Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ది బెస్ట్ అన్ కట్… డైమండ్ టెల్గు యాడ్… బంగారం లాంటి భాష…

April 13, 2024 by M S R

’’నీ ఇల్లు బంగారంకాను…” అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ…మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే…కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే.

బంగారంలాంటి ఇల్లు;
బంగారంలాంటి సంసారం;
బంగారంలాంటి మనసు;
బంగారు పాప;
బంగారు తొడుగు;
నిలువెత్తు బంగారం;
బార్న్ విత్ గోల్డెన్ స్పూన్;
మన బంగారం మంచిదైతే…;
బంగారు గాలానికి బంగారు చేపలు పడవు;
బంగారు చెప్పులైనా కాళ్లకే తొడగాలి;
బంగారానికి తావి అబ్బినట్లు;
కంచు మొగునట్లు కనకంబు మోగదు;
లక్షాధికారైనా లవణమన్నమె గానీ…మెరుగు బంగారంబు మింగబోడు…

…ఇలా మన సామెతలు, వాడుక మాటల నిండా బంగారమే బంగారం. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత కోలార్ బంగారు గని తెలుగు భాష. తరగని భాష గని కని, విని పొంగిపోయే రోజులు పోయాయి కాబట్టి…అంతటి బంగారం కూడా దుమ్ముకొట్టుకుపోయింది. రంగు వెలిసిపోయింది. బంగారంలాంటి తెలుగు భాషను అక్షరీకరిస్తే…బంగారంలాంటి ఆ తెలుగు అక్షరాలను ఎక్కడ దొంగలెత్తుకుపోతారోనన్న జాగ్రత్త కొద్దీ ‘భీమ’బంగారం దుకాణం వారు భీమపరాక్రమంతో హీరో రామ్ చరణ్ చేత ఇంగ్లిష్ లో సంతకం చేయించి…తెలుగు పాఠకులకు హామీ ఇప్పిస్తూ తెలుగులో చెప్పించిన ఈ ప్రకటన చదవండి. బంగారానికి కూడా ఎలా తుప్పు పట్టించవచ్చో! బంగారానికి కూడా ఎలా చెదలు పట్టించవచ్చో! తెలుసుకోవచ్చు.

Ads

ఇందులో రామ్ చరణ్ తప్పు ఏమీ ఉండకపోవచ్చు. యాడ్ ఏజెన్సీ మొదట ఇంగ్లీషులో ఆలోచించి…ఇంగ్లీషులో రాసిన ప్రకటన గానీ; ఇంగ్లీషులో అలోచించి…తెలుగులోకి అనువదించిన ప్రకటన గానీ ఆయన చదివి ఉండకపోవచ్చు. కనీసం చూడనయినా చూసి ఉండకపోవచ్చు. చూసినా…సినిమావారికి ఫోటోల్లో, వీడియోల్లో తాము నవనవలాడుతూ నిత్య వసంత శోభిత వర్చస్సుతో అందంగా కనిపిస్తున్నామా! లేదా! అన్నదే ముఖ్యమవుతుంది కానీ…తాము ఎండార్స్ చేస్తున్న ప్రకటనలో ఏమి రాశారు? దాని అర్థమేమిటి? అలాంటి తెలుగు భాష ఈ భూ ప్రపంచంలో ఏ తెలుగువారైన మాట్లాడతారా? రాస్తారా? అన్నది పట్టించుకోవాల్సిన విషయం కానే కాదు.

పట్టించుకుని ఉంటే-
“ది బెస్ట్ విలువ”
“దృవీకరించబడిన”
“జరిగే హెరిటేజ్”
“స్వచ్ఛత యొక్క”
“నైపుణ్యం యొక్క”
“మరియు”
అన్న అన్ కట్ డైమండ్స్ పదాలు, పద బంధాలను కొంచెం కట్ చేసి, సానబెట్టి, మెరుగుపెట్టి…ఇచ్చి ఉండేవారు.

“ఎందుకంటే మీరు ఉత్తమమైనవాటికి అర్హులు”
అని తాటికాయంత అక్షరాలతో రాసి అనుత్తమమైన జీవంలేని పిప్పి పదాలను వాడకుండా ఉండేవారు.

…అయినా మన బంగారం మంచిదైతే కదా! ఎదుటివారిని అనడానికి!

“ఆయొక్క భీమ జ్యువెల్స్ యొక్క
ఒక్కొక్క జ్యువెల్ ఉత్తమమైన మీ మెడకాయ యొక్క తలకాయను మరియు ఇతరేతర శరీర భాగములకు అర్హమైన అలంకారములుగా అమరియుండగా…
మీ డబ్బుకు తగిన ది బెస్ట్ విలువను సాధించారని…
మీరు ది బెస్ట్ ఫీలింగ్ లో మునిగియుండగా…
వంద సంవత్సరాల మా వారసత్వం యొక్క నైపుణ్యం ముక్కలు ముక్కలుగా మీ ముక్కుకు నొక్కుకొనగా…
మీ యొక్క అందం దృవీకరణకు మరియు ద్రవీకరణకు మా భీమా ది బెస్ట్ ధీమా”

అని భీమా జ్యువెల్స్ వారి తరువాత ప్రకటనలో తెలుగు అన్ కట్ కట్ డైమండ్స్ ను ఏరుకోవడానికి సిద్ధంగా ఉండండి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions