.
… ‘మతంలోని ఓ మోసపూరితమైన విషయం కులం’ అంటారు పెరియార్. అందుకే అందరూ తమ కులవృత్తుల్ని మానేసి, కులాలతో సంబంధం లేని పనులు చేసుకోవాలని సూచించారు. వివక్ష, నిరాదరణ, అంటరానితనానికి కులమే మూలం అయినప్పుడు ఆ కులాన్ని ప్రతిబింబించే పనిని విడిచిపెట్టమని ఆయన సూచన. అయితే అది అంత సులభమా? అంత తేలికా?
జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల కులాల జాబితా తీస్తే చాలదా నిజం తేలడానికి? సఫాయి కర్మాచారీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి కులాలేమిటో చూస్తే చాలదా? నగరాల్లో ఇన్ని వేల అపార్ట్‌మెంట్లున్నాయి. వాటికి వాచ్‌మెన్లుగా పనిచేస్తున్నవారి కులాల లెక్క తీస్తే, 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉంటారు.
Ads
స్కూల్ డ్రాపవుట్స్, బాల కార్మికుల కులాల లెక్కలు తీయండి. దేశంలో ఏటా 4.33 కోట్ల మంది ఉన్నత విద్య చదువుతూ ఉంటే, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తాన్ని కలిపినా దాదాపు 2.86 కోట్లు మించడం లేదు. ఇంక విడివిడి లెక్కలు తీస్తే సంఖ్య ఇంకా తగ్గుతుంది.
2018-2023 మధ్య సుమారు 13 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల నుంచి డ్రాపవుట్ అయ్యారు. ఇదీ దేశంలో కులాలు, ఆ వర్గాల్లోని పరిస్థితి. ఇలాంటి చోట శ్మశానంలో బతికే కొందరు నిరుపేద తల్లులుంటారని, వారికీ కలలుంటాయని ఎవరికి తెలుసు? ఎవరు గుర్తించారు?
మరాఠీ దర్శకుడు శివాజీ లోతన్ పాటిల్ 2014లో తీసిన సినిమా ‘ధగ్’… ‘ధగ్’ అంటే భగభగ మండుతున్న మంట అని అర్థం. మరాఠీ నేల మీదున్న కులాల తీరు, వారి జీవనస్థితిగతులను మొదటి సినిమాలోనే అద్భుతంగా తెరపై చూపించారు శివాజీ. ఉషా జాదవ్, ఉపేంద్ర లిమాయే, హన్స్‌రాజ్ జగ్‌తప్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. కథేంటి?
శ్మశానంలో జీవించే ఓ కుటుంబం. వచ్చిన శవాల కోసం కట్టెలు కొట్టి, పేర్చి, శవాన్ని దహనం చేసి, వారిచ్చే డబ్బుతో పొట్టపోసుకునే జీవితాలు వారివి. ఇంటి యజమానికి కొడుకు, కూతురు. కొడుకు చురుకైనవాడు. చదువులో మెరిక.
తనలాంటి జీవితం తన కొడుక్కి రాకూడదని తండ్రి కలలు కంటూ ఉంటాడు. తండ్రి జీవితాన్ని గమనిస్తూ ఉన్న కొడుకు సైతం అదే ఆశయంతో చక్కగా చదువుకుంటూ ఉంటాడు. తల్లి ఆశ కూడా అదే! కొడుకు బాగా చదువుకోవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, అందరిలోనూ పేరు తెచ్చుకోవాలి.
కానీ తామున్న స్థితిలో సాధ్యమేనా? ఆమె ఆలోచనలు ఆమెవి. కాలం ఇలా సాగుతున్న వేళ నిద్రపోయిన ఇంటిపెద్దను పాము కాటేసింది. అతను చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు దిక్కు? ఏదీ ఆదరువు? ఏం పని చేసి పోషించాలి?
పిల్లలు చిన్నవాళ్లు. కాబట్టి తల్లే ఏదో పని చేసి వాళ్లని పోషించాలి. కానీ శ్మశానంలో బతుకును వెల్లదీసిన ఆమెకు బయట ఎవరు పని ఇస్తారు? ఆమె బయట పనికి వెళ్తే శ్మశానాన్ని చూసేదెవరు? స్త్రీ అయ్యుండి శ్మశానంలో శవాలను కాల్చగలదా? కాలిస్తే ఊరి జనం ఒప్పుకుంటారా?
చుట్టూ ఉన్న మగవాళ్ల ఆకలి చూపుల్ని ఎలా తట్టుకోవాలి? లోపల ఎన్నెన్నో ప్రశ్నలు. బయట ఆకలితో దహించుకుపోతున్న కడుపులు. ఈ సమస్యలు తీరేందుకు కొడుకును ఆ పని చేయమని అడుగుతుంది తల్లి. ఎలా? ఎలా చేస్తాడు?
ఏ పని అయితే తాను చేయకూడదని తన తండ్రి భావించాడో ఇప్పుడు తాను అదే పని చేయాలా? ఇంతేనా తన బతుకు? ఇదేనా తన లక్ష్యం? ఈ పని ఇలా కొనసాగాల్సిందేనా? ఆ పిల్లాడిలో మథనం. అంతర్మథనం.
అర్ధరాత్రి లేచాడు. కట్టెలు కొట్టడం మొదలుపెట్టాడు. తన కోపాన్ని, ఆక్రోశాన్ని ఆ కట్టెలపై చూపాడు. ఆ శబ్దానికి తల్లి లేచింది. కొడుకును దగ్గరకు తీసుకుంది. తన కొడుకే తన ఆదరువు అనుకుంది. అతని భవితకు తాను అడ్డుపడకూడదనుకుంది. తానే కన్న కలను తన చేతులారా తనే ఆపకూడదని భావించింది.
కానీ కొడుకు తల్లి మనసు అర్థం చేసుకున్నాడు. ఇటు పని చేస్తూనే తన చదువును కొనసాగించడం మొదలుపెట్టాడు. రేపోమాపో పెరిగి పెద్దవాడై తల్లి కలని నెరవేరుస్తాడన్న ఆశతో కథ ముగిసింది.
ముంబయి మహానగరంలోని బాలీవుడ్ పరిశ్రమ మరాఠీ సినిమాని మింగేయాల్సినంత మింగేసింది కానీ, మరాఠీ సినీరంగం తన ఉనికి, ఉత్కృష్టతను చాటుకోవడానికి చాలా బలమైన సినిమాలు తీస్తూనే ఉంది. 2004 తర్వాత కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు, కొత్త కథలతో అక్కడ ప్రయోగాలు మొదలయ్యాయి. ఆ ఒరవడిలో వచ్చిన దర్శకుడు శివాజీ లోతన్ పాటిల్ విలక్షమైన కథతో అరంగేట్రం చేశారు.
చిత్రంలో ఇంటిపెద్దగా ఉపేంద్ర లిమాయే, అతని భార్యగా ఉషా జాదవ్, వారి కొడుకుగా హన్స్‌రాజ్ జగ్‌తప్ పోటీ పడి నటించారు. కొడుకు కోసం ఆరాట పడే తల్లిగా నటించిన ఉషా జాదవ్‌కు జాతీయ ఉత్తమ నటి పురస్కారం దక్కింది.
జాతీయ ఉత్తమ దర్శకుడిగా శివాజీ లోతన్ ఎంపికయ్యారు. కృష్ణ అనే 12 ఏళ్ల బాలుడి పాత్రలో అద్భుతంగా నటించినందుకు హన్స్‌రాజ్ జగ్‌తప్‌కు జ్యూరీ ప్రత్యేక పురస్కారం అందించారు. ఈ సినిమా యూట్యూబ్‌లో English Subtitlesతో అందుబాటులో ఉంది…. – – విశీ (వి.సాయివంశీ)
Share this Article