Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…

September 16, 2025 by M S R

.

Devi Prasad C …. డిసెంబర్ నెలలో కులుమనాలి మంచుకొండల్లో “దేవి” సినిమా షూటింగ్ జరుగుతోంది.
ఒంటిమీద ధరించిన ఊలు కోట్లు, మంకీ క్యాప్‌లు, గ్లౌజ్‌లు, రబ్బరు షూస్‌ని చీల్చుకుని మరీ శరీరాల్లోకి దూరి ఎముకల్ని కొరికేస్తోంది చలి.

వెళ్ళిన మొదటిరోజు మంచులో దొర్లి పాటలు పాడిన హీరోలను తల్చుకుంటూ, ఆ వెండి కొండల నడుమ మేమూ హీరోల్లా ఫీలైపోయి మంచుముద్దలు విసురుకుంటూ ఆడుకున్నాము. రెండోరోజునుండే తిరిగి వెళ్ళబోయే 10 వ రోజు ఎప్పుడొస్తుందా అనుకుంటూ రోజులు లెక్కపెట్టుకోవటం మొదలుపెట్టాం.

Ads

చేతిలోవున్న స్క్రిప్ట్ ప్యాడ్ జారి కిందపడేది కూడా తెలియటం లేదు. షూస్ లోపల అరికాళ్ళ చర్మం ఊడిపోతుందేమో అని ఫీలింగ్.

లోకల్ డ్రైవర్లు సిలోఫన్ కవర్స్ తీసుకొచ్చి ఇచ్చి, సాక్స్ మీద వాటిని తొడుక్కుని షూస్ వేసుకోమని చెప్పారు. తర్వాత కొంచెం నయం. లోకల్‌వాళ్ళు కొందరు పొట్టలకు నిప్పులు నింపిన మట్టిపిడతలు కట్టుకునివుండటం చూశాము.

కొంచెం ఎత్తుగాఉన్న ప్రదేశంలో ఓ సన్నివేశం చిత్రీకరణ జరుగుతోంది.
ఉన్నట్టుండి తెల్లటి మంచుపొరలు కమ్మేయటంతో అడుగు దూరంలో ఉన్న మనిషి కూడా కంటికి కనిపించలేదు. అది క్లియర్ అయ్యాక మంచు కురవటం మొదలవ్వటంతో కొంతసేపు బ్రేక్ ఇద్దామన్నారు డైరెక్టర్‌ గారు.

అందరం పక్కనున్న చెక్క ఇళ్ళ వరండాల క్రింద చలికాచుకోవటానికి ఏర్పాటు చేసిన నిప్పుల మూకుళ్ళ చుట్టూ చేరాం. గురువు గారు, హీరోయిన్ ప్రేమ, మేమందరం ఓచోట ఉన్నాం.
కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం కనీసం మంకీక్యాప్ కూడా పెట్టుకోకుండా, ఇన్షర్ట్ చేసిన వైట్&వైట్ డ్రెస్ లో, చేతిలో ఫైల్ పట్టుకుని, వెన్నెల్లో విహారయాత్ర చేస్తున్నట్లు రోడ్‌పైన అటూఇటూ తిరిగేస్తున్నాడు.
ఆయన మా ప్రొడక్షన్ కంట్రోలర్.పేరు “మురళి”.

బక్కపలుచగా ఉండే ఆయన్ని ఇండస్ట్రీలో అందరూ “టక్కు మురళి” వైట్&వైట్ మురళి అంటారు.
మా రూమ్మేట్ వినోద్ మాత్రం, మురళి గారు మీసాలు లేకుండా తల వెనుక జులపాలు పెంచుకుని ఉంటారు గనుక “శాపవశాత్తు భూమ్మీద సంచరిస్తున్న యక్షుడు” అని, డ్రెస్సింగ్ స్టైల్‌గా వుంటుంది కనుక “జాన్‌ ట్రవోల్టా” అని పేర్లు పెడుతుండేవాడాయనకి. వయసులో మాకన్నా చాలా పెద్దవాడాయన.

డైరెక్టర్‌ గారు ఆయన్ని లోపలికి పిలిచి “ఏంటి మురళి గారూ స్వెట్టర్లూ గట్రా వేసుకోకుండా కనీసం చలికాచుకోకుండా అలా తిరిగేస్తున్నారు, మీకు చలి లేదా” అని అడిగారు.

మురళి గారు ఓ కనుబొమ్మ పైకెత్తి చిరునవ్వు నవ్వుతూ ” సార్, మీ అందరూ ఎందుకంత చలి ఫీలౌతున్నారో అర్ధం కావట్లేదు. చెబితే నమ్మరు, నాకు చలి అంటే ఏంటో తెలీదు. ఊటీ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడు కూడా రాత్రి చొక్కా వేసుకోకుండానే పడుకుంటాను. ఎంత ఎండలోనైనా సరే క్యాప్ కూడా అవసరం లేదు నాకు. చిన్నప్పట్నించీ అంతే సార్ నేను. అసలా పవర్ ఎలా వచ్చిందో నాకూ అర్ధం కాదు సర్. బహుశా జీన్స్ అలాంటివి అనుకుంటాను” అంటూ ఒకింత గర్వంతో నవ్వుతూ చేతిలో ఫైల్ ఊపుకుంటూ మంచులోకి వెళ్ళిపోయారు.

మురళి గారు గ్రేటండీ బాబు అనుకున్నారు అందరూ.
ఓ అరగంట తర్వాత మంచు క్లియర్ అయ్యాక మళ్ళీ షూట్ మొదలైంది. డైరెక్టర్‌ గారు సడెన్‌గా క్రింద ఘాట్‌రోడ్ వైపు చూపిస్తూ “ఏంటి అక్కడ మన యూనిట్ బస్ దగ్గరేదో హడావిడి జరుగుతోంది” అంటే క్రిందికి చూశాము.
లోకల్ డ్రైవర్లు కొందరు హడావిడిగా దేన్నో మోస్తూ బస్‌లోకి ఎక్కిస్తుంటే మరో ఇద్దరు ఎక్కడికో పరుగులు తీస్తున్నారు.

అంతలో ఓ ప్రొడక్షన్ బోయ్ పరిగెట్టుకుంటూ వచ్చి “సార్ సార్ నీలుక్కుపోయాడు సార్”అన్నాడు.
ఎవరు…?అన్నారు గురువు గారు.
“మన మురళి గారే సర్… చలికి నీలుక్కుపోయాడు. నోట మాట రావట్లేదు. సీరియస్సేననుకుంటా” అన్నాడు.
క్రిందికి పరిగెట్టాము. బస్‌లోకి ఎక్కాము.

డ్రైవర్లందరూ గుమిగూడి వుండటంతో “ఊ..ఊ… ఆ…అని మూలుగులు మాత్రమే వినిపించాయి. డ్రైవర్లు పక్కకు తప్పుకున్నాక కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యాము.
బస్ చివరి సీట్‌లో ఒంటిమీద అండర్‌వేర్ తప్ప మరేమీలేని మురళి గారు కళ్ళుమూసుకు పడుకుని మూలుగుతుంటే బాటిల్‌లోని రమ్ము ఆయన ఒంటిమీద పోసి రుద్దుతున్నారు డ్రైవర్లు. అలాంటి పరిస్థితుల్లో అలాగే చేయాలని చెప్పారు వాళ్ళు.
తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్తే గండం గడిచింది.

తర్వాత తలచుకున్నప్పుడు ఆ సంఘటన నవ్వు తెప్పించినా అప్పుడు మాత్రం టెన్షన్ పెట్టింది.
వైజాగ్ లో ఆ “దేవి” సినిమా షూటింగ్ లోనే ఓ పాముల కుర్రాడు చనిపోయినప్పుడు వెక్కివెక్కి ఏడ్చారు మురళి. అంత సున్నితమనస్కుడు.
తర్వాతి కాలంలో నా దర్శకత్వంలోనూ రెండు సినిమాలకు పనిచేశారాయనాయన.

వయసుల్లో ఉండగా ఓ అమ్మాయిని ప్రేమించినా కుటుంబ బాధ్యతల వల్ల పెళ్ళి చేసుకోలేదట.
35 ఏళ్ళు దాటాక ఓ బ్యాంక్ మేనేజర్‌గా చేస్తున్న అమ్మాయి ఇష్టపడి చేసుకుంటానన్నా, ఆచారాలు నిష్టగా పాటించే మన కుటుంబంలో కులం కాని పిల్లని చేసుకుంటావా అని కుటుంబసభ్యులు అడ్డు చెప్పారట.
45 ఏళ్ళ వయసు దాటాక ఇద్దరు ఆడపిల్లల తల్లి అయిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ తో కొంతకాలం సహజీవనం చేశారు.

వాళ్ళ రెండో అమ్మాయిని హీరోయిన్ ని చేయాలని ప్రయత్నిస్తూ, మా అమ్మాయి అంటూ సినిమా ఆఫీస్ లకు తిప్పేవాడు. తను సంపాదించిన డబ్బు కూడా వాళ్ళకోసం ఖర్చు పెట్టేవాడట.
ఆ అమ్మాయి హీరోయిన్ అయ్యింది కూడా. (కొద్ది సినిమాల్లోనే అనుకుంటా) ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో ప్రముఖ నటీమణిగా కొనసాగుతుంది ఆమె.

అలా అప్పటి ఆయన కోరిక నెరవేరినా వాళ్ళ నుండి విడిపోయి మద్రాస్ నుండి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక పూర్తిగా ఒంటరివాడైపోయాడు.
అప్పటికే 60 ఏళ్ళు దాటటంతో ఎప్పుడు కలిసినా “నా బ్రతుకెలా ఒంటరి బ్రతుకయిపోయిందో చూశారా సర్” అని బాధపడేవారు. వేరే ఊర్లలో ఉండే ఆయన తోబుట్టువులకూ వాళ్ళ బాధ్యతలేవో వాళ్ళకున్నాయని ఈయన్ని పట్టించుకోలేదట.

ఓరోజు నేను సంగారెడ్డిలో షూటింగ్‌లో ఉండగా ఫోనొచ్చింది. మురళి గారు పోయారు అని. ఓ ఏకాకి పయనం ముగిసింది.
ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కట్టుకున్న “బంధం”లో బాధ్యత కూడా కలిసిఉంటుంది కనుక కడదాకా తోడొస్తుంది.
ఎంత అందంగా కనిపించినా” సహజీవనం”లో “సంబంధమే” తప్ప “బంధం” “బాధ్యత”లుండవు కనుక అదెప్పుడైనా ముగిసిపోతుంది.
మా మురళి గారిని చివరిదాకా వదలకుండా తోడున్నది ఆయన “ఒంటరితనం” ఒక్కటి మాత్రమే. ________ దేవీప్రసాద్.

devi shooting

(మా పెళ్లి ఫోటోలో మా వెనుక ఉన్నది తనే- సర్కిల్)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చలి అంటే లెక్కేలేని ఆయన… హఠాత్తుగా బిర్ర బిగుసుకు పోయాడు…
  • ఆ ధూర్త పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడినట్టు..? ఇది మరోకోణం..!!
  • కంటెస్టెంట్ల ఎంపిక వెరీ పూర్ బిగ్‌బాస్… ఆట అస్సలు రక్తికట్టడం లేదు…
  • పేలవంగా, నిస్సారంగా తెలుగు ఇండియన్ ఐడల్ ‘ప్రి రిలీజ్’..!!
  • శంఖం ఊదితే సుఖనిద్ర… ఊపిరితిత్తులకు వ్యాయామం…
  • నేపాల్ అల్లర్ల వెనుక ‘వెరీ డీప్ స్టేట్’… అసలు కథలేమిటంటే..? పార్ట్-2 ….
  • నేపాల్ దహనకాండకు అసలు కారకులెవరు..? రియల్ స్టోరీస్..!!
  • మనమే రెచ్చగొడుతూ, రచ్చ చేస్తూ… అశాంతి, ప్రమాదాల్ని ఆహ్వానిస్తున్నాం…
  • ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
  • ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions