.
. ( విశీ (వి.సాయివంశీ ) ….. కేరళలో ‘పూరి’ అంటే బూతు అని తెలుసా?
DISCLAIMER: ఈ వ్యాసంలో సందర్భానుసారం కొన్ని తిట్టుపదాలు, అభ్యంతరకర పదాలు ప్రస్తావించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని చదవండి.
***
…మనకు మరో భాష రావాలంటే ముందు మన భాష మనకు సరిగ్గా రావాలి. సిసలైన భాష తెలియాలి. అప్పుడే పక్క భాష మనకు పట్టుబడుతుంది. ఇతర భాష నేర్చుకోవడమంటే అందులో నాలుగైదు పదాలో, వాక్యాలో బట్టీపట్టడం కాదు. ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిస్థితుల గురించి అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ భాష నేర్చుకోవడం సులవవుతుంది.
ఒక్కోసారి ఒక భాషలో ఒక పదానికి ఒక అర్థం ఉంటే, మరో భాషలో మరో విచిత్రమైన అర్థం ఉంటుంది. ‘రండి’ అనేది మనకు పాపులర్ ఉదాహరణ. ‘రండి’ అనేది మనకు మర్యాదపూర్వకమైన మాట. కానీ హిందీలో ‘రండి’ అంటే వేశ్య. అలా ఒక భాషలో మామూలుగా ఉండే పదం మరో భాషలో అభ్యంతరకర పదంగా మారుతుంది.
Ads
‘దేవిడీ’ అంటే కోట వద్ద వాకిలి, కోటకుండే గేటు అనే అర్థం ఉంది. ఆ పదాన్ని కాస్త మార్చి ‘దేవిడియా’ అంటే తమిళంలో దేవదాసి/వేశ్య అనే అర్థం ఉంది. ‘దేవిడియా పయ్యా’ అనే తమిళంలో తిట్టు. తెలుగులో ‘లం_ కొడుకు’ అనే పదానికి సమానార్థకంగా దాన్ని వాడతారు.
‘పూక్కుం’, ‘పూక్కల్’ అనే మరో రెండు పదాలున్నాయి. వీటిని మనవాళ్లు చాలా ట్రోల్ చేస్తున్నారు. మన చెవులకు ఇవి బూతుల్లాగా ఉన్నాయి మరి! ‘పూక్కుం’ అంటే పూయడం, ‘పూక్కల్’ అంటే పూలు. తమిళంలో ‘చ’, ‘స’, ‘జ’కు ఒకే అక్షరాలుంటాయి. అలవాటైనవారికి ఇది ఇబ్బంది ఉండదు కానీ, కొత్తవారికి వింతగా ఉంటుంది.
మనం సామాను అంటే వాళ్లు ‘జామాను’ అంటారు. అలా ‘లంచం’ అనే తెలుగు పదాన్ని తమిళవారు దాన్ని ‘లంజం’ అంటారు. ‘లం_’ అనే పదం (మొత్తానికి ఆడవాళ్లను అవమానించే ఏ పదం) ఎక్కడున్నా సరే, మనవాళ్లకు తెగ ఆనందంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ట్రోల్ చేశారు.
ఒక్కోసారి చాలా మామూలు పదం కూడా పక్క భాషలో బూతు అవుతుంది. అది అక్కడ అభ్యంతరం అనే విషయం కూడా మనకు తెలియదు. మనం ‘పూరీ’ అని చాలా మామూలుగా అనేస్తాం. మలయాళంలో ‘పూర్/పూరు’ అంటే స్త్రీ జననాంగం. అక్కడ ‘పూరి మోనె’ అంటే అతి పెద్ద బూతు. కేరళకు వెళ్లి ‘పూరి/బూరి’ అనే పదాన్ని గట్టిగా పలికితే ఏదో బూతు మాట్లాడాం అని అనుకుంటారు.
దారి మధ్యలో లోతుగా గుంత పడితే దాన్ని ‘గొయ్యి’ అంటారు. అదే మాట తమిళంలో అంటే జామపండు. అవును! తమిళంలో ‘గొయ్య పళం’ అంటే జామపండు. భలే విచిత్రం కదా? అలాగే తెలుగులో ఏదైనా వస్తువును తీయమని చెప్పడానికి ‘తీ/తియ్యి’ అంటాం. తమిళంలో ‘తీ’ అంటే నిప్పు. అగ్గిపెట్టెను వాళ్లు ‘తీ పెట్టె’ అంటారు.
కత్తెర గురించి మనకు తెలుసు, అదే కత్తెరకు కాయ చేర్చి, ‘కత్రికాయ్’ అంటే తమిళంలో ‘వంకాయ’ అయిపోతుంది. ‘కీర’ అంటే మనకు కీరదోసకాయ. తమిళంలో ‘కీర’ అంటే ‘ఆకుకూర’. ఇలా చాలా తెలుగు పదాలు తమిళంలో, మలయాళంలో మరో రకమైన అర్థాలు కనిపిస్తాయి. మనకు ‘మది’ అంటే మనసు. మలయాళంలో ‘మది’ అంటే చాలు అని అర్థం.
ఇలా చాలా పదాలున్నాయి. ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటూ భాషను పెంపొందించుకోవడమే ముఖ్యం. మళ్లీ చెప్తున్నాను, భాష నేర్చుకోవడం అంటే అక్షరాలు, పదాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, అంతకంటే ముందుగా ఆ భాష మాట్లాడే ప్రాంతం తాలూకు చరిత్ర, సంస్కృతి, రాజకీయ పరిస్థితులు తెలుసుకోవాలి. అప్పుడే భాష నేర్చుకోవడం కుదురుతుంది…
Share this Article