……. by…. Prasen Bellamkonda………….. ఇవాళెందుకో పింక్ సినిమా గురించి మాట్లాడాలనిపిస్తోంది. పింక్ సినిమాలో ఏమేం ఎందుకు లేవో, అవి లేనందుకు అది ఎందుకు బాగుందో చెప్పాలనిపిస్తోంది.
పింక్ లో అమితాబ్ కు పాపం కోర్టులో బల్లలు ఎత్తేయడం కుర్చీలిరగ్గొట్టడం తెలియదు, గడియారాన్ని మారణాయుధం చేయడం తెలియదు.. అయినా బాగుంది.
పింక్ లో అమితాబ్ బాత్రూంలనూ మెట్రో ట్రయిన్ లనూ మల్ల యుద్ద భూములుగా మార్చడు.. అయినా అదేంటో మరి, బాగుంది.
పింక్ లో అమితాబ్ అనాధల పాలిటి అభాగ్యుల పాలిటి ఆర్త జనబాంధవుడు కానేకాడు అయినా బాగుంది.
పింక్ లో అమితాబ్ గుండాలు ఖాళీ చేయించే ఇళ్ల స్థలాలను పేదలకు మళ్లీ అప్పగించే రాబిన్ హుడ్ కానే కాడు, అయినా బాగుంది.
పింక్ లో అమితాబ్ పేదల కోసం లా చదవడు, విద్యార్దుల ఆందోళనల నిప్పుల్లో పిడిగుద్దుల ఆజ్యం పోయడు… అయినా బాగుంది.
పింక్ లో అమితాబ్ ఓ పోలీస్ ఆఫీసర్ చేసిన ఫేక్ ఎన్కవుంటర్ ని తనకు ఎంపి ఇంట్లోకి ఎంట్రీ కార్డుగా వాడుకోడు… అయినా బాగుంది.
పింక్ లో అమితాబ్ ఎంపితో సవాల్ చేసి కేసు టేకప్ చేయడు, అయినా సరే బాగుంది.
పింక్ లో కోర్టు సీన్లు హాస్యరస ప్రధానంగా ఉండవు అవి ట్రిపుల్ ఎక్స్ట్రా పంచ్ లాటలూ కావు, అయినా బాగుంది.
పింక్ లో న్యాయవాదులు వీథి గుండాల్లాగా గుద్దులాటకు దిగరు.. అయినా సరే ఎందుకో మరి బాగుంది.
పింక్ లో అమితాబ్ ను ఎందుకోగానీ ఎంపి కొడుకు తన గూండాలతో కొట్టించడు, అయినా సరే బాగుంది.
పింక్ లో న్యాయమూర్తికి కోపం వచ్చి న్యాయవాదులను అరవడు కరవడు, పింక్ లో న్యాయవాది తాను లోగొంతులో మాట్లాడి, లాయర్ గారూ కొంచెం పెద్దగా మాట్లాడండి అని న్యాయమూర్తి చేత అనిపించుకుంటాడే తప్ప అరవకండి అని అనిపించుకోడు… అయినా సరే అదేంటోగానీ బాగుంది.
పింక్ లో అమితాబ్ అమ్మాయిలను తన వెంటపడి బతిమాలించుకుని కేసు తీసుకోడు. తానే స్వయంగా వాళ్ల దగ్గరికి వెళ్లి వాదిస్తానని చెపుతాడు… అయినా బాగుంది. పింక్ లో అమితాబ్ భార్యను కోల్సోయి స్ట్రెస్ కు లోనవుతాడు తప్ప మందుకు బానిస కాడు అయినా సరే ఎందుకో గానీ బాగుంది.
పింక్ లో అమితాబ్ కు మేఘాలయ అమ్మాయిలను లోకం ఎందుకు చులకనగా చూస్తుందో తెలుసు, ఈశాన్య ప్రాకృతిక సౌందర్యమూ, ఈశాన్య సంగీత మధురిమా తెలుసు, అయినా సరే బాగుంది..
పింక్ లో అమితాబ్ అమ్మాయిల వెనుక నిలబడతాడే తప్ప ముందుండడు, అయినా సరే బాగుంది.
పింక్ టైటిల్స్ లో అమితాబ్ పేరు ముగ్గురు అమ్మాయిల పేర్ల తరవాత మాత్రమే పడుతుంది తప్ప బిగ్ బాంగ్ తో అందరికంటే మొదట కానే కాదు…. అయినా సరే బాగుంది.
పింక్ లో అమితాబ్ బెల్ట్ బకెల్ మీద పిడికిలీ మెడలో ఎర్రకండువా ఉండవు కానీ అయినా బాగుంది.
పింక్ లో అమితాబ్ ఓ హీరో కాదు. పింక్ లో అమితాబ్ ఓ మెసయ్యా కాదు.
పింక్ లో అమితాబ్ ఓ ఆసరా. ఓ నమ్మకం. ఓ అండ. ఓ విశ్వాసం. ఓ భావజాలం.
అందుకే బాగుంది.
చివరగా ఓ మాట.
అనువాదం అంటే ఆత్మతో సహా ఆవిష్కరించడం..అంతేకానీ ఏకీలుకాకీలు విరిచేయడం కాదు సాబ్….
Share this Article