Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక బలిసిన మగాడి ఉన్మాద, ప్రకోప, పైత్య, చిత్తవికార, ఉన్మత్త ప్రదర్శన ఇది…

December 11, 2023 by M S R

Aranya Krishna…….   హెచ్చరిక…. “జంతు ప్రవృత్తి” అనే కాన్సెప్టుని మనం నీచార్థంలో వాడుతుంటాం. అంటే అమానుషంగా, హింసాత్మకంగా ప్రవర్తించే వాళ్లని జంతువులతో పోలుస్తుంటాం. ఇది నిజానికి చాలా అన్యాయమైన పోలికే కాదు అజ్ఞానంతో కూడిన దురవగాహన కూడా! పాపం జంతువులు వాటి పని అవి చేసుకుంటూ ప్రకృతిబద్ధంగా జీవిస్తుంటాయి. ప్రకృతి ఏర్పరిచిన నియమాల్ని ఉల్లంఘించి ఐతే బతకవు. “యానిమల్” సినిమా చూశాక నాకు కలిగిన మొట్టమొదటి ప్రశ్న ఏమొచ్చిందంటే, అసలు ఈ సినిమాకి ఆ టైటిల్ పెట్టి జంతువుల్ని ఎందుకు అవమానించాలి? యానిమల్ సినిమా మాత్రం ఒక బలిసిన మగాడి ఉన్మాద, హింసాత్మక, విశృంఖల, క్రేజీ ప్రవర్తనని హీరోయిజంగా చూపించింది. ఇది “సినిమా హీరో ప్రవృత్తి” అవుతుందే కానీ “జంతు ప్రవృత్తి” కాదు…

“యానిమల్” సినిమా ట్రెయిలర్ చూసి, ఆ చిత్ర బృందం చెప్పినదాన్ని బట్టి ఇది నిజంగానే తండ్రీ కొడుకుల సంబంధంలో ప్రతిఫలించే సంక్లిష్టమైన, సున్నితమైన ఘర్షణకు సంబంధించిన సినిమా అనుకుంటాం. కానీ సినిమా చూస్తే తన తండ్రి మీద ప్రేమ గురించి హీరో పిచ్చి అరుపులే తప్ప ఆ అంశం మనకెక్కడా జెన్యూన్ గా ఎక్కడా కనబడదు. తండ్రి అంటే అతనికొక సినిమాటిక్ ఆబ్సెషన్లా చూపించారే తప్ప ఎక్కడా ఏ కోశానా అది సహజంగా అనిపించదు.
ఇందులో హీరో ఎమోషనల్లీ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ మాత్రమే కాదు ఒక విపరీత మనస్తత్వం వున్నవాడు. అతను భావోద్వేగాల్ని తృప్తి పరుచుకోడానికి ఎవరినైనా ఉపయోగించుకుంటాడు. అవతలివారి ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే స్వార్ధపరుడు. భయంకరమైన హింసా ప్రవృత్తి వున్నవాడు. ఇతనికి సిగ్గు లేదు. మర్యాద తెలియదు. ప్రవర్తనా సంస్కారముండదు. ఏ రకంగానూ నిజ జీవితంలో ఇలాంటి వ్యక్తిని నాగరికులెవ్వరూ ఒక అరగంట కూడా భరించడం కష్టం.
ఒక మానసిక రోగిని హీరోగా చూపించిన ఈ సినిమా యువతరాన్ని పిచ్చి పిచ్చిగా థియేటర్లకు రప్పించింది. “అల్ఫా మేల్” అనే కొత్త కాన్సెప్ట్ యువతుల్ని, యువకుల్ని సమాన స్థాయిలో విపరీతంగా ఆకర్షించింది. అల్ఫా మేల్ అంటే తన సమాజంలో లేదా ఓ సోషల్ గ్రూపులో చుట్టూ వున్నవారిని ప్రభావితం చేయగల మూర్తిమత్వం కలిగిన ఒక విజయవంతమైన పురుషుడు. అతను తనని నమ్ముకున్న వారికి రక్షణ కల్పించగలవాడు. ఒక భరోసా ఇవ్వగలిగినవాడు.
animal
ఈ సినిమా హీరో తనని తాను అల్ఫా మేల్ గా చెప్పుకొని తనని “అన్నయ్యా” అని పిలిచే అమ్మాయినే “నీకు పెల్విస్ గొప్పగా వుంది. అంత మంచి పెల్విస్ వున్న స్త్రీలకి ఆరోగ్యవంతులైన పిల్లలు పుడతారు” అంటూ ఆమెని ఇంప్రెస్ చేసి ప్రేమించేలా చేసుకొని మరీ పెళ్లి చేసుకుంటాడు. (నిజానికి పరాయివారిని “అన్నయ్యా” అనే పిలుపు ఆడవాళ్లకి ఒక సేఫ్టీ మెజర్ వంటిది అధికభాగం సందర్భాలలో. అది వేరే విషయమనుకోండి) ఈ హీరో నిజానికి ఆల్ఫా మేల్ కాదు. అతను దర్శకుడు సృష్టించిన పర్వెర్ట్ మేల్ ఫిగర్. అంతే.
ఇతని పెర్వర్షన్స్ గురించిన ఉదాహరణలు చూడండి.
* తన అక్కని రాగింగ్ చేశారని హైస్కూలు కుర్రాడిగా వున్నప్పుడే ఆమె కాలేజ్ క్లాస్ రూంలోకి మెషిన్ గన్ తీసుకెళ్లి కాల్పులు చేస్తాడు.
* ఇంటి నుండి తండ్రితో గొడవపడి బైటికొచ్చాక కూడా ఇతను తన ప్రియురాలితో కలిసి చార్టర్డ్ ఫ్లైట్ ఎకి తిరగడమే కాదు. దాన్నలా గాల్లో ఎగరనిస్తూనే “శృంగార సాంస్కృతిక కార్యక్రమం” కూడా చేసుకుంటారు. వాళ్లలానే నిద్రపోతారు కూడా. ఎవరి చెవిలో పువ్వు పెడతాడు డైరెక్టర్ తన చెవిలోనే కాక?
animal
* తండ్రిని విడిచి వెళ్లినా ఆయన మీద హత్యా ప్రయత్నం జరగ్గానే విదేశాల నుండి వచ్చేస్తాడు. ఇంక తండ్రిని చంపాలనుకున్న వారి అంతు చూసే క్రమంలో కొన్ని వందల మందిని కిరాతకంగా చంపేస్తాడు. దర్శకుడి బుర్రలో హింసకి సంబంధించిన కళాత్మక తృష్ణ మొత్తం తీర్చేసుకుంటాడు ఇతని ద్వారా. హీరో ఒక అధునాతన హోటల్లో చేసిన వందల శవాలతో కూడిన బీభత్స శతృనిర్మూలన చూసి ఓ పాత్ర ఇలా అనుకుంటుంది, “ఇలాంటిది చూడాలంటే అదృష్టం వుండాలి” అని ఆనందపడతాడు. బహుశా ఆ ఆనందం అంతరాంతరాల్లో దర్శకుడిదే కావొచ్చు.
* మూడు తరాలుగా దూరంగా వున్న తండ్రి మూలాలు వున్న పంజాబు గ్రామంలోని బంధువులు తుపాకులు పట్టుకొని ఇతని వెనుక ర్యాలీ అయిపోతారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే తన ప్రతీకారాలకి బంధుత్వాల్ని ఉపయోగించుకోడమే ఇదంతా. రక్తపాతానికి సిఖ్ ఎథ్నిసిటీని చూపించడం ద్వారా వారిలో గన్ కల్చర్ ఎక్కువని పరోక్షంగా చెప్పడమే.
* హీరో బాడీలోకి బోలెడన్ని బుల్లెట్లు దిగుతాయి. ఎలాగో బతుకుతాడు. అతనికి హార్ట్ రిప్లేస్మెంట్ చేస్తారు. అప్పటివరకు పాపం యూరిన్ బాగ్ మోసుకుంటూ తిరుగుతుంటాడు. హార్ట్ రిప్లేస్మెంట్ జరగ్గానే ఇంక యూరిన్ బాగ్ నుండి స్వేచ్ఛ వచ్చిందన్న ఆనందంలో భార్యా, పిల్లలు, చెల్లి, అక్క, స్నేహితులు అందరూ చూస్తుండగా పూర్తి నగ్నంగా డాన్సులు చేస్తూ సెలబ్రేట్ చేస్తూంటాడు. (మన అదృష్టం కొద్దీ బ్లర్ చేస్తారనుకోండి. నా అనుమానం రణబీర్ పట్టుదల మీదనే ఆ సన్నివేశాన్ని అయిష్టంగా బ్లర్ చేసుంటాడు దర్శకుడు).
యానిమల్ మూవీ
* ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు “తన స్త్రీని పురుషుడు లాగి చెంప మీద కొట్టలేనప్పుడు, ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఆమెని ముట్టుకోలేనప్పుడు, ఏకాంతంలో బూతులు మాట్లాడలేనప్పుడు ఇంక ఆ సంబంధంలో భావోద్వేగమేముంటుంది?” అన్నాడు. ఇందులో హీరోయిన్ని కోపంగా ఆమె బ్రా స్ట్రాప్ బలంగా లాగి వదలడం ద్వారా ఆమె వీపుని గాయపరుస్తడు. మళ్లా మందు రాస్తాడనుకోండి.
* “మీ నాన్న మీద నీకున్నది ప్రేమ కాదు, పిచ్చి” అని హీరోయిన్ అన్నందుకు ఆమె మీద తుపాకీని ఎక్కు పెడతాడు.
* తాను మరో స్త్రీతో శృంగారంలో పాల్గొని, ఆ విషయాన్ని భార్యకి హీరో చెప్పినప్పుడు ఆమె “అలాంటి పని నేను చేస్తే?” అని ప్రశ్నించినప్పుడు నువ్వలా చేయలేవంటాడు. తాను యుద్ధానికి వెళ్తున్నానని, ఒకవేళ తాను చనిపోతే ఆమె మరో పెళ్లి చేసుకోకూడడని ఆంక్ష పెడతాడు. ఇక్కడ సగటు హిందూ పురుషుడిగా ప్రవర్తిస్తాడు. అసలు దర్శకుడి బుర్ర నిండా వున్నదే హిందూ మతం తాలూకు ఆధిపత్య భావనలే.
* భార్య మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చి శృంగారానికి ఆహ్వానిస్తే “నిన్ను చూస్తేనే నాకెంతో…. అవుతుంది (చేతితో చూపిస్తూ) ఈ కాస్మటిక్స్ అవసరమా?” అంటాడు. భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య బోలెడంత అడల్ట్ జోక్స్ నడవ్వొచ్చు. ఎటొచ్చీ అది బహిరంగ ప్రదర్శన అయినప్పుడు వెగటుగానే వుంటుంది. కిచెన్లో కుక్ వుండగానే ఆమె టాప్ తీసి ఆమె గుండెల్ని ముఖానికి హత్తుకుంటాడు. ఇది శృంగారం కాదు. మరొకరి ముందు ప్రదర్శనే. బహిరంగ శృంగార ప్రవర్తన ప్రేమని వ్యక్తీకరించడం కిందకి రాదు. అదో రోగం.
May be an image of 6 people and text that says "SUPERSTAR GULSHANRUMAR& -SERIES KUMAR PRESENT ANIM 25ลว AL DECEMBER 01st 2023 SANDEEP REDDY VANGA తెలుగు"
* ఇంక విలన్ని ఒక ముస్లీం కింద చూపిస్తాడు. అతనికి నలుగురో ముగ్గురో భార్యలుంటారు. అతని ఒక పెళ్లి సందర్భంలో తమ్ముడు చనిపోయాడన్న వార్త తెలియగానే ఆ వార్త తెచ్చినవాడిని ఘోరంగా చంపేసి వెంటనే పెళ్లి కూతురిని సోఫా మీదకి నెట్టి మారిటల్ రేపు చేస్తాడు. ఇది దేనికి సంకేతం?
* సినిమా మొత్తం హింస ఉధృతంగా కనిపిస్తుంది. చివరలో విలన్ కోసమని హీరో బృందం వెళ్లినప్పుడు అతను కనబడడు. విలన్ ఆచూకీ చెప్పమని అతని గర్భిణీ భార్య కాళ్ల కింద తుపాకీతో కాల్చి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. ఇంక విలన్ని చంపే సన్నివేశం ఎలా వుంటుందంటే అతని మెడని క్లోజప్లో పసపస కోసి మరీ చంపుతాడు. ఈ సినిమాలో వందల చావులుంటాయి కానీ ఎక్కడా ఒక పోలీసు కనబడడు. విదేశీ ఎయిర్పోర్టులో హీరో విలన్ భీకరంగా తన్నుకున్నా అక్కడి పోలీసులు కూడా రారు అదేంటో.
animal
చెప్పాలంటే ఈ సినిమాలో సున్నితమైన సన్నివేశాలంటూ లేవు. విపరీతమైన రక్త తర్పణ, ఉన్మాదం మాత్రమే కథని నడిపించింది. ప్రతి మనిషి అంతరాంతరాల్లో తాము విశ్వసిస్తున్నట్లుగా చెప్పే మంచి చెడుల, పాప పుణ్యాలతో నిమిత్తం లేని ఆలోచనల చీకటి కోణాలుండొచ్చు. అయితే అవి మనిషిని విధ్వంసం వైపు నడిపించే శక్తులుగా వుండటాన్ని, బలహీనుల్ని బలవంతులు పూర్తిగా డామినేట్ చేసి, వారి మీద జెండా పాతే హక్కుని ఆధునిక నాగరిక, ప్రజాస్వామిక సమాజం ఒప్పుకోదు.

సామాన్యంగా నేను థియేటర్లకి వెళ్లి సినిమాలు చూడను. ఈ సినిమాకి వస్తున్న బజ్ చూశాక తప్పలేదు. చెడ్డ సినిమాల్ని దునుమాడటమూ సామాజిక బాధ్యతే కాబట్టి చూశాను. రాశాను…. ఇది ఒక ప్రమాదకరమైన సినిమా!

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions