Gurram Seetaramulu…. నమ్మకం విశ్వాసం మీద నిలబడ్డ ఏ విలువ అయినా అది ఉన్నతమైనదే. మూలవాసుల విశ్వాసాల మీద నీ ఆధునిక హేతువుతో వేసే ప్రశ్నలు నిలబడవు. కోట్ల మంది తిరుగాడిన సమ్మక్క గద్దె వందల ఏళ్ళుగా ఏ హంగు ఆర్భాటం లేకుండా కనీసం గుడి, మండపం, తలుపు, తాళం లేని పరంపర అది. ఇన్నేళ్ళుగా తమ నిజదర్శనాన్ని దర్పాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ధూప దీప నైవేద్యాల గోల లేదు. పులిహోర వడ దద్దోజన చక్కర పొంగలి లాంటి ప్రసాదాలు లేవు. అభిషేకాల్లేవు. ఆర్జిత సేవలు అసలే లేవు. అసలు విగ్రహాలే లేవు.
గిరిజనులు స్వతహాగా శక్తి ఆరాధకులు కాబట్టి జంతుబలి తప్పనిసరి చేసుకున్నారు. తెలంగాణలో నూటికి తొంబై ఎనిమిది శాతం పండగలు జాతరలు కింది కులాల కనుసన్నుల్లో ఉంటాయి. వైదిక , శాస్త్ర ప్రమాణ, పౌరాణిక బేస్ అవసరం లేని ఒక ప్రత్యామ్నాయ ధార్మిక, ఆధ్యాత్మిక, మార్మిక పరంపర తెలంగాణ సొంతం.
ఉగ్ర, బీభత్స , శోక ప్రధాన భూమిక ఈ జాతర, పండగల్లో ఎల్లమ్మ లు, జోగినీ, బవనీ, పంబాల, బైండ్ల, డక్కలి, శివసత్తులకి, దేవదాసీలు, బీరప్ప, ఒగ్గు దొరలు, మందెచ్చులు, మాతంగులు ముందుంటారు. తెలంగాణలో ఏ పండగ అయినా ఆర్భాటాలు లేకుండానే ఉంటాయి . కానీ పసిపోరడి నుండి పండు ముసలి దాకా వళ్ళంతా పులకించే పారవశ్యంతో నిలువెల్లా కంపించే, నవనాడులు నాట్యం చేసే దూకుడు ధూలా పరివ్యాప్తం తప్పనిసరి.
Ads
మహంకాళి జాతర మొదలు చెంచులు నిర్మించుకున్న శ్రీశైలం, యాదవుల కొమరెల్లి మల్లన్న, మాదిగల ముత్యాలమ్మ మైసమ్మ, యెల్లమ్మ లు, బోనాలు,.. పెద్దగట్టు. జమ్మి, చిత్తారమ్మ , సదర్, నూమాయిష్ , పూల బతుకమ్మ. పీర్లు, ఏదైనా కావొచ్చు.. ఒగ్గు డోలు, డప్పు, కొమ్ము బూరా ఇవే వాళ్ళ వాయిద్యాలు. ఆ శబ్దపు హోరులో కోట్లాది మంది సిగం ఊగుతారు. కుడుములు, సట్టిలో వండే సప్పిడి పులగం. ముంతలో సాంబ్రాణి ఇవే ఇక్కడ.
ఊరంతా మార్మిక అడుగుల్లో ప్రణమిల్లుతారు. కల్లు, సార సాక బోస్తారు. రోడ్ల మీద సత్తువంతా కూడబలుక్కొని కుల్లం కుల్లం సిందాడతారు.
సమ్మక్క , నాగోబా జాతరలు విలక్షణమైనవి. హంగులు ఆర్భాటాలు లేవు, చిన్న కుంకుమ భరిణెకు కోట్లాది మంది నీళ్ళారబోసి గుండెకు హత్తుకుంటారు. ఏ పండగలో అయినా అమరులను తలుచుకోవడం వీరులకు పెట్టుకోవడం వాడవాడనా చూస్తాం.
సొరికేలో ఉన్న కొమరెల్లి మల్లన్న, అదే సొరికేలో యాదగిరి నర్సన్నలు ఇప్పుడు ఏసి గదుల్లోకి ధార్మిక ప్రవరకు అడ్డాలుగా మారుతున్నాయి. కారణం ఇక్కడ రాజ్య జోక్యం మితిమీరడం. ఇవిప్పుడు మత మాఫియా రియల్ దందాకు అడ్డాగా మారుతున్నాయి. కెసిఆర్ వేల కోట్లు పెట్టి యాదాద్రి నిర్మించడం వెనక మతం అనే పాపులిస్ట్ జోక్యం ఉంది. రియల్ ముందు చూపు ఎలాగో ఉంది.
ప్రపంచంలోనే ధనవంతులు అయిన ఆరేడు వందల ఏళ్ళ ఇస్లామిక్ పాలనలో కూడా ఈ వైవిధ్యం ఎందుకు మిగిలి ఉంది అంటే ఈ పండగలలో రాజ్య జోక్యం ఏనాడూ లేదు. రాముడి గుడి కడితే రామదాసుని జైల్లో వేసారు అనే ఒక కథను ఇంకా పరిష్కరించాల్సిన అవసరమే ఉంది. గతంలో పాలకులు అవసరానికి సహాయం సహకారం ఇచ్చారు కానీ రాజ్య అవసరాలకు మహంకాళీ జాతరలో జోగిని స్వర్ణలత, శ్యామలలను మేనేజ్ చేయడం గతంలో లేదు…
Share this Article