Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హాట్‌స్టార్ లైవ్ సంఖ్య చూశారా..? అది రాబోయే డిజిటల్ పట్టుకు సంకేతం..!!

August 29, 2022 by M S R

ఒక మాయను చిన మాయ, చిన మాయను పెద మాయ, పెద మాయను పెను మాయ… అని ఎక్కడో చదివాం కదా… సాంకేతికత పెరిగేకొద్దీ కొత్తది వచ్చి పాతదాన్ని మింగేయడం సహజం… నిన్న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ చూస్తుంటే హాట్‌స్టార్‌ వ్యూయర్స్ సంఖ్య కూడా లైవ్‌ వేశారు… యూట్యూబ్ లైవ్ వ్యూయర్స్ నంబర్ వేసినట్టుగానే..! హార్ధిక్ పాండ్యా చివరి ఓవర్లలో గెలిపించిన సందర్భంలో 1.3 కోట్ల మంది లైవ్ చూశారు హాట్‌స్టార్ వేదికగా… ఆశ్చర్యం వేసింది, కాదు, రాబోయే రోజుల్లో ఓటీటీ తదితర డిజిటల్ ప్రపంచం ఇంకెంత బలంగా మనల్ని కమ్మేయబోతున్నదో అర్థమైంది…

ఒకప్పుడు సినిమా చూడటం అంటే, ఏవో సర్కస్ గుడారాల్లాంటి టూరింగ్ టాకీసులు… తరువాత థియేటర్లు… రీళ్లు పోయి డిజిటల్ ప్రసారాలు… ఇప్పుడు ఓటీటీలు, హోం థియేటర్లు… సో, కాలంతోపాటు వచ్చేదాన్ని ఎవడూ అడ్డుకోలేడు… మొదట్లో క్రికెట్ అంటే కేవలం రేడియో ఆధారం… తరువాత డీడీలో ప్రత్యక్షప్రసారం… తరువాత శాటిలైట్ చానెళ్లు… ఇప్పుడు అదీ వేగంగా మారిపోతోంది… టీవీ ఎదుట కళ్లప్పగించి చూసే పనిలేదు… ఎక్కడున్నా సరే, ఎంచక్కా స్మార్ట్ ఫోన్‌లో… అంటే మన అరచేతిలోనే స్టేడియం ఒదిగిపోయింది…

నిజానికి రాబోయే రోజుల్లో ఇన్ఫోటైన్‌మెంట్, అంటే ఇన్‌ఫర్మమేషన్ అండ్ ఎంటర్‌టెయిన్‌మెంట్… అంటే డిజిటల్ వేదికలే… న్యూస్, సీరియల్స్, మూవీస్, స్పోర్ట్స్,.. అన్నీ… అందరికీ తెలిసిందే కదా… సమాచారరంగంలో ఆధిపత్యం కోసం ఎవరికి ఉంటే వాళ్లదే సమాజంపై, పలు రంగాలపై పట్టు… అందుకే డిజిటల్ ఆధిపత్యం కోసం ప్రస్తుతం ఓ బలమైన పోటీ సాగుతోంది… కళ్లు బైర్లు కమ్మే అంకెలు… ఇండియాలో ఐసీసీ క్రికెట్ మ్యాచుల టీవీ, డిజిటల్ ప్రసార హక్కుల్ని డిస్నీ హాట్‌స్టార్ ఏకంగా 24 వేల కోట్లకు కొనుగోలు చేసింది… 2024-27 కాలానికి… ఐపీఎల్ గాకుండా…

Ads

నిన్నటి మ్యాచ్‌కు హాట్‌స్టార్ వీక్షకుల సంఖ్య గమనిస్తే… రాబోయేరోజుల్లో ఓటీటీ లేదా డిజిటల్ వేదికలు టీవీల్ని కూడా మింగేయబోతున్నాయని లెక్క… మొత్తం ఓటీటీల వీక్షకుల్లో హాట్‌స్టార్ వినియోగదారుల సంఖ్యే సగం ఉంటుంది… తిరుగులేని ఆధిపత్యం… కరోనా వచ్చి డిజిటల్ వేదికల్ని మరింత బలోపేతం చేసింది… క్రికెట్ ప్రసారాలకు సంబంధించి రిలయెన్స్ అంబానీ ఆమధ్య ఎంటరయ్యాడు… 2023-27 కాలానికి డిజిటల్ ప్రసారహక్కుల్ని ఏకంగా 24 వేల కోట్లకు కొన్నది… టీవీ హక్కుల్ని డిస్నీ హాట‌్‌స్టార్ కొన్నది…

డిజిటల్ ప్రసారాల విస్తృతి, పొటెన్సీ బాగా తెలిసిన డిస్నీ హాట్‌స్టార్ అనవసరంగా అంబానీకి చాన్స్ ఇచ్చామే అనుకుని, నాలుక కర్చుకుని… అడ్డగోలు రేట్లకు ఐసీసీ క్రికెట్ మ్యాచుల టీవీ, డిజిటల్ ప్రసారహక్కుల్ని సొంతం చేసుకుంది… నిజానికి ఆదానీ ఇందులోకి దిగలేదు గానీ లేకపోతే కథ వేరే ఉండేదేమో… కొన్ని ఓటీటీలు ఇప్పుడు టీవీ చానెళ్ల ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి… ఉదాహరణకు ఆహా ఓటీటీ టీవీ9 ప్రసారాలను ఇస్తుంది… అంటే రాబోయే రోజుల్లో న్యూస్ కోసం, సీరియళ్ల కోసం జనం టీవీల ఎదుట కూర్చునే అగత్యం లేకుండాపోతోందని లెక్క…

గృహిణులు కూడా టీవీ సీరియళ్లను ఇప్పుడు టీవీల్లో గాకుండా… తమకు టైం ఉన్నప్పుడు తాపీగా కన్సర్న్‌డ్ ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో చూస్తున్నారు… తెలుగుకు సంబంధించి జీతెలుగు, స్టార్‌మా ప్రసారాల వీక్షణం జీ5, హాట్‌స్టార్ ఓటీటీల్లో బాగా పెరిగింది అందుకే… ఇంకోవైపు ఓటీటీలకు రెవిన్యూ పెరిగిపోతోంది… ఊహించనంతగా… సో, ఇవన్నీ క్రోడీకరించి ఆలోచిస్తే… డిజిటల్ పవర్ ఇంకా బలంగా, ఇంకా వేగంగా సమాచార, వినోద రంగాల్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోబోతోంది అని అర్థమవుతుంది… సాంకేతిక, వ్యాపార భాషల్లోకి దిగితే ఇది మరింత సంక్లిష్టమైన, లోతైన సబ్జెక్టు… ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది పైపైన కనిపించేది మాత్రమే..!!

కమ్ దమాక్ తెలుగు నిర్మాతలు చదవాల్సింది ఏమిటంటే… ఓటీటీల్లో స్ట్రీమింగ్ రెండు నెలలు ఆపుతాం, థియేటర్లను కాపాడుకుంటాం అంటున్నారు కదా… మీ దోపిడీకి భయపడి థియేటర్లకు రావడం లేదు ప్రేక్షకులు… పైగా రెండు నెలలు మీరు ఆపితే వాడు ఆ తరువాత అడ్డికిపావుశేరు రేటు అడుగుతాడు… అప్పుడు ఎవడికి నష్టం..? జనానికి ఓటీటీ అంటే చీప్ ఆప్షన్ కాదు, అదొక సౌకర్యం…

ఇండియాలో 130 కోట్ల జనాభా… 1.3 కోట్ల వ్యూయర్స్ క్రికెట్ మ్యాచ్ లైవ్ చూశారూ అంటే 1 శాతం… ఒక స్ట్రీమింగ్‌ను సగటున ఇద్దరు చూశారని లెక్కేసుకున్నా సరే… 2.5 కోట్ల వరకూ ప్రేక్షకులు కేవలం హాట్‌స్టార్ మీద చూసి ఉంటారు… అది చిన్న సంఖ్య కాదు… దీన్ని గనుక మెల్లిగా 5, 6 శాతం వరకూ పట్టుకుపోయినా సరే, సదరు డిజిటల్ ప్లాట్‌ఫారం వండర్స్ క్రియేట్ చేయబోతోంది… ప్రత్యేకించి ఇంటర్నేషనల్ బిగ్ ప్లేయర్లకు ఇండియన్ వ్యూయర్స్ మార్కెట్ ఇప్పుడు కేజీఎఫ్ బంగారుగని…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions