Nàgaràju Munnuru…. == గామి == అసలు ఈ సినిమాను విష్వక్సేన్ ఏం చూసి ఒప్పుకున్నాడో తెలియదు! దర్శకుడు ఏం చెప్పాలి అని సినిమా తీసాడో అంతకంటే తెలియదు. టీవీ రిమోట్ కోసం ఇంట్లో పిల్లలతో గొడవ పడలేక ఆవేశంగా నేను ఒక్కడినే థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తాను అని వెళ్లినందుకు నాకు తగినశాస్తి జరిగింది.
ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కథ ఏముంది అసలు నా బొంద!? మూడు కథలు ప్యారలల్ నడుస్తుంటాయి.. ఒకటేమో ఎక్కడో మంచు ప్రాంతంలో ఒక పాడుబడిన ఫ్యాక్టరీ కమ్ పరిశోధనశాలలో కొందరిని జైళ్ళలో బంధించిన విధంగా బంధించి ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగశాల నుండి ఇద్దరు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
ఒక పల్లెటూరిలో దేవదాసిగా మార్చబడిన ఒక మహిళ, ఆవిడకు పుట్టిన ఒక బిడ్డ గురించి కథ నడుస్తూ ఉంటుంది. ఇక మూడవది మన హీరో విష్వక్సేన్ గారు విచిత్రమైన వేషధారణతో ఇతరులెవ్వరూ ముట్టుకోకూడని ఒక చిత్ర విచిత్రమైన రోగంతో బాధపడుతూ, కాశీలో గంగా నదిలో పడవ మీద తిరుగుతూ, ఎవరో సాధువును వెతుకుతూ ఉంటాడు.
Ads
ఇంకో అమ్మాయి హీరోయిన్ అనడం కంటే ఫిమేల్ లీడ్ అనుకుందాం. ఒక సన్యాసి దగ్గరికి మూడు సంవత్సరాలుగా రెగ్యులర్ గా వస్తూ ఏదో విషయం గురించి అడుగుతూ ఉంటుంది.
ఈ మూడు కథలు స్క్రీన్ ప్లే లో మార్చి మార్చి చూపించిన తర్వాత కాశీలో ఆ సన్యాసి దగ్గర ఈ ఇద్దరు కలుసుకుంటారు. హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి దొరికే మాలిపత్రాలు అలియాస్ మష్రూమ్స్ కనుక సంపాదించగలిగితే వీళ్ళ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని తెలుస్తుంది. వాటి కోసం వీళ్లిద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు.
ఈ క్రమంలో వాళ్ళకు ఎదురైన సమస్యలు, చివరికి ఆ మాలిపత్రాలు వీళ్ళకి దొరికాయా లేదా అన్నది కథ. అయితే ఈ సినిమాలో మూడు కథలకి ఉన్న లింక్ ఏమిటో, వాళ్ళందరూ హీరో గారి కలలోకి యెందుకు వస్తున్నారో, దాని వెనకున్న కారణాలు ఏమిటో దర్శకుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు.
సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు ఎక్కడా కూడా ఆసక్తి కలిగించలేదు. హిమాలయ పర్వతాల మధ్య తీసినట్లు చూపించిన కొన్ని దృశ్యాలు చూడడానికి బాగున్నాయి తప్పితే సినిమా అస్సలు ఎక్కడా ప్రేక్షకుడికి కనెక్ట్ అవదు.
సినిమా చిత్రీకరణ డబ్బు ఖర్చుకు వెనకాడకుండా ప్రొడక్షన్ క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవకుండా తీశారు. కథ మీద, కథనం మీద కూడా కొంత శ్రద్ద పెడితే ప్రేక్షకులను రక్షించినవారవుతారు. ఇదేదో సినిమా సమీక్షగా భావించకండి. టిక్కెట్ కొని సినిమా చూసిన ప్రేక్షకుడిగా నా అభిప్రాయం చెప్పాను అంతే.
Share this Article