Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఇద్దరూ తప్పిపోయారు… తమని తాము తెలుసుకున్నారు…

May 8, 2024 by M S R

తప్పిపోయారు – తమని తాము తెలుసుకున్నారు….. లా పతా లేడీస్

‘రోజంతా ఖాళీగానే ఉంటావుకదా!’ (పొద్దున్నే లేచి వంట, టిఫిను, గిన్నెలు, బట్టలు … అన్నిపనులూ చేసుకునే గృహిణులను భర్త, పిల్లలు, చుట్టాలు అనేమాట).
‘మంచి కుటుంబాల్లో ఆడవాళ్లు, తల, నోరు ఎత్తరు’ ( ఇప్పటికీ చాలా చోట్ల వినిపించే మాట ).

ఆడవాళ్లు లేకుండా ఏ పనీ కాదు. ఏ కుటుంబమూ మనలేదు. అయినా చాలామంది వారి గురించి చులకనగా మాట్లాడుతుంటారు. ఉద్యోగం చేసే మహిళలు కూడా పెళ్లి కాగానే తమ ఇష్టాలు, అభిరుచులు మరచిపోయి కుటుంబానికి అంకితమై పోతారు. అయినా అదో పెద్ద విషయం కానట్టు లోకంలో అందరూ చేయడం లేదా అంటారు.

Ads

ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం. పొలం పని నుంచీ అన్నీ చక్కబెట్టే మహిళల శ్రమకు విలువే లేదు. చదువుకోవాలనుకునే అమ్మాయిల కలలు పెళ్లితో అంతం. పెళ్ళిలో వేసే ముసుగుతో తల దించి, నోరెత్తకూడదనే నిబంధనతో చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపేవారు ఉత్తర భారతంలో మరీ ఎక్కువ.

అలా పెళ్లయి కేవలం మేలిముసుగు కారణంగా రైలు ప్రయాణంలో తప్పిపోయిన ఇద్దరు యువతుల కథాంశంతో ‘లా పతా లేడీస్’ అనే సినిమా వచ్చింది. ఆడవాళ్ళందరూ చూడాల్సిన సినిమా. తమ కనీసపు హక్కులు తెలియకుండా వ్యవస్థ ఎలా తొక్కిపెడుతోందో చూడాలి. కట్టుకున్నవాడు కొట్టచ్చనే సూత్రం బుర్రలో ఎలా గుచ్చుతారో చూడాలి. మంచి పెంపకం అంటే ఇంటి పనులు బాగా చెయ్యడం మాత్రమేనని, బయట ఎలా బ్రతకాలో తెలుసుకోడం కాదని ఎలా నూరి పోస్తారో చూడాలి. ఆడవారికి ఆర్థిక స్వాతంత్య్రం ఎందుకు అవసరమో చూడాలి.

మగవాళ్ళూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఆడవారిని ప్రేమ పేరిట తొక్కి పెడితే, చేయి చేసుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయో చూడాలి. కుటుంబం కోసం తమ ఇష్టాలు కూడా మరచిపోతున్న భార్యల గురించి తెలుసుకోవాలి.
ఇక సినిమా గురించి ఇప్పటికే అనేక రివ్యూలు వచ్చాయి. పూల్, జయ, మంజు మాయి అనే పాత్రలచుట్టూ తిరిగే ఈ సినిమా ఒక జీవిత పాఠం. అందరూ నేర్చుకోవలసిన పాఠం. సినిమాలో డైలాగ్స్ వ్యవస్థకు చెంప పెట్టు. అందుకే ఇక్కడ వాటిని చిత్ర సహితంగా అందించే ప్రయత్నం.

1. బుద్ధి హీనత ఉండటం తప్పుకాదు, దాని గురించి గర్వంగా చెప్పుకోవడం సిగ్గు చేటు .

2. ఫ్రాడ్ అంటే తెలుసా? ఎవరినైనా మోసం చెయ్యడం, అమాయకుల్ని చేసి ఆడుకోవడం- ఈ దేశంలో వేల ఏళ్లుగా ఆడవాళ్లపై జరిగే ఈ ఫ్రాడ్ పేరు ‘మంచి కుటుంబాల్లో పెరిగే కూతుళ్లు, కోడళ్ళు ‘.

3. ఆడవాళ్లు ధాన్యం పండించగలరు, వండగలరు. పిల్లల్ని కని పెంచగలరు. చెప్పాలంటే వారికి మగవారితో అంత పనిలేదు. కానీ ఆ విషయం ఆడవాళ్లు గ్రహిస్తే మగవాళ్ల పని అంతే సంగతులు.

4. ఒక్కసారి వధువుగా తలపై ముసుగు వేసుకున్నాక ముందుకు కాదు, కిందికి చూసి నడవడం నేర్చుకో .

5. కూర చాలా బాగా చేశారమ్మా! ఎంతో రుచిగా ఉంది – ఊరుకో, ఎవరన్నా అలా తినే ఆహారం పొగుడుతారా ఏంటి?

6. మీకు ఇష్టమైనవి చేసుకోవచ్చు కదా! ఎందుకు వదిలెయ్యడం – ఆడవాళ్లు ఎక్కడన్నా తమకు ఇష్టమైంది చేసుకుంటారా? అసలు నాకు ఏమిష్టమో ఎప్పుడో మరచిపోయాను .

7. నా సంపాదనతో తిని నన్నే కొట్టడం. పైగా ప్రేమించేవాళ్ళకి కొట్టే హక్కు ఉందనడం. సరే అని ఒకరోజు నేనూ నా హక్కు ఉపయోగించుకున్నా .

8. నోరు తీపి చేసుకునేంత సందర్భం ఏముంది నా జీవితంలో ( అనే మంజు మాయి పూల్ వెళ్ళటపుడు తీపి తింటుంది).

9. ఒంటరిగా భయం వేయదా?- ఒక్కళ్ళే ఆనందంగా ఉండడం కష్టమే. కానీ ఒక్కసారి సాధించామనే ఏ ఇబ్బందీ ఉండదు .

10. నేనేం తెలివిలేనిదాన్ని కాదు. నాకు అన్ని పనులూ చేయడం వచ్చు- ఇంటికెళ్ళడం తెలుసా?

11. చిత్రలేఖనమా? ఇలాంటి పనికిమాలిన పనులకు సమయం ఎక్కడ?- కళ సరస్వతీ దత్తం. ఆ దేవి ఎవరికైనా పనికిమాలినవి ఇస్తుందా?

12. మహిళలు అత్త, ఆడపడుచు, తోడికోడలు అవుతారు. కానీ ఎవరికీ స్నేహితులవలేరు.’అత్తయ్యా ! మనిద్దరం స్నేహితులు కాగలమా’?

13. మీరు లేకపోతే నేను దొరికేదాన్ని కాదు – నువ్వు లేకపోతే నాకు నేను దొరికేదాన్ని కాదు.

చాలా కాలం క్రితం తెలుగులో ‘ పట్నం వచ్చిన పతివ్రతలు’ అనే సినిమా వచ్చింది. భర్తలపై అలిగి పట్నం వెళ్లిన భార్యలు ఎదుర్కొనే సమస్యలు హాస్యంగా చూపించారు. లా పతా లేడీస్ లో కూడా ఇద్దరు మహిళలు తప్పిపోతారు. అలా అని ఈ సినిమా పెద్ద పెద్ద సందేశాలివ్వదు. వ్యవస్థలో పెద్ద కుదుపులు రావాలని చెప్పలేదు. చిన్న చిన్న మార్పులతో జీవితం ఎంత హాయిగా ఉంటుందో చెపుతుంది. అందుకే ఈ సినిమా ఎన్ని సార్లయినా చూడచ్చు. ఇంత మంచి సినిమా అందించిన దర్శకురాలు కిరణ్ రావ్ కి ఎన్ని అవార్డులైనా ఇవ్వచ్చు….. -కె. శోభ     shobhas292@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions