.
లక్ష కోట్ల కాళేశ్వరం ఫెయిల్యూర్ కథలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి… కేసీయార్ అడ్డదిడ్డపు, డొల్ల ఇంజనీరింగ్ డిజైన్లు, నిర్మాణ ప్లానింగ్ పుణ్యమాని కొత్త రాష్ట్ర ఖజానా కాస్తా కమీషన్ల బారిన పడి దివాలా తీసింది…
ఎహె, నాలుగు తట్టల సిమెంటు చాలు, ఏదో కాస్త పగులు, రిపేర్ చేయించడం చేతకాదా అని బీఆర్ఎస్ కీలకనేతలు తిక్క వ్యాఖ్యాలు చేస్తున్నా… ఆ సమస్య తీవ్రతను తేలికగా తీసిపడేస్తూ… ఒకరకంగా తెలంగాణ జనం సొమ్మును, వాళ్లను గెలిపించుకున్న తీర్పును అపహాస్యం చేస్తున్నట్టే…
Ads
మేడిగడ్డ ఎలా తస్కిందో చూశాం… చివరకు దాన్నెలా రిపేర్ చేయాలో చెప్పండంటూ ప్రభుత్వం దానికీ టెండర్లు పిలవాల్సి వచ్చింది… అంత తలతిక్కగా నిర్మించారు… అంతకుముందు రెండు పంప్ హౌజులు మునిగిపోయాయి… కన్నెపల్లి పంపుహౌజులో ఆరు మోటార్లు తుక్కు… ఇప్పటికీ అది పూర్తి స్థాయి ఆపరేషన్‌లోకి రాలేదు…
అన్నారం పంపుహౌజు కూడా మునకు గురైంది… ఇక సుందిళ్ల బరాజ్ దగ్గర ప్రవాహాల్ని సరిగ్గా అంచనా వేయలేని దురవస్థ, ప్రతికూల ఫలితాలు మరో కథనంలో చెప్పుకుందాం… అన్నారం బరాజుకు 2023లో పదిచోట్ల, అవును, పదిచోట్ల బుంగలు పడ్డాయి… అప్పటికప్పుడు ఏవో ఇసుక బస్తాలు వేసి కవర్ చేయాలని చూసినా ఆగలేదు…
అసలు శాటిలైట్ ఇమేజ్ మీద అడ్డంగా గీతలు గీసి, అవే బరాజులు అన్నంత ఈజీగా కట్టేశారు… మరి కేసీయార్ మరో అర్థర్ కాటన్, మరో విశ్వేశ్వరయ్య కదా… మొన్న ఈనాడులో ఓ వార్త కనిపించింది… అన్నారం బరాజు గేట్లలో ఇసుక రెండు మీటర్ల దాకా మేటలు వేసింది అని… మరే పత్రిక, మరే టీవీ దాన్ని ఎందుకో పట్టించుకోలేదు ఎందుకో మరి…
అసలు బరాజుల నిర్మాణంలో సీకెంట్ పైల్స్ పద్ధతి వాడటమే అశాస్త్రీయం… అక్కడికి వచ్చే ఇసుక, దాని స్వభావం, ప్రభావం గట్రా అంశాలపై ఏ సైంటిఫిక్ సర్వే కూడా చేయించలేదు… పోనీలే, ఇసుక వస్తే, దాన్ని అమ్ముకోవచ్చు కదా అంటారా..?
సడెన్‌గా వరద వస్తే అసలు గేట్లు పూర్తిగా క్లోజ్ చేసే సిట్యుయేషన్ లేదని ఈనాడు వార్త… మొత్తంగా కాళేశ్వరం బరాజులు, పంపుహౌజులకు సంబంధించి ఒక్కో రోగమే బయటపడుతోంది… ఇంకెన్ని బయటపడాల్సి ఉందో…
స్ట్రక్చర్ పైనే రెండు లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక ఉంటుందని ఓ అంచనా… ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది… దాంతో పాటు బ్యారేజీ ఎగువన, దిగువన కూడా భారీగా ఇసుక చేరింది… నేష నల్ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్డీఎస్ఏ) తుది నివేదిక ప్రకారం బ్యారేజీలకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది…
పరీక్షలు చేయడానికి వీలుగా అన్నారం బ్యారేజీ ఎగువన, దిగువన ఇసుకను తొలగించాల్సి ఉంది… ఆ పనులేవీ సాగడం లేదు…
అన్నారం వద్ద గోదావరి నది ఒకవైపు ఎం.ఎస్.ఎల్.కు 103 నుంచి 104 మీటర్ల ఎత్తులో ఉంటే, ఇంకోవైపు 111 నుంచి 112 మీటర్ల వరకు ఉండేది… దీనిని ఒక మట్టానికి తెచ్చి 106 మీటర్ల వరకు క్రస్ట్ నిర్మించి, పైన గేట్లు అమర్చారు… వరద వచ్చినపుడు నది పూర్వ స్థితికి చేరుతున్నట్లు స్పష్టమవుతోంది… ఈ కారణంగానే ప్రతి సంవత్సరం క్రస్టు పైన ఇసుక పెద్ద ఎత్తున చేరుతోంది… ఇది ఖచ్చితంగా ఇంజినీరింగ్ వైఫల్యమే…
ఏదో ఓసారి కాదు, ప్రతి సంవత్సరం ఇసుక తొలగిస్తుండగా, మళ్లీ వర్షాకాలం వరద రాగానే ఇసుక మేట వేస్తోంది… ప్రస్తుతం నీటిని నిల్వ చేయడానికి గేట్లను దించాల్సిన అవసరం వస్తే, ఇసుకపైనే గేట్లు ఉంటాయి… ఇలా ఉన్నప్పుడు వరద వస్తే సమస్య మరింత పెరుగుతుంది…
అందుకే రిపేర్ డిజైన్లకూ టెండర్లు… మూడు బరాజుల పరిస్థితీ అందోళనకరమే… ఎంత పనిచేశావయ్యా కేసీయార్… తెలంగాణ జనం నిన్ను నమ్మినందుకు, నెత్తి మీద పెట్టుకున్నందుకు ఎంత ద్రోహం..?! దీనికి శిక్ష ఏమిటీ అంటారా..? ఏమీ జరగదు… రేవంత్ రెడ్డి క్షమించేసినట్టున్నాడు… సీబీఐకి అప్పగించాడు… బీజేపీతో ఎలాగూ కేసీయార్ రహస్య దోస్తీయే కదా… ఇక ఆ దర్యాప్తు కదలదు… జై మోడీ..! జైజై కేసీయార్…!!
Share this Article