.
( రమణ కొంటికర్ల ) ….. రాజ్ కమల్ సంగీతంలో అత్ శ్రీ మహాభారత్ కథ అంటూ… ఆదివారం వస్తే చాలు జనాన్ని టీవీ సెట్లకు అతుక్కుపోయేలా చేసిన నాటి బీ.ఆర్. చోప్రా మహాభారత్ ధారావాహికం గురించి ఇప్పటి తరానికి తెలియకపోవచ్చునేమోగానీ.. అంతకుముందు తరానికి అదో నోస్టాల్జియా.
అంతటి మహాభారత్ కు స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసిందెవరు…? సదరు స్క్రిప్ట్ రైటర్ మహాభారత్ కు పనిచేసే క్రమంలో… ఆయనకు అనుభవమైన విషయాలు ఆయన్ను మహాభారత్ కు పనిచేయడంలో ఎలా పురిగొల్పాయో ఓసారి తెలుసుకుందాం రండి.
Ads
డాక్టర్ రాహి మాసూమ్ రజా.. ఉర్దూ, హిందీ కవి.. బాలీవుడ్ పాటల రచయిత. తను రచించిన డైలాగ్స్ కు మూడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 1979లో మై తులసీ తేరే ఆంగన్ కీ, 1985లో తవాయిఫ్, 1991లో లమ్హే సినిమాల్లో ఆయన డైలాగ్స్ కు మూడుసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వరించాయి.
ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలోని గంగౌలీ రజా సొంతూరు. ఘాజీపూర్ లోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి అలీఘర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన రజా.. 1975లో మొట్టమొదటిసారి హృషీకేశ్ ముఖర్జీ మిలీ సినిమాలో డైలాగ్స్ తో తన కెరీర్ ను ఆరంభించారు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
అయితే, ఇదంతా ఎందుకంటే.. ఓరోజు బీ.ఆర్. చోప్రా రజాకు ఫోన్ చేసి రజాను మహాభారత్ స్క్రిప్ట్ వర్క్ చేయాలి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాయాలని కోరారట. కానీ, దానికి మొదట రజా నిరాకరించాడు. బీ.ఆర్. చోప్రా రజాను సంప్రదించినట్టు తెల్లవారి ఓ పత్రికలో అచ్చైంది. ఆ వార్త కాస్త దావానంలా వ్యాప్తి కావడంతో.. బీ.ఆర్. చోప్రాకు లెక్కకు మించిన ఉత్తరాలు వచ్చిపడ్డాయట.
ప్రతీ లేఖ సారాంశమూ మహాభారత్ వంటి ఎపిక్ ను నిర్మించాలనుకుంటున్న మీకు… రచయితగా ఓ ముస్లిమే దొరికాడా అన్నదే ఆ లేఖల సారాంశం.
వాటన్నింటినీ బీ. ఆర్. చోప్రా యథాతథంగా రజా ఇంటికి పంపించాడు. అవి చూసి అంతమంది అభిప్రాయాలు మింగుడుపడని రజాలో ఎలాగైనా మహాభారత్ స్క్రిప్ట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లేలో తను భాగస్వామి కావాలన్న కసి, తపన రేకెత్తాయి.
ఇంకేం కట్ చేస్తే.. నేను మహాభారత్ సీరియల్ కు పనిచేస్తానని ఒప్పుకుంటూ బీ.ఆర్. చోప్రాకు తిరిగి ఫోన్ చేశాడు రాహీ మాసూమ్ రజా. అంతేకాదు, ఈ భారతదేశంలో ప్రవహించే ఆ గంగకు నేనూ కుమారుణ్నే.. కాబట్టి, నేనే ఈ పని చేస్తానంటూ బీ.ఆర్. చోప్రాకు సుముఖత వ్యక్తం చేశాడు.
ఎలాగైనా రజాతో మహాభారత్ స్క్రిప్ట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాయించాలనుకున్న చోప్రాకు వచ్చిన ఉత్తరాలు సగం పనిచేసి పెట్టాయి. ఎందుకంటే, రజా ఒప్పుకుంటే చాలు పనైపోయినట్టేనన్న నమ్మకం చోప్రాలో అప్పటికే ఉంది.
ఆ విశ్వాసంతోనే మహాభారత్ కు పని చేయాలని ఆఫర్ చేశారు. కానీ, దానికి రజానేమో కుదరదన్నాడు. ఎలాగైతేనేం, మొత్తంగా ఆ సంప్రదింపుల వార్త పత్రికల్లోకెక్కి.. రజాను మహాభారత్ కు పనిచేసేలా చేశాయన్న ఆనందం అప్పుడు చోప్రాకు దక్కింది.
ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ స్టోరీ మహాభారత్ ధారావాహికం హిట్ టాక్ సంతరించుకోవడం.. ప్రతీ ఆదివారం టీవీ సెట్ల ముందు జనం కూర్చోవడంతో వీధులన్నీ అప్రకటిత కర్ఫ్యూలా మారిపోవడం.. మొత్తంగా అదో ఆధ్యాత్మిక అనుభూతిని పంచిన టీవీ సీరియల్ గా ఓ రికార్డ్ సృష్టించింది.
అలా సీరియల్ నడుస్తున్న క్రమంలోనూ.. పూర్తయ్యాక కూడా డాక్టర్ రాహీ మాసూమ్ రజాకు మళ్లీ లేఖలు మొదలయ్యాయి. మహాభారత్ ధారావాహికం ఆరంభానికి ముందు స్క్రిప్ట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లేకు రజా పేరును ప్రతిపాదనలోకి తీసుకుంటున్నారనుకున్నప్పుడు ఎంత వ్యతిరేకమైన లేఖలు గుట్టలు గుట్టలుగా బీ.ఆర్. చోప్రాకు వచ్చిపడ్డాయో.. అందుకు కాంట్రాస్ట్ గా ఈసారి లేఖల సంచులు వచ్చిపడ్డాయి.
ప్రశంసలు, అభినందనల వర్షం కురిపిస్తూ.. ఆశీర్వాదాలిస్తూ వచ్చిన ఆ లేఖలు అటు రజాతో పాటు… మరోవైపు, బీ.ఆర్. చోప్రానూ మహాభారత్ విషయంలో తమ భాగస్వామ్యం ఎంత సరైందో చెప్పేలా ఆ లేఖల పరంపర సాగింది.
అయతే, అంతా మంచే ఉండదు.. ఎవ్వరూ అందరివారూ కాలేరు.. కాబట్టి, ఆ లేఖల్లోనూ కొందరు తిడుతూ, మాటల్లో వర్ణించడానికి వీల్లేని దుర్భాషలాడుతూ కూడా లేఖలు రాశారు. ఓ ముస్లింవై ఉండి మహాభారతం స్క్రిప్ట్ రాయడానికి అసలు నీకేంత ధైర్యమంటూ బెదిరించారు. వాటిని చూసినప్పుడు కించిత్ బాధనిపించినా.. తాము గంగా ప్రవాహంవలె పోతుంటే.. చిన్న చిన్న మురికి కాలువలూ తారసపడుతుంటాయి అనుకున్నారట రజా…
అలా బెదిరిస్తూ రాసినవారిలో హిందువులతో పాటు, ముస్లింలూ ఉన్నారు. హిందువుల మహాభారతానికి ఓ ముస్లింవై ఉండి అసలు నువ్వెలా డైలాగ్స్, స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే రాస్తావంటూ తమ వర్గీయుల నుంచీ లేఖల్లో బెదిరింపులెదుర్కొన్నారు రజా.
అయితే, చివరగా రజాకు ఏమనిపించిందటా అంటే… బెదిరింపు లేఖల సంఖ్య తక్కువ.. అభినందనల లేఖలెక్కువ రావడంతో భారతదేశంలో అకారణ విమర్శలు చేసేవాళ్లు ఇంత తక్కువ మంది ఉన్నారా అని ఆలోచించారే తప్ప.. దాన్ని నెగటివ్ మోడ్ లో తీసుకోలేదట రజా.
మొత్తంగా దేశంలో ఇప్పటికీ హిందూ, ముస్లిం పేరిట విద్వేషవ్యాప్తి యథేచ్చగా కొనసాగుతూనే ఉన్నా.. అంతకుమించిన ప్రేమ, స్నేహం, సౌహార్ధ్రభావనలే ఈ దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వంగా కలిపి ఉంచుతున్నాయనే సందేశం ఆ లేఖలతో అర్థమైందన్నారట బీ.ఆర్. చోప్రాతో.. రజా!
Share this Article