.
Gurram Seetaramulu …. సమ్మక్క వారసత్వాన్ని అవహేళన చేసిన కాసర్ల శ్యాం. శ్రీకాంత్ ఒదెల…. వ్యవస్థీకృతమైన నేరమయ ప్రపంచానికి రెండు పార్శ్వాలు ఉంటాయి… ఒకటి కంటికి కనిపించేది, చరిత్రలో నమోదయినది… రెండో ప్రపంచం మనకు అసలే తెలియదు. నిజానికి అదే నిజమైన ప్రపంచం…
వినికిడి జ్ఞానాల మీద తీర్పులు ఇవ్వడం, కుల మత ప్రాంతీయ ప్రాతిపదికన ప్రాధాన్యత, తరాలుగా మన ముందు నడుస్తున్న జగన్నాటకం… కానీ ఈ దేశంలో జరిగిన ప్రతి మార్పు వెనక పేరు వూరు లేనివాళ్ళ త్యాగాల గురించి మనకు అసలే పట్టదు. చరిత్రలో ప్రతి ప్రత్యామ్నాయ మార్పు వెనక ఆధునికతను అర్ధం చేసుకున దోపిడీ సమాజాలు…
Ads

కులాలు , సమూహాలు ముందు తరం వేసిన త్యాగాల బాటను చెరిపేసి వంచక చరిత్ర రాయడం మొదలు పెడతారు… దానికి మలి విడత తెలంగాణ ప్రత్యక్ష సాక్ష్యం… శ్రీకాకుళం, బస్తర్ జనతన సర్కార్ కూడా అనామక త్యాగాల పునాది మీదనే నిలబడ్డది. అవి ప్రజా పునాది ఉన్న ఉద్యమాలు కనుక బిర్సా ముండా రాంజీ గోండ్, కొమురం భీమ్, పాపన్నలను సజీవంగా తమ జ్ఞాపకాలలో పోరాటాలలో కాపాడుకున్నారు…
అయినా వారి స్మరణ ఏదో ఒక రూపం లో మన తలపుల లో సజీవంగా కాపాడుకున్నా జంగల్ మహల్ చౌరాస్, బస్తర్ ముండాస్, భాగల్పూర్ సంతాల్స్, భిల్స్, కోయ, గోండ్, మహార్, చమార్ నోటికి పలకడం కూడా సాధ్యం కాని పదుల సంఖ్య లో అదృశ్య, అస్పృశ్య, అవాచ్య శక్తులు విముక్తి పోరాటాలలో తమ నెత్తురు సాకబోసారు. అందులో ఎందరో అనామకంగా దుమ్ములో కలిసి పోయారు . వాళ్ళంతా తమ జీవితాన్ని పోరాటానికే ఇచ్చి ఉందొ లేదో తెలియని వచ్చే జన్మ తమది అనుకున్నారు…

ఆ కోవలోనే శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ సినిమా. ఆయన ఎంచుకున్న లక్ష్యం గొప్పదే. కానీ చెపాల్సిన అంశాన్ని వికృతం చేసాడు. ఇందులో అందరికీ ఆక్షేపణ అంశం ప్రిమిటివ్ తెగలలో ఉన్న మితిమీరిన హింస. అందుకే జాతీయ పోరాటం మొదలవడానికన్నా దశాబ్దాల ముందే ఈ ప్రిమిటివ్ తెగలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గల్లా పట్టుకుని నిలేసాయి .
నిజానికి ఆ తెగలు రాజేసిన పౌరుషమే ఇక్కడ జాతీయ పోరాటం, స్వాభిమాన, విప్లవ పోరాటాలుగా వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించాయి. ఇంకొంచం చరిత్రలోకి ముందుకు వెళితే కప్పం కట్టమని ఒత్తిడి చేసి అరిగోస పెట్టిన ప్రతాప రుద్రుని మీద సమ్మక్క, ఆమె బిడ్డ , పగిడిద్ద రాజులు సంపెంగ వాగులో అవనతం అయి ఐతిహ్యమై విరాజిల్లుతున్నారు…

ఈ సినిమాకు పారడైజ్ అనే పేరు పెట్టడమే గాడి తప్పిన అంశం. సమ్మక్క వారసత్వ పౌరుషాన్ని ఎత్తి పట్టే ధైర్యం లేకనే జడల పోరగాన్ని సృష్టించాడు. వాడి బలమైన స్వగతాన్ని ఓదెల అనే అజ్ఞాని జుగుప్సాకరంగా మార్చాడు. దర్వాజల అనవాళ్లే లేని సవారీ తెగను, జాతి కోసం దేశం కోసం పోరాడిన సవారీలను హంతకులుగా ఖూనీ కోర్లుగా, తాగుబోతులుగా వ్యభిచారులుగా మార్చాడు దర్శకుడు…
ఇందులో జడల గాడి పుటక మీద కొట్టిన వాళ్ళ మీద, కడుపు మీద కొట్టిన వాళ్ళ మీద తన జాతి పూర్వీకుల ఆనవాళ్ళు చెరిపేసిన చోట ప్రత్యామ్నాయ చరిత్ర రచనకు పెద్ద పెద్ద డైలాగ్లు రాసుకున్నాడు.
నిజానికి ఈ ప్రిమిటివ్ తెగల బ్రతుకులను మెల్ గిబ్సన్ అపొకలిప్టో అంతరించి పోతున్న ఆదిమవాసుల బ్రతుకులకన్నా బలమైన జీవితాలు. ఇక్కడ బిర్సా ముండాలు, రాంజీ గోండ్, పాపన్న బల్మొర్ బాలమ్మ అపొకలిప్టోకన్నా బలమైన వాళ్ళు . ఆ ప్రయత్నం అసలు ఈ దేశంలో మొదలే కాలేదు. ఈ తెగల ఔన్నత్యాన్ని చెప్పడానికి గిబ్సన్ కుంటా కింటేలో, గాంధీనో, నెల్సన్ మండేలానో ఫాన్సీ కోసం వాడుకోలేదు. వాళ్ళ జీవితాలను చదివి అర్ధం చేసుకుని వాళ్ళ పోరాటాన్ని దృశ్యమానం చేసాడు. ఆ పని తమిళ సమాజం చేస్తోంది. రంజిత్, సెల్వరాజ్ రాజేస్తున మరో వెండితెర విప్లవాన్ని అపహాస్యం చేస్తోంది తెలుగు సినిమా…
తమ జాతి ఉనికి కోసం, దేశ విముక్తి కోసం ప్రాణాలు సాక బోసిన సవారీలకు అన్యాయం చేసాడు. సవారీల గుండె మీద తన్ని జెడల గాడి మీద భుజం మీద చెయ్యి వేసిన పని దర్శకుడే చేసాడు . ఆడది ఉన్నది పైట పరవడానికే ఉన్నది అని నిరూపించిన వందేళ్ళ సినిమా వేసిన వికృత దారిలోనే నడిచాడు దర్శకుడు.
“ఆగస్టు పదిహేను గుర్తుకు వస్తే అన్నం సహించదు” అన్న వాక్యాన్ని అక్షరాలా తనువంతా నింపుకున్న జెడలను హంతక జెడల నాగరాజుగా, నయీంగా, బ్లేడ్ బాబ్జీగా మార్చాడు శ్రీకాంత్ ఒదెల. ముందు ఇతన్ని అరువుతెచ్చుకున్న వాక్యాలు కల్పిత హీరోలు కాకుండా చరిత్ర చదవడం నేర్చుకోమని చెప్పాలి అనిపించింది.
నిజానికి సమ్మక్క వారసత్వాన్ని అవహేళన చేస్తున్న కాసర్ల శ్యాం, శ్రీకాంత్ ఒదెల. ఈ పోరాట యోధులకు క్షమాపణ చెప్పాలి.
నెత్తుటి గింజలపైన మొలిసిన గద్దల నెత్తులు, నరికిన కాకుల రాజ్యం ఎండిపోయిన బొక్కలే ఎగిరే జెండా కర్రలు, మాడిపోయిన డొక్కలే మొగేటి నగారాలు…. మీరు రాసిన డైలాగ్లు థియేటర్ లో తాత్కాలిక పూనకం రప్పించింది కానీ వాళ్ళ చరిత్ర విన్న దర్వాజా వాళ్ళ కోసం తలుపులు తెరవకపోగా వాళ్ళు కుత్తికలు కోసే హంతకులే అని శ్రీకాంత్ ఒదెల కాసర్ల శ్యాం సవారీల నెత్తుటి చరిత్రను అమానవీయ కోణంలో రాసుకున్నారు. అరువు తెచ్చుకున్న డైలాగ్ లకు నాలుగు కాసులు రాలతాయేమో గానీ చరిత్ర క్షమించదు….
Share this Article