అరవై నాలుగు కళల్లో చోర కళ ఒకటి అంటే ఏమో అనుకున్నాం. ఇందులో పొట్ట నింపుకోవడానికి చేసేవి (అదే వృత్తిగా బతికేవారు), జల్సాలకు అలవాటుపడి చేతివాటం చూపేవాళ్ళు, సరదాగా చేతి దురద కొద్దీ చేసేవాళ్ళు ఇలా చెప్పుకుంటూ పొతే అంతూ పొంతూ ఉండదు.
జనం జీవన శైలి, అలవాట్లు, అభిరుచులు మారుతున్నట్టే దొంగల అవసరాలు కూడా మారుతున్నాయి. కాదేది చోరీకి అనర్హం అన్నట్టు చేతికి అందిన వస్తువుని, కంటికి నదురుగా కనిపించినవి నొక్కేస్తున్నారు. ఇటీవల ఓ సినిమాలో పోలీస్ కానిస్టేబులే రాత్రి అయ్యేసరికి ఏదో ఒక ఇంట్లోకి చొరబడి చోరీలు చేసేస్తుంటాడు…
Ads
పైగా తాము పట్టుకున్న కన్నాలు వేయడంలో ఆరితేరిన ఓ సీనియర్ దొంగ గారి దగ్గర కిటుకులు కూడా నేర్చుకుంటాడు… అదేమంటే అదొక రకమైన మానసిక స్థితి అంటారు డాక్టర్లు. రైళ్ళలో దుప్పట్లు, హోటళ్ళలో స్పూన్లు, ఫోర్క్లు, న్యాప్ కిన్లు ఇలా కొట్టేసేవాళ్ళ గురించి కూడా చూస్తూనే ఉన్నాం…ఆఖరికి అత్తారింట్లో ఉన్న భార్యను చూడ్డానికి ఓ బస్సునే ఎత్తుకెళ్లిపోయిన ఘనమైన భర్త ఉదంతం కూడా తెలుసు.
నల్లనయ్య కృష్ణుడు కూడా చిన్నప్పుడు వెన్న, ఆ తర్వాత చీరలు, ఆపైన భక్తుల మనసులు దోచుకున్నాడు. కాని నేటి కలియుగంలో రోజు ఏదో ఒక కొత్త తరహా దొంగతనం వింటూనే ఉన్నాం. ఇటీవల ఏ ఊళ్ళో చూసినా చిన్నా, పెద్ద సూపర్ మార్కెట్లు, మాల్స్ వెలిశాయి. ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటున్నాయి.
మనం లోపలికి వెళ్ళగానే ప్లాస్టిక్ బుట్టలు, ట్రాలీలు (తోపుడు బళ్ళు) ఇస్తారు కదా.. నగరంలోని ఒక మాల్ లో ఒక ఆరు నెలల కాలంలో 300 బుట్టలు మాయమై పోయాయి. ఎలాగంటే సరకులతో పాటు వాటిని కూడా జనాలు కార్లల్లోనే పెట్టేసుకుంటున్నారట. (ఏ కొద్దిమందో పొరపాటున పెట్టుకుని ఉంటారు).
తీరా రాత్రి మాల్ మూసే ముందు లెక్కలు సరి చూసుకుని ఆ రోజు ఎన్ని బుట్టలు తక్కువ అయితే వాటి విలువ అప్పటివరకు నిలువుకాళ్ళ మీద ఉద్యోగం చేసిన వారి జీతాల్లో కోత విధిస్తున్నారు. దీంతో ఇలా బుట్టలని గేటు వరకే పరిమతం చేస్తున్నారు.
అసలే అంతంత మాత్రం జీతాలతో రోజంతా నిలుచునే చేసే చిరు ఉద్యోగులకు ఘరానా మనుషులు ఇచ్చే కానుక ఇదన్నమాట. ఈసారి అలా బుట్టలు తీసుకెళ్ళేముందు వీళ్ళ గురించి ఆలోచించండి. యూరోపియన్ దేశాల్లో ఒక యూరో ముందుగా డిపాజిట్ కట్టించుకుని బుట్ట ఇస్తారట.
ట్రాలీలు వీలుకాక గానీ లేదంటే వాటిని కూడా మనవాళ్ళు తీసుకెళ్లిపోయేవారు.. కాదంటారా... ఇక ఇలాంటి మాల్స్ లో ఇటీవల చాలా సరుకులకు చిన్న, చిన్న పరిమాణాలు పెట్టడం తీసేశారు ఎందుకో తెలుసా. యువతరం చాలా మంది సరదాగా వచ్చి ఇలాంటివి లోదుస్తుల్లో పెట్టుకుని ఎంచక్కా జారుకుంటున్నారట.
మరో మాల్ లో ఒక ఉన్నత వర్గ మహిళ తన బ్యాగ్ లో కొన్న సామగ్రి వేయి రూపాయలు. కొట్టేసినవి అక్షరాల రెండు వేల రూపాయల సౌందర్య సాధనాలు బయట పడ్డాయి. అదేమంటే దబాయింపు, రచ్చ చేసింది. మాల్ సిబ్బంది గట్టిగా నిలబడి పోలీసులను పిలుస్తామనే సరికి కాళ్ళ బేరానికి వచ్చి బిల్లు కట్టి జారుకుంది. ఈ కొట్టేసే జాడ్యం.. విశ్వమంతా వ్యాప్తి చెందింది..
ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుల వారి గగన విహారానికి ప్రత్యేక విమానం తెలుసు కదా ఎయిర్ ఫోర్సు వన్.. ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి కదా.. అధ్యక్షుడి పర్యటనలో ఇటీవల జర్నలిస్టులను కూడా తీసుకెళ్ళారు. తీరా పర్యటన పూర్తయ్యాక చూస్తే, విమానంలో కప్పులు, సాసర్లు కొన్ని కనిపించలేదట. (వీటి మీద వైట్ హౌస్ బొమ్మ ఉంటుందట).
ఈ మేరకు శ్వేతసౌధం ఒక మర్యాదపూర్వక ప్రకటన జారీ చేసింది. ఇలా ఇన్ని కప్పులు, సాసర్లు కనిపించడం లేదు. పొరపాటున మీ లగేజి లో కలిసిపోతే తిప్పి పంపమని.. అది జరిగే పనేనా… మీరేం జర్నలిస్టురా నీ యంకమ్మా… గుణం పోనిచ్చుకున్నారు కాదు… (వునికిలి హర గోపాలరాజు)
Share this Article