Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!

September 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi    … శోభన్ బాబు , జయసుధ అదరగొట్టేసారు . తల్లిదండ్రుల్ని నిరాదరించే బిడ్డలు , మోసం చేసే బిడ్డలు , నడిరోడ్డుపై నిల్చోబెట్టే బిడ్డలు కలియుగంలో , ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో చాలా మామూలు . అలాంటి కధాంశాల మీద చాలా సినిమాలే వచ్చాయి . ఈ సినిమా కధాంశాన్ని ఓ గొప్ప మలుపుతో , ముగింపుతో నేసారు దాసరి .

ఆదర్శవంతుడైన ఓ స్కూల్ మాస్టారు తన ముగ్గురు కుమారులను బాధ్యత కలిగిన లాయరుగా , డాక్టరుగా , పోలీస్ వాడిగా చేయాలనే తపనతో తలకు మించిన భారాన్ని ఎత్తుకుని సఫలం అవుతాడు . అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కారు . తల్లిదండ్రులను కన్విన్స్ చేసో , ఎదిరించో పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవటం మామూలే . లేని గర్భాన్ని తెప్పించి తల్లిదండ్రులను మోసం చేసి ప్రేమించిన పడతిని చేసుకుంటాడు ఒక కొడుకు . అదే బాటలో మరో కొడుకు .

Ads

బిడ్డల అభ్యున్నతి కొరకు అప్పులు చేయటం తల్లిదండ్రుల బాధ్యత . తీర్చటం బిడ్డల బాధ్యత కాదు . అదీ ముసలోళ్ళదే . ఇది 21వ శతాబ్దంలో చాలా మామూలు . 20వ శతాబ్దం 1986 లోనే దాసరి ఈ సినిమాలో శోభన్ బాబు చేత ఆ డైలాగులను చెప్పించారు .

అప్పులన్నీ ముసలోళ్ళ మీదకు నెట్టేసి ముగ్గురు కొడుకులు పెళ్ళాలతో వెళ్ళిపోతారు . ముగ్గురూ డబ్బు మోహంలో పడి దుర్మార్గులు అవుతారు . ఎంత నీచానికి పాల్పడతారంటే తమ ఉద్యోగాలను , వృత్తులను అడ్డం పెట్టుకుని తల్లిని కోర్టులో పిచ్చిదాన్ని చేస్తారు . చివరకు ఆ క్షోభతో ఆమె మరణిస్తుంది .

ఆ వ్యధతో ఖిన్నుడైన తండ్రి తన ముగ్గురు కొడుకులకు సన్మానం జరిగే ప్రదేశానికి వెళ్ళి ముగ్గురినీ షూట్ చేసి చంపేస్తాడు . ఇది దాసరి మలుపు , కుదుపు . బహుశా ఇలాంటి మలుపు మన తెలుగు సినిమాల్లో ఇదే మొదటేమో !

కోర్టులో తన బిడ్డలను తానే ఎందుకు చంపవలసి వచ్చిందో చెపుతాడు తండ్రి . ఉరిశిక్ష విధించబడుతుంది . కోర్ట్ బోనులోనే కుప్పకూలి ప్రాణాలను వదులుతాడు తండ్రి . ప్రేక్షకులు భార హృదయాలతో థియేటర్లలో నుండి బయటకు వస్తారు .

దాసరి కధను , స్క్రీన్ ప్లేని చాలా బిర్రుగా తయారుచేసుకున్నారు . నిరుద్యోగిగా ప్రస్థాన ప్రారంభం , డబ్బున్న అమ్మాయి చేత ప్రేమించబడి పెళ్లి చేసుకోవటం , ఒక బాధ్యత కల స్కూల్ మాస్టరుగా తరం కోసం తపించటం , బిడ్డల్ని కష్టపడి పెంచటం , వాళ్ళు కంటకులు అయితే వాళ్ళని తుదముట్టించటం , నిజాన్ని కోర్టులో నిర్భయంగా ఒప్పుకోవటం వంటి భిన్న పార్శ్వాలతో శోభన్ బాబు పాత్రను మలిచారు . అంతే గొప్పగా ఆయనా నటించారు . సమాంతరంగా నడిచే హీరోయిన్ పాత్రలో జయసుధ పోటాపోటీగా నటించింది . ఇద్దరికీ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే .

వీళ్ళిద్దరి పాత్రల తర్వాత అంత గొప్ప పాత్ర సత్యనారాయణది . మనసున్న కాబూలీవాలాగా అద్భుతంగా నటించారు . ఆయనా ఇలాంటి పాత్రలు చాలా వేసారు . ఇతర ప్రధాన పాత్రల్లో రాజా , సుధాకర్ ,రాజ్యలక్ష్మి , పవిత్ర , కళ్యాణి , హరిబాబు , కోట శ్రీనివాసరావు , గొల్లపూడి , ప్రభాకరరెడ్డి , అనిత , సాక్షి రంగారావు , డిస్కో శాంతి , జయలలిత , ప్రభృతులు నటించారు .

ఈ సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన మరో పాత్ర రామకృష్ణది . తలమునక అప్పుల్లో కూరుకుపోయినా బాల్యమిత్రుడి కొరకు రాత్రికి రాత్రి అప్పు చేసి తెల్లవారేకల్లా చనిపోతుందీ పాత్ర . గొప్ప పాత్ర . గుండెని పిండే పాత్ర .

సినిమాలో మనసులను కదిలించే సీన్లు , డైలాగులు చాలా ఉంటాయి . దాసరి డైలాగుల్ని బాగా వ్రాసారు . పదునుగా కూడా ఉంటాయి . దాసరి సినిమా అంటే నాటకీయత ఎక్కువగా ఉంటుంది . అది ఈ సినిమాలు కూడా కనిపిస్తుంది . బోరించలేదు . సంతోషం .

పాటలు గొప్పగా హిట్ కాకపోయినా థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . దాసరి వ్రాసిన వందే మాతరం పాట , దాని చిత్రీకరణ బాగుంటాయి . స్కూల్ పిల్లలతో ఉంటుంది ఈ పాట . సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాసిన న్యాయం ధర్మం ఎక్కడని లోకాన్నే ప్రశ్నించావు పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది .

బొమ్మలాంటి ముద్దు గుమ్మ , చిరునవ్వులు వెదజల్లెను డ్యూయెట్లు శోభన్ బాబు , జయసుధ మీద ఉంటాయి . హీ మాన్ శోభన్ గ్లామర్ని వాడుకోవాలి కదా ! పైగా మహిళా కధానాయకుడు . ముగ్గురు కొడుకులు , తమ భార్యామణులతో పార్కులో పాడుకునే పాట సీతాకాలం సాయంకాలం కూడా హుషారుగా ఉంటుంది . ఇంకా హుషారుగా ఉండే పాట డిస్కో శాంతిది . శ్రీకాకుళం చీరె కట్టి రాజమంద్రి రెవిక తొడిగి అంటూ సాగే ఈ పాటలో ఆమె డాన్స్ హుషారుగా ఉంటుంది .

జె వి రాఘవులు సంగీత దర్శకులు . పాటల్ని దాసరి , సిరివెన్నెల , దాసం గోపాలకృష్ణ వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ పాడారు . ఈ సందేశాత్మక భార సినిమా యూట్యూబులో ఉంది . కలియుగ బిడ్డల చేతిలో నలిగిపోతున్న తల్లిదండ్రులు తప్పక చూడాలి . నీచ నికృష్ట దుర్మార్గ బిడ్డలకు నా ఈ వ్యధాపూరిత రైటప్ అంకితం , సమర్పితం . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పరుగుల పోటీల్లో రారాజు… ఈ చిరుత ఇప్పుడు పరుగెత్తితే ఎగశ్వాస…
  • చెడబుట్టిన కొడుకుల్ని ఖతం చేయడమే ‘న్యాయమా’ దాసరీ..?!
  • రిట్రీట్..? మావోయిస్టుల ఆయుధసన్యాసం నిజమేనా..? వాట్ నెక్స్ట్..?!
  • అప్పటికీ ఇప్పటికీ భక్తసులభుడు చిలుకూరు వీసాల బాలాజీ..!!
  • అక్కడ హారన్ కొట్టరు… ట్రాఫిక్ గీత దాటరు… సెల్ఫ్ డిసిప్లిన్…
  • మంచు కాదు కంచు లక్ష్మి..! డ్రెస్‌ సెన్స్‌ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు…!
  • కృష్ణాజలాలపై కేసీయార్ తప్పుటడుగులకు రేవంత్ విరుగుడు ప్రయాస..!
  • కేసీయార్ బాపతు గోదావరి జలవైఫల్యాలకు రేవంత్‌రెడ్డి దిద్దుబాట..!
  • విరిగిన ఎముకలకు ‘క్విక్ ఫిక్స్’… నిమిషాల్లో అతికించే మ్యాజికల్ జిగురు..!!
  • విలనుడు రేపు చేస్తే కేరక్టర్ అవుతుంది గానీ వీరోయిన్ అయిపోదు కదా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions