ఒక ముద్దు… అదేమీ రొమాన్స్‌తో ముడిపడింది కాదు… స్నేహపూర్వకంగా బైబై చెబుతూ, మర్యాదపూర్వకంగా హగ్ చేసుకుని, బుగ్గపై చిన్న అంటీఅంటకుండా స్పృశించిన ముద్దు… నిజానికి ఇందులో అశ్లీలం లేదు, కామకాంక్ష లేదు… అదే ఉంటే ఆ పవిత్ర ప్రదేశంలో, అంత బహిరంగంగా ఎందుకు చేస్తారు..? అంతగా ముద్దులు మురిపాలు కావల్సి వస్తే… ఆ సినీస్నేహితులకు ప్రదేశాలు కరువా..?
ఎవరెన్ని విమర్శలు చేసినా సరే, ఆ ముద్దులో తప్పు లేదనేది ఒక వాదన… ఆదిపురుష్ వివాదాల్లో మరొకటి జతచేరింది… దర్శకుడు ఓం రౌత్ హీరోయిన్, సీత పాత్రధారిణి కృతిసనన్‌ను తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం కౌగిలించుకుని, బుగ్గపై ముద్దుపెట్టడం ఈ వివాద సారాాంశం… నెటిజన్లు పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశారు… ఓ పద్దతీపాడూ తెలియని మనిషిగా ఓం రౌత్‌ను తిట్టిపోశారు…
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా పెద్దగా వార్తలేమీ లేవు నిన్న… అందుకని దీన్నే పట్టుకుని, సాగదీస్తూ, రచ్చ చేయడానికి ప్రయత్నించాయి టీవీలు… స్థూలంగా పరిశీలిస్తే ఆ ముద్దులో తప్పేమీ లేకపోయినా సరే… కొన్నికోణాల్లో తప్పే… ఇద్దరూ శేషవస్త్రాలను ధరించి ఉన్నారు… తిరుమలలో భక్తుల ప్రవర్తన హుందాగా, సంస్కారయుతంగా, పద్ధతిగా ఉండాలి… పైగా వాళ్లు సెలబ్రిటీలు… మన దరిద్రంకొద్దీ శ్రీవారి దర్శనానంతర వేశ వీఐపీలు అక్కడే మీడియా మీట్లు పెట్టేసి, నోటికొచ్చింది ఒర్లుతుంటారు… ఆ ఏరియాలో కెెమెరాలను, మీడియా మైకుల్ని నిషేధిస్తే చాలా బెటర్… కానీ చేసేవాడెవ్వడు..?
Ads
తిరుమలను దర్శించుకున్న వీఐపీల ఫోటోలను, వార్తలను కూడా నిషేధించాలి… ఒకరకంగా ఆ వార్తలు శ్రీవారిని అవమానించేవే… దాదాపు కారులో కూర్చోబోతూ కృతి ఆగిపోయి, ఔం రౌత్ దగ్గరకు వెళ్లి మరీ కౌగిలి తీసుకుంది, ముద్దు తీసుకుంది… హేమిటో మరి ఆ తొందరపాటు చర్య… ఔం రౌత్ సాన్నిహిత్యం కావాలంటే తిరుపతి వెళ్లాక అంటే కొండ దిగిపోయాక బోలెడు అవకాశాలున్నాయిగా…
అసలే ఈ ఓం రౌత్ అనేవాడు రామాయణ ఖ్యాతిని, విశిష్టతను దెబ్బతీసేలా సినిమా తీశాడు… పాటలు బాగాలేవు, ట్రెయిలర్లు బాగాలేవు… ఓ యానిమేషన్ సినిమా చూస్తున్నట్టుగా ఉంది… ఇలా సినిమాపై పెరుగుతున్న నెగెటివిటీని బ్రేక్ చేయడానికి ఇవిగో ఈ పాట్లు… హనుమంతుడికి ఓ ఖాళీ సీటు రిజర్వ్ చేయడం కూడా ఈ ప్రచార వ్యూహాల్లో ఒకటి… దీనికితోడు ఈ ముద్దు…
మరో ముద్దు… యాంకర్ అనసూయ ఆంటీ తన భర్త భరధ్వాజను లిప్ కిస్ పెట్టుకుని, సోషల్ మీడియాలో ప్రచారం పొందడం… నిజానికి కృతిసనన్ ముద్దుకన్నా ఇది కాస్త కంపు ఎక్కువ… ఆమె స్వతహాగా సోషల్ మీడియా కంట్రవర్సీ… షోలలో, బయట తన వెగటు డ్రెస్సులతో ఇప్పటికే బోలెడంత అపఖ్యాతిని మూటగట్టుకుంది… నోరిప్పితే ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు… (ఆమె డ్రెస్సు ఆమె ఇష్టం అనే వాదన చెల్లదు… పబ్లిక్‌గా ఉన్నప్పుడు డ్రెస్సింగే కాదు, అప్పియరెన్స్ కూడా పద్ధతిగా ఉండాలి… నా పార్టనర్ నా ఇష్టం, బజారులో ఇంకాస్త ముందుకు వెళ్లి ఇంకేదో చేసుకుంటాం, అడగడానికి మీరెవరు అనే ప్రశ్న చెల్లదు…)
మొగుడే కావచ్చుగాక… బజారులో లిప్ కిస్ ఇవ్వడం బరితెగింపు కిందకే వస్తుంది… మరి కృతిసనన్‌ను ఓంరౌత్ ఇచ్చిన ముద్దు సమర్థనీయం ఎలా అయ్యింది..? అనసూయ తన మొగుడికి ఇచ్చిన ముద్దు బరితెగింపు ఎలా అయ్యింది అంటారా..? ఓం రౌత్ ముద్దులో స్నేహభావన మాత్రమే ఉంది… కాకపోతే బహిరంగంగా, ఓ పవిత్ర ప్రదేశంలో, స్వామివారి శేషవస్త్రాల్ని ధరించి ఈ ముద్దూమురిపాలకు చాన్స్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది… అది అశ్లీలరహితం, కాంక్షారహితం అయినా సరే…
కానీ అనసూయ ముద్దులో ప్రచారకాంక్ష ఉంది… నెగటివో, పాజిటివో ఏదో ఒకరకంగా ప్రచారంలో ఉండాలనే బరితెగింపు ఉంది… మొగుడిని ముద్దు పెట్టుకోవాలంటే బజారే కావాలా..? అదీ ఉద్దేశపూర్వకంగా… ఫోటోలు తీసి మరీ ప్రచారంలో స్వయంగా పెట్టుకోవడం… అఫ్‌కోర్స్, చూసే కళ్లను బట్టి అర్థం ఉంటుందనేది కరెక్టే… కానీ అనసూయ ముద్దుకు అలాంటి సూత్రీకరణలు కూడా అక్కర్లేదు… అది చిల్లర, వెగటు, వెకిలి చేష్ట…!! పైగా బికినీ డ్రెస్సులతో ఎక్స్‌పోజింగ్..!!
Share this Article