యెగబాకుతారు మరికొందరు
మొదటి కేటగిరీలో తూళ్ళ దేవేందర్ గౌడ్ ఉంటే రెండో కేటగిరీలో రేవంత్ రెడ్డి ఉంటాడు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డికన్నా దేవేందర్ గౌడ్ సీనియర్, కానీ ఇప్పుడు స్థాయిలో దేవేందర్ గౌడ్ కన్నా రేవంత్ సీనియర్
Ads
తొందరపాటు నిర్ణయంతో ఒకరు సాధారణ రాజకీయ జీవితం గడుపుతుండగా , సరైన నిర్ణయంతో మరొకరు తెలంగాణా రాష్ట్రానికే సీఎం అయ్యారు…
ఇప్పుడు ఈ దేవేందర్ గురించి చెప్పుకోవాలంటే , ఎన్టీయార్ పిలుపుతో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగిన బీసీ నాయకుడు దేవేందర్… మూడుసార్లు మేడ్చల్ ఎమ్మెల్యేగా… ఒకసారి రాజ్య సభ సభ్యునిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది
ఎన్టీయార్ క్యాబినెట్లో బీసీ శాఖ మంత్రిగా.. చంద్రబాబు క్యాబినెట్లో హోం మినిష్టర్ గా కీలక పదవులు నిర్వహించారు. చంద్రబాబు హయాంలో నంబర్ 2 గా పార్టీలో గుర్తింపు పొందారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి చంద్రబాబు తరపున దీటుగా పోరాడారు
చంద్రబాబు కూడా దేవేందర్ ను బాగా ప్రోత్సహించి పార్టీలో ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చేవారు. 1988 నించి 2008 దాకా దేవేందర్ రాజకీయ జీవితం ఎదురులేకుండా కొనసాగింది. 2008 లో దేవేందర్ తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ జీవితం పట్ల శాపం అయ్యింది
తెలంగాణా ఉద్యమం విషయంలో టీడీపీ పోషిస్తున్న పాత్ర పట్ల అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామా చేసి నవ తెలంగాణా పార్టీ స్థాపించాడు. ఈ విషయంలో కేసీఆర్ కు దేవేందర్ గౌడ్ కు సారూప్యత ఉంది. కేసీఆర్ కూడా టీడీపీ నుంచే బయటికి వచ్చి తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు
ఇద్దరి లక్ష్యం ఒకటే. కానీ దేవేందర్ బాణం గురి తప్పి రాజకీయంగా అగాధంలో పడ్డాడు, సరైన వ్యూహంతో కేసీఆర్ విజయం సాధించాడు. నవ తెలంగాణా పార్టీ పెట్టి విఫలమయిన దేవేందర్ గౌడ్ ఇంకో పొరపాటు చేశాడు
ఆ పార్టీకి సరైన స్పందన రావడం లేదని గ్రహించి నవ తెలంగాణా పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసి అసెంబ్లీకి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న దేవేందర్ గౌడ్ ప్రజల పల్స్ కనుగొనడంలో విఫలం అయ్యాడు
అర్థంతరంగా పొలిటికల్ కెరీర్ అటకెక్కటంతో దేవేందర్ గౌడ్ కి తను చేసిన తప్పు తెలిసి వచ్చింది. తాను టీడీపీ నుంచి బయటికి వచ్చి చారిత్రక తప్పిదం చేసానని ఒప్పుకుంటూ తిరిగి టిడిపీలో చేరి రాజ్యసభ సభ్యుడు అయ్యారు
పొలిటికల్ కెరీర్ తిరిగి గాడిన పడుతుంది అనుకుంటున్న టైములో అనారోగ్యం రూపంలో దురదృష్టం దేవేందర్ గౌడ్ ను మరోసారి వెక్కిరించింది. దాంతో చాలాకాలం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు
ఇదిగో మళ్లీ ఇన్నాళ్లకు తను రచించిన విజయ తెలంగాణా బుక్ ఆవిష్కరణ చేస్తూ వేదిక మీద కనిపించారు. అదీ ఒకప్పటి టీడీపీలో తన సహచరుడు, ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ చేస్తూ…
తొందరపాటు నిర్ణయాల వల్ల రాజకీయాల్లో ఉత్థాన పతనాలకు దేవేందర్ గౌడ్ ఒక ఉదాహరణ. అన్నట్టు ఈ దేవేందర్ గౌడ్ హోమ్ మినిస్టర్ గా వెలిగిపోతున్న రోజుల్లో వారిని ఓ పని మీద ఇంటికెళ్ళి కలిసాము. అప్పుడు ఈయన సహచరుడు తదనంతరం టీఆర్ఎస్ లో చేరి మినిష్టర్ అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా అక్కడే ఉన్నారు
మేమున్న కాసేపట్లో బోలెడుమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు దేవేందర్ ఇంటికి క్యూ కట్టారు. అప్పుడు అర్దమైంది టీడీపీలో దేవేందర్ గౌడ్ నెంబర్ 2 గా ఎలా ఎదిగాడో అని… ఇప్పుడు అదంతా గత చరిత్ర అయిపోయింది !!
Share this Article