.
లక్కీ భాస్కర్ చూశాను… సోషల్ మీడియా, ఇంటర్నెట్, మౌత్ టాక్ ద్వారా మంచి టాక్ తెచ్చుకున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి కలిగి చూశా.
చూశాక సినిమా చెప్పదలిచిన అంశం నాకు అర్థమైంది – జాగ్రత్తగా చేస్తే అవినీతి ఓకే. ఇంతే. వివరంగా చెప్పాలంటే తెలివిగా చెయ్యి, రూల్స్ క్షుణ్ణంగా తెలుసుకున్నాకే అవినీతి మొదలు పెట్టు. ఎవరి పాత్ర ఏమిటో, ఎవరు ఎక్కడెక్కడ దొరికిపోతారో కరెక్ట్ గా అంచనా వేసి, నీ మీదకి వచ్చే పరిస్థితి కూడా ఊహించి దానికి తగ్గట్టు ముందే ఒక ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటే అవినీతి సంపాదన అంత గొప్ప మార్గం ఇంకేదీ లేదు.
Ads
ఊహలకి అందని సంపద వైట్ లో పోగేసుకోవచ్చు. చిన్న గుమస్తా ఉద్యోగమైనా రోల్స్ రాయిస్ లో బహిరంగంగా తిరగొచ్చు. నిన్ను ఎవరూ ఏమీ ప్రశ్నించలేరు. ఇంకో గొప్ప ప్రయోజనం కూడా ఉంది – సమాజం నిన్ను గౌరవిస్తుంది. నువ్వు హీరో మాత్రమే కాదు, దేవుడివే అయిపోతావు. దీనికి అత్యంత బలమైన సమర్థన – నీ కుటుంబం కోసమే ఇదంతా చేస్తున్నావు. యండమూరి డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు లో చెప్పినట్టు – “చట్టబద్ధంగా” సంపాదిస్తున్నావు. తప్పేముంది..?
ఎంత ఆహ్లాదంగా ఉంది! తెలుగు సినిమా, తెలుగు సమాజం లేదా మొత్తం సమాజం ఎంత పరిణతి చెందింది అని ముచ్చటేస్తుంది. ఇది తెలియకే కదా కొమ్ములు తిరిగిన పెద్ద నాయకులు, ప్రజా జీవితంలో ఎదురు లేదనుకున్న వాళ్లు కూడా జైలులో, అదీ వృద్ధాప్యంలో గడుపుతున్నారు! అవినీతిలో కూరుకుపోయిన ఆలిండియా సర్వీస్ అధికారులు కూడా జైలుకెళ్లిన సందర్భాలు (అరుదైనా) ఉన్నాయి.
కుటుంబం మీద ప్రేమ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన వీరోచిత కథలు సినిమాలుగా వచ్చాయి. కుటుంబం మీద ప్రేమతో తన కుటుంబానికి అన్యాయం జరిగిందనో, కుటుంబాన్ని చంపేశారనో వ్యవస్థ మీద పోరాడిన ధీరుల కథలు చూశాం. కుటుంబానికి లగ్జరీ జీవితం లేదని, కేవలం దాని కోసం “సమాజాన్ని దోచుకునే” కథని సమర్థిస్తూ ఓ సినిమా రావడం – దానికి ఆదరణ రావడం విస్మయపరుస్తోంది.
సమాజంలో జరిగే అన్యాయాల నేపథ్యంలో నష్టపోయిన కథానాయకుడు, తిరగబడి తప్పుడు మార్గంలో తనకి కరెక్ట్ అనిపించిన మార్గం – హింస, స్మగ్లింగ్, అవినీతి, గూండాగిరి – లో న్యాయం చేయడం చూశాం. మణిరత్నం నాయకుడు సినిమా మంచి ఉదాహరణ. అలాగే గాడ్ ఫాదర్, ఎస్కోబార్ లాంటి వాళ్ల కథలూ చూశాం. అయితే అన్నిటిలో(చాలా వరకూ నిజ జీవిత కథలు) – కథా రచయిత, దర్శకుడు కొన్ని పరిమితులకి కట్టుబడ్డారు.
హీరో చేసిన అన్ని తప్పుల్నీ సమర్థించినా, చివరికి హీరో పతనాన్ని, చావునీ లేదా చట్టానికి లొంగిపోవడాన్ని చూపించారు. అది పొయెటిక్ జస్టిస్ కూడా. సమాజం మీద సినిమా వేసే తీవ్ర ప్రభావం దృష్ట్యా అది అవసరం. నీవు ఎంచుకునే మార్గం నీ ఇష్టం – తుది ఫలితం మాత్రం ఇలాగే ఉంటుంది. తర్వాత నీ ఇష్టం అనే భావన ప్రేక్షకుడి మనసులో ముద్రిస్తుంది.
ఈ సినిమా ఆ హద్దు చెరిపేసింది. జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి గురూ – నువ్వు, నీ కుటుంబం, నిన్ను నమ్ముకున్నవాళ్ళు సూపర్ లైఫ్ ఎంజాయ్ చెయ్యొచ్చు అని చెప్పేసింది. ఆ విషయంలో ఇదొక మైలు రాయిని దాటేసింది. ఇక ఇక్కడి నుంచి మన మిగతా దర్శకులు ఎంత లోతుకి మనల్ని లాక్కుపోతారో చూడాలి.
ఇదంతా ఈ దర్శకుడు ఇలాగే చెప్దాం అనుకుని తీశాడా అంటే ఇతమిద్ధంగా చెప్పలేం. హీరో పాత్రకి న్యాయం (?) చెయ్యాలనే ఆలోచనతోనే ముందుకెళ్లి పోయాడా అని కూడా అనిపిస్తుంది. అయితే, ఈ ధోరణి సరికాదు. ఇప్పటికే ఎన్నికల్లో అవినీతి ఒక అంశం కావడం ఎప్పుడో ముగిసింది. జైలుకెళ్లి వచ్చిన వాళ్ళు హీరోలుగా, ఇంకా చెప్పాలంటే “పోరాట యోధులు” గా కీర్తించబడే స్థాయికి సమాజం దిగజారి పోయింది.
అవినీతి కేసుల్లో జైలు కెళ్ళి వచ్చిన ఐఏఎస్ అధికారులు మళ్లీ ఉద్యోగం తెచ్చుకోవడం, ఇంకా ప్రమోషన్ కావాలని. డబ్బులిచ్చే పోస్టింగ్స్ కావాలని పట్టు పట్టి సాధించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇలాంటి సినిమాలు దాన్ని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయేమో అని భయం వేస్తుంది….. ( By విన్నకోట రవికుమార్ )
Share this Article