వ్యక్తులు… .వ్యక్తిత్వాలు !!
*
మీకు మరీ ఇబ్బందిగా ఉంటే మీరు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు.. ఆయనను మాత్రం అక్కడ్నుంచి కదల్చం.. తేల్చి చెప్పేశారు పెద్దాయన.. ఆ మాట విన్న ఆ మేనేజర్ చేసేదేం లేక, తన జూనియర్ మేనేజరుతో సహా అక్కడ్నుంచి బయటికొచ్చాడు. ‘ఆ పెద్దాయనది చాదస్తం అంటావా … అమాయకత్వం అంటావా అన్నాడా సీనియర్ .. రెండూ కాదు సర్ “మంచితనం” అని ముగించాడు జూనియర్. అదేం కాదు లేవోయ్.. ఆయనకు మనం ఇస్తున్న డబ్బు విలువ తెలీడం లేదేమో అన్నాడు. “మనం “విలువ” లెక్కేస్తాం .. పెద్దాయన విలువలు గురించి ఆలోచిస్తారు. అంతే సర్ తేడా అన్నాడు జూనియర్. మొత్తానికి వారు అక్కడ్నుంచి బయటకు కదిలారు.
Ads
*
వాస్తవానికి పెద్దాయనకు చెందిన ఆ భవనాన్ని స్టేట్ బ్యాంకుకు వారు అద్దెకు తీసుకుని నెలనెలా అద్దె చెల్లిస్తున్నారు. ఆ ఫ్లోరంతా తమ ఆధీనంలోనే ఉంది. మొత్తానికి తాము అద్దె చెల్లిస్తున్నాం కాబట్టి అందులో ఆ చిన్న పాన్ షాప్ ఎందుకుంచాలి ? తీసేయాలన్నది వారి ఆలోచన. కానీ దానికి పెద్దాయన ఒప్పుకోలేదు.
ఆ సందర్భంలోనే బ్యాంకు వాళ్ళు “మేం ప్రతినెలా ఎక్కువే అద్దె ఇస్తున్నాం. మాకు కదా ప్రయార్టీ ఇవ్వాలి. ఆ పాన్ షాపాయన ఏమిస్తాడు.. మాకన్నా ఎక్కువిస్తాడా అని అడిగారు. దానికి పెద్దాయన నవ్వుతూ అవును ఎక్కువే ఇస్తాడు అన్నారు.. “ఏంటీ స్టేట్ బ్యాంక్ కన్నా పాన్ షాప్ ఓనర్ మీకు ఎక్కువ ఇస్తాడా ..అదెలా!! అన్నాడా మేనేజర్.. అవును ఆయన నన్ను అభిమానిస్తాడు.. ఆరాధిస్తాడు.. ప్రేమిస్తాడు… అన్నిటికన్నా నన్ను నమ్ముకుని పాతికేళ్లుగా ఉంటున్నాడు. వీటి విలువ మీరిచ్చే డబ్బుకన్నా ఎక్కువే.. మీరిచ్చే నోట్ల విలువ కోసం నేను విలువలు వదల్లేను. మీరే ఏదోటి తేల్చుకోండి అనేశారు పెద్దాయన. దెబ్బకు మేనేజర్లకు నోట మాట రాలేదు..
అంత ప్రధాన ఏరియాలో అంత మంచి బిల్డింగ్ కోల్పోతే మళ్ళీ దొరకదని వారికీ అర్థం అయింది. అన్నిటికి మించి తనను నమ్ముకున్న వాళ్లకోసం దేన్నయినా వదులుకునేందుకు సిద్ధం అయిన ఆ పెద్దాయన వ్యక్తిత్వానికి మనసులోనే ప్రణామం చేయక తప్పలేదు వారికి.
చివరగా… ఆ పెద్దాయన మరెవరో కాదు. ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన సాంబశివరాజు గారే. ఆ పాన్ షాప్ కూడా ఆయన్ను ఇన్నాళ్లుగా నమ్ముకుని ఉంటున్న బంగార్రాజు అనే ఓ చిరు వ్యాపారిది. దురదృష్టం కొద్దీ సాంబశివరాజు, బంగార్రాజు ఇద్దరూ దివంగతులయ్యారు. బంగార్రాజు కొడుకు ప్రశాంత్ ఆ బడ్డీకొట్టు నడుపుతున్నారు. సాంబశివరాజు కుమారుడు డాక్టర్. సురేష్ బాబు ఎమ్మెల్సీ అయ్యారు. ఆ కొడుకులిద్దరిది తండ్రి బాటే.. ప్రశాంత్ కూడా సురేష్ బాబును అదే అభిమానం .. ప్రేమ.. ఆరాధనతో చూస్తుంటాడు.. జస్ట్ జనరేషన్ మాత్రమే మారింది.. మిగతాదంతా సేమ్.. విలువలు.. గౌరవం . . నమ్మకం.. విశ్వాసం.. అప్పుడూ ఇప్పుడూ ఎక్కడా మారలేదు..
*
✒️ గాంధీ
Share this Article