బహుశా ఏ దేశంలోనూ మునుపెన్నడూ ఏ సమాజమూ ఎరగనంత దోపిడీ కావచ్చు ఇది… అదే కేసీయార్ ధరణి పేరిట సాగించిన అత్యంత భారీ తీవ్ర భూఅక్రమం… ధరణినే చెరబట్టిన స్కామ్…
లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో నియంతలు కూడా ఈ రేంజ్ అక్రమాలకు పాల్పడి ఉండరు… అవన్నీ ఎలా ఉన్నా సరే… మన దేశంలోనే అత్యంత అవినీతిపరులైన నాయకులు కూడా హాశ్చర్యపోయి, సిగ్గుపడే అక్రమమేమో ఇది…
25 లక్షల ఎకరాలు… మళ్లీ చదవండి… ఏకంగా 25 లక్షల ఎకరాల్ని పట్టా భూములుగా మార్చేశారు… ‘పైనుంచి’ వచ్చిన ఆదేశాలతో ఇన్ని లక్షల ఎకరాలను ధరణి నిర్వాహక టెక్ ఏజెన్సీ టెర్రాసిస్ ఈ దుర్మార్గానికి పాల్పడింది… ‘పైనుంచి’ అంటే ఎవరి నుంచి..? ‘పైవాడు’ అంటే ఎవరు..? అసలు ఈ టెర్రాసిస్ ఎవరిది..? ఈ దుష్టభూయజ్ఙం కోసమే క్రియేట్ చేయబడిన విష రాక్షససంస్థా..?
Ads
వెలుగు పత్రిక ఎక్స్‌క్లూజివ్ స్టోరీ ఓసారి పరిశీలిస్తే… ధరణికి ముందు 1.30 కోట్ల ఎకరాల పట్టా భూములు… ధరణి వచ్చాక 1.55 కోట్ల ఎకరాలు… ప్రభుత్వ, అటవీ, దేవాదాయ, వివాదాస్పద, ఇనామ్, వక్ఫ్ భూములు పట్టా భూములైపోయాయి… ఎవరి కోసం..? ఇంకెవరి కోసం ఆలోచించండి…
అవును, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు (సీఎస్ కూడా) మార్చేశారట… నిజానికి ఏ దేశమైనా, ఏ సమాజమైనా సరే, భూమి కోసం పోరాటాలుంటయ్… అంగుళం భూమి కూడా వదలుకోరు ఎవ్వరూ… సగం శాంతిభద్రతల సమస్యలు దీనికోసమే… అలాంటిది 25 లక్షల ఎకరాల భూఅక్రమాలు అంటే… జగం నివ్వెరపోయే రేంజ్ అక్రమం… పెద్ద దొరా, నీ తెలివికి నిజంగానే జోహార్లు…
ప్రపంచం గుర్తించిన రైతాంగ సాయుధపోరాటంలో కొన్ని లక్షల ఎకరాల్ని పేదలు ఆక్రమించుకున్నారు… స్వాతంత్ర్యానికి పూర్వం… తరువాత స్వరాజ్యం వచ్చింది, అన్నీ గాయబ్… మళ్లీ భూస్వాములపాలు… (పీవీ తెచ్చిన భూపరిమితి చట్టం మాత్రం నభూతో నభవిష్యతి… కారణజన్ముడు)…
తరువాత నక్సలైట్ల పోరాటాలతో కొన్ని వేల ఎకరాలను మళ్లీ పేదలు ఆక్రమించుకున్నారు… సీన్ కట్ చేస్తే… ప్రత్యేక రాష్ట్రం వచ్చింది… ఇదుగో చూశారు కదా… 25 లక్షల ఎకరాల భూమి హాంఫట్… (ఒక దొర పీవీకి, మరో దొర కేసీయార్‌కూ నడుమ ఎంత కంట్రాస్టు..?)
ఇది పోరాటాల గడ్డ, చైతన్యానికి అడ్డా, ధిక్కార ప్రతీక, తిరుగుబాటు పతాక… అని చాలా చెప్పుకుంటాం తెలంగాణ నేల గురించి..? ఏమైంది..? ఇదుగో చూశారు కదా… ఇదీ ఎడ్డి తెలంగాణ… కళ్ల ముందే అత్యంత తీవ్ర అక్రమాలను చూస్తూ దొరను కీర్తించింది.., కొన్ని నగదు బదిలీ పథకాల బిస్కెట్లను పారేసి, భీకరమైన స్కాములు…
వేల కోట్ల విద్యుత్తు కొనుగోళ్లు, లక్ష కోట్ల కాళేశ్వరం, వందల కోట్ల గొర్లు, వేల కోట్ల రైస్ మిల్లుల సీఎమ్మార్, అత్యంత నీచమైన ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి… సామంతరాజులుగా మార్చేయబడిన ఎమ్మెల్యేల అరాచకాలు… అన్నింటినీ మించి ధరణి…
ఈ ప్రభుత్వం వచ్చాక ధరణిని ఆపేసి… ధరణి అక్రమాల నిగ్గు తేల్చడానికి… కేరళ సెక్యూరిటీ ఆడిట్ అస్యూరెన్స్ సెంటర్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు ఫోరెన్సిక్ ఆడిట్ బాధ్యతను అప్పగించింది… దానికి ముందే ఈ నిర్వాకాలకు సాంకేతిక బాధ్యత వహించాల్సిన టెర్రాసిస్ తామేం చేశామో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిందని వెలుగు కథనం…
నివ్వెరపోయే నిజాలు… ఎక్కడా అడ్డుపడకుండా ఏకంగా వీఆర్వోలనే రద్దు చేసిపారేయడం ఇందుకేనా..? నిజంగా ఓ డౌట్… గత పదేళ్ల దుర్మార్గపు పాలన తాలూకు అక్రమాల బాధ్యులను రేవంత్ రెడ్డి శిక్షించగలడా..? తనకు మరో పదేళ్లు కావాలేమో అన్నీ తవ్వి నిజాలేమిటో జనానికి చెప్పడానికి..?
ఈ-ఫార్ములా కేసులో గవర్నర్ ఆల్రెడీ అరెస్టులకు పర్మిషన్ ఇచ్చాడు, ఏమీ జరగలేదు, మళ్లీ ఇప్పుడు చార్జిషీట్లు దాఖలు అట… కాళేశ్వరాన్ని సీబీఐకి ఇచ్చేశాడు… ఫోన్ ట్యాపింగ్ ఎటూ కదలడం లేదు… మన పోలీసులతో ఏమీకాదు… సీఎమ్మార్ కుంభకోణంపై చర్యల్లేవు… గొర్ల కుంభకోణంపై ఈడీ కేసు, కాగ్ నిజాల వెల్లడి, నిల్ యాక్షన్… విద్యుత్తు కుంభకోణాల రిపోర్టు దగ్గరున్నా నో యాక్షన్… భయమెందుకు పాలకా..?
మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ రహస్య దోస్తీ… కాంగ్రెస్ నిష్క్రియాపరత్వం… ఇదీ ప్రస్తుత తెలంగాణ..? గులాబీ శిబిరం పదే పదే వాడే ఓ మాట… ‘ఎవనిపాలైందిరో తెలంగాణ’ అని… నిజమే… గత పదేళ్లపాలన చూస్తే మనమూ ఎలుగెత్తి అనాల్సిన మాట కూడా అదే…!! విముక్తిపోరాటాలకు ముందూ దొరలే… స్వరాష్ట్ర సాధన తరువాతా దొరలే..!!
Share this Article