.
ధర్మస్థల… కర్నాటకలో ప్రసిద్ధ శైవక్షేత్రం… ఇప్పుడు వార్తల్లోకి ‘కొన్ని కలిచివేసే విషయాల’తో వచ్చింది… సుప్రీంకోర్టు దాకా వ్యవహారం వెళ్లడంతో ఇప్పుడిది బాగా చర్చనీయాంశమైంది…
రెండు వారాల కింద మంగుళూరుకు చెందిన ఓ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు… 1995 నుంచి 2014 వరకు అత్యాచార బాధితులైన దాదాపు 100 మంది బాలికలు, మహిళల మృతదేహాలను వేర్వేరు ప్రదేశాల్లో ఖననం చేశానని చెప్పాడు…
Ads
నిజానికి చాలా సీరియస్ విషయమే… అంతకుముందు కూడా ఫిర్యాదులున్నాయి… కానీ ఈ సంఖ్య చాలా పెద్దది… పైగా తనే ఖననం చేశాను అంటున్నాడు… కానీ ఇన్నాళ్లూ ఎక్కడికో మాయమైపోయి, హఠాత్తుగా ఈ ఫిర్యాదులతో తనే పోలీసులకు వద్దకు వచ్చి చెబుతుండటంతో పోలీసులు మొదట కాస్త లైట్ తీసుకున్నారు…
తనను నమ్మలేదు… ఓ ప్రసిద్ధ మతసంస్థలో పనిచేసినట్టు చెబుతున్నాడు… సంస్థ కీలకవ్యక్తులు చంపుతామని బెదిరించినందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాననీ, కానీ ఇంకా ఇంకా ఆ అపరాధ భావనతో బతకలేక ఇప్పుడు పోలీసులకు చెబుతున్నానని అంటున్నాడు…
1. ఆ శవాల్ని ఖననం చేస్తున్నప్పుడు తప్పు అనిపించలేదా..? 2. హఠాత్తుగా ఇన్నేళ్లకు అపరాధ భావన మొదలు కావడం ఏమిటి..? 3. ఇన్నేళ్లూ ఎక్కడ బతికాడు..? 4. ఇంత భారీ సంఖ్యలో బాలికలు, మహిళలు అత్యాచారాలకు గురై, అక్కడికక్కడే ఖనన క్రియల పాలైతే ఎందుకు ఏమాత్రం లీక్ కాలేదు..? 5. అంత సంఖ్యలో ఫిర్యాదులు కూడా ఏమీ నమోదు కాలేదు… 6. ఈ హఠాత్ ఫిర్యాదుల వెనుక ఇంకేమైనా మర్మం ఉందా..? ఎవరైనా ఉన్నారా..?
….. ఇవీ బోలెడు ప్రశ్నలు… కానీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడతో సహా చాలామంది సీనియర్ న్యాయవాదులు ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు… ప్రభుత్వం మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు… అసలు ఈ దర్యాప్తు ఎలా మొదలుపెట్టాలో కూడా పోలీసులకు అంతుపట్టడం లేదు…
ఆ అస్థిపంజరాలను వెలికితీయాలి… ఆ సంఖ్యలో గనుక శవాల ఆనవాళ్లు దొరికితే అది పెద్ద కేసు అవుతుంది… వాటన్నింటికీ డీఎన్ఏ పరీక్షలు చేయాలి, పాత ఫిర్యాదులు ఏమైనా ఉంటే వాటిని క్రోడీకరించుకుంటూ ముందుకు వెళ్లాలి… పైగా ఇది ఓ మతక్షేత్రం కాబట్టి సున్నితమైన వ్యవహారం… ముందుగా ఫిర్యాదుదారుడిని ఎవరూ గుర్తుపట్టకుండా బ్లాక్ డ్రెసుతో కవర్ చేసి, మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు…
రెండు దశాబ్దాల కిందట తన కుమార్తె తప్పిపోయినట్లు చెబుతున్న ఒక మహిళ నేను డీఎన్ఏ పరీక్షలకు సిద్దమంటూ ముందుకొచ్చింది… “సామూహిక సమాధుల వెలికితీత జరగకూడదని, ఈ వాదనలు నిజమైతే ఎవరి పేర్లయితే బయటకు వస్తాయో… వారిని రక్షించాలని పోలీసులు ఒక వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది, అందుకేనా దర్యాప్తు సాగడం లేదు..?” అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె.వి. ధనంజయ్ ఆరోపించాడు…
ఒత్తిడి పెరుగుతుండేసరికి… కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు డీజీపీ ర్యాంక్ అధికారి ప్రణబ్ మొహంతి నేతృత్వం వహిస్తాడు… ఈ టీమ్‌లో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా మెంబర్స్…
ఈ క్షేత్రాన్నిదాదాపు 800 సంవత్సరాల కింద స్థాపించారు. ఇది శైవ దేవాలయం, ఇక్కడ పూజారులు వైష్ణవ సంప్రదాయానికి చెందినవారు, దాని నిర్వహణ జైన వారసుల చేతుల్లో ఉంది…
సదరు పారిశుద్ధ్య కార్మికుడు ఏమంటాడంటే..? ‘‘దుస్తులు లేని దేహాలు, లైంగిక హింసకు గురైనట్టు కనిపించే దేహాలను నాతో ఖననం చేయించారు… మాట్లాడితే చంపేస్తామని బెదిరించారు…’’ ప్రధానంగా తాను ఏయే ప్రదేశాల్లో శవాల్ని ఖననం చేశాడో కూడా చెబుతున్నాడు, చూపిస్తాను అంటున్నాడు… కొన్ని డీజిల్ పోసి కాల్చేశాడట కూడా…
తను చెబుతున్న నిందితుల్లో ధర్మస్థల క్షేత్ర నిర్వహణ ముఖ్యులు ఉన్నారట… అందుకే వారి పేర్లను చెప్పడం లేదు అంటున్నాడు… తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పిస్తే అందరి పేర్లూ వెల్లడిస్తాడట… నేను చెబుతున్నది నిజమే అనడానికి ఓ సమాధిని తనే తవ్వి, దానికి సంబంధించిన ఫోటోల్ని, ఆధారాల్ని ఇస్తూ మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు.,. ఇంత నేర తీవ్రత ఉంది కాబట్టే ఈ కేసు కర్నాటకలో కలకలం రేపుతోంది…
Share this Article