దట్టమైన అడవులు… గుట్టలు… వందల మంది మావోయిస్టులు, సాయుధ బలగాల మధ్య కాల్పులు… యుద్ధం… దండకారణ్యానికి ఈ సమరం కొత్తేమీ కాదు… రాజ్యానికీ, తిరుగుబాటుకూ నడుమ నిత్యసమరమే అక్కడ… మొన్న కూడా యుద్ధం జరిగింది… 23 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు… 31 మందికి గాయాలు… నలుగురైదుగురు నక్సలైట్లు కూడా మరణించారు… ఎందరికి గాయాలయ్యాయో తెలియదు… కానీ రాకేశ్వర్ సింగ్ అనే ఒక జవానును బందీగా తీసుకెళ్లారు మావోయిస్టులు… అంతటి ఉద్రిక్త సమరప్రాంతంలో దొరికిన ‘వర్గశత్రువు’ను మావోయిస్టులు చంపేయకుండా తమతోపాటు తీసుకెళ్లడం విశేషమే… యుద్ధం వేరు, ఎవరికి ఎవరు దొరికినా ఎవరూ వదలరు… చంపుడు పందెమే అది… కానీ ఇలా బందీగా పట్టుకోవడం, ఏవో డిమాండ్లు పెట్టడం, ఆ కుటుంబాలను, బందీలను మానసికక్షోభకు గురిచేయడం నక్సలైట్ల రణనీతిలో గతంలో ఎప్పుడూ కనిపించలేదు… నిజానికి పీపుల్స్‌వార్‌గా ఉన్నప్పుడే కిడ్నాపుల తంత్రాన్ని కూడా వదిలేశారు నక్సలైట్లు… సరే, ఈ సైద్ధాంతిక తప్పొప్పుల చర్చలోకి ఇక్కడ పోలేం గానీ… ఆ జవానును నిన్ననే వదిలేశారు… వదిలేయకతప్పదు… తప్పలేదు…
అలా తమంతటతామే వదిలేయలేదు… లోకల్ జర్నలిస్టులు, స్వచ్ఛందసంఘాల ప్రతినిధులు గట్రా ఓ టీం వెళ్లింది… మావోయిస్టు ముఖ్యులతో మాట్లాడింది… (ఏం మాట్లాడారు, ఎవరు పంపించారు అనేవి ఇక్కడ అప్రస్తుతం… అవి ఇప్పుడప్పుడే బయటపడవు కూడా…) తరువాత మావోయిస్టులు వందలమంది గ్రామస్థులను సమావేశపరిచి, అందరి ఎదుటే జవానును ఆ బృందానికి అప్పగించారు… బస్తర్ ఏరియా జర్నలిస్టులు తమ టూవీలర్లపై జవానును ఎక్కించుకుని, సాయుధ బలగాల క్యాంపులో అప్పగించారు… అదీ జరిగింది… ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తికరంగా కనిపించింది ఒక ఫోటో… పైన కనిపించేది అదే… అందులో ఒక ముసలాయన ఉన్నాడు… ఆయన కూడా మధ్యవర్తిగా వెళ్లినవాడే… తన వయస్సు తెలుసా..? 92 ఏళ్లు..! ఆ వయస్సులో కూడా ఆ అడవుల్లో పడి వెళ్లి, మావోయిస్టులతో మాట్లాడి, ఈ ‘బందీ వివాదానికి’ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు… ఆయన పేరు ధరమ్‌పాల్ సైనీ… అందరూ తావుజీ అంటారు… అంటే పెద్దయ్య…
Ads
ఆయన గురించి చెప్పుకోవడం కోసమే ఈ కథనం… నిజానికి ఆయనది ఈ ఏరియా కాదు… మధ్యప్రదేశ్‌లోని ధార్… గాంధీ బాటలో నడిచేవాడు… వినోభా భావే శిష్యుడు… సమాజసేవకే అంకితమై పెళ్లి కూడా చేసుకోలేదు… ఒకసారి ఏదో పత్రిక వార్త తనను కదిలించి, బస్తర్ ఏరియాలో పిల్లల విద్యకు కృషి చేయాలని సంకల్పించాడు… ప్రత్యేకించి ఆడపిల్లల విద్య…! అసలే దండకారణ్యం… గిరిజనం… తీవ్రవాద ప్రాబల్యం అధికం… పైగా అక్కడ ఆడపిల్లల చదువు పట్ల తిరస్కారం… అందరూ నిరుత్సాహపరిచారు… ఐనా సరే, తన గురువు వినోభా భావేకు నచ్చజెప్పి బస్తర్ ఏరియాకు చేరుకున్నాడు… దిమ్రాపాల్లో బడి తెరిచాడు… దీనికి అప్పటి ముఖ్యమంత్రి నుంచి అందిన విరాళం అయిదు రూపాయలు, అదీ వినోభా భావే చెబితే… రెండు గదులు, ఇద్దరు టీచర్లు… కానీ చదవడానికి వచ్చేవాళ్లు ఏరీ..? ఇల్లిల్లూ తిరుగుతూ, నచ్చజెబుతూ, బతిమిలాడేవాడు… మొదట్లో అలా చేరినవాళ్లు నలుగురు… అయితేనేం, నిరాశపడలేదు…
మెల్లిమెల్లిగా గిరిజనానికి తన కమిట్మెంట్ అర్థమైంది… ఆడపిల్లలను చేర్పించసాగారు… చదువే కాదు, జీవన నైపుణ్యాలు, ఆటలు కూడా నేర్పించేవాళ్లు… ఒక్కో ఊరికీ బళ్లను విస్తరించసాగారు… వినోభాభావే అమ్మ పేరు మీద పెట్టిన మాతా రుక్మిణీదేవి ఆశ్రమ పాఠశాలలు అవి… ప్రభుత్వం కూడా సహకరించసాగింది… తను గాంధేయుడు… తన వ్యాపకమేదో తనది… వివాదరహితుడు… అందుకే… ఇదుగో ఇలాంటి చిక్కు సమస్యలు వచ్చినప్పుడు తను పెద్దయ్యే అవుతాడు… అంటే పెద్దమనిషి… వయస్సులోనే కాదు, పెద్దరికంలోనూ..! అందుకే బందీ జవానును విడిపించుకొచ్చిన మధ్యవర్తుల బృందంలో తనూ ఉన్నాడు… ఆయన ఓ త్యాగి, ఓ యోగి… ఎందరుంటారు ఇలాంటివాళ్లు…? పెద్దయ్యా… నమస్తే…!!
Share this Article