.
ఒక ఫోటో… ఎన్నో ముప్పిరిగొన్న ఆలోచనలు… ఆ ఫోటో ఏమిటీ అంటే..? దిగ్విజయ్ సింగ్, అలియాస్ మధ్యప్రదేశ్ రాజవంశపు నాయకుడు… కాంగ్రెస్ సీనియర్… ఆ ఫోటో ఎక్కడిదీ అంటే… అయోధ్యను సందర్శించి, బాలరాముడి శరణు వేడుతున్న 80 ఏళ్ల వృద్యాప్యం… అది గత ధోరణులకు పశ్చాత్తాపమా..? వైరాగ్యమా..? సన్యాసమా..? కాస్త లోతుల్లోకి వెళ్దాం… రాజు గారు క్షేత్రాన్ని విడిచి బతికిన పాలకుడు కాబట్టి…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు… కానీ, కొందరు నాయకుల విషయంలో శాశ్వత ‘వేషధారణలు’ కూడా మారుతుంటాయి… దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన ‘చాణక్యుడు’, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తాజా ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది… అయోధ్య రామమందిరంలో కళ్లు మూసుకుని, రామనామ జపంలో మునిగిపోయిన దిగ్గీరాజాను చూసి జనం ఆశ్చర్యపోతున్నారు… అయితే ఇది నిజమైన భక్తితో వచ్చిన మార్పా? లేక ముంచుకొస్తున్న వయసు, మసకబారుతున్న రాజకీయ ప్రాభవం తెచ్చిన అనివార్యతా?
Ads

హిందూ వ్యతిరేక ముద్ర.. చెరిపేసుకునే ప్రయత్నమా?… ఒకప్పుడు పి. చిదంబరంతో కలిసి ‘హిందూ తీవ్రవాదం’ (Saffron Terror) అనే పదాన్ని తెరపైకి తెచ్చి, దేశవ్యాప్తంగా మెజారిటీ వర్గాల ఆగ్రహానికి గురైన నాయకుడు దిగ్విజయ్ సింగ్… ఆనాడు ఓట్ల వేటలో భాగంగా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడానికి జాతినే కించపరిచేలా వ్యవహరించారనే విమర్శ ఆయనపై బలంగా ఉంది… 26/11 ముంబై దాడుల విషయంలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి…
అయితే, కాలం మారింది…. హిందూ వ్యతిరేక ముద్ర తన రాజకీయ భవిష్యత్తుకే కాదు, పార్టీకి కూడా శాపంగా మారిందని ఆలస్యంగా గ్రహించిన దిగ్గీరాజా…. రూటు మార్చారు….. 3,300 కిలోమీటర్ల ‘నర్మదా పరిక్రమ’ చేయడం ద్వారా తన ఇమేజ్‌ను మార్చుకునే (Image Makeover) ప్రయత్నం చేశాడు…. ఇప్పుడు అయోధ్య రాముడి శరణు వేడటం ఆ ‘డ్యామేజ్ కంట్రోల్’ లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…
ఏమో, భిన్నమైన ప్రస్థానం కూడా కావచ్చు… పాప ప్రాయశ్చిత్తాలు కావచ్చు… 80 ఏళ్లొచ్చాయి, ఇక మధ్యప్రదేశంలో తను కుర్చీ ఎక్కినా ఉద్దరించిందేమీ లేదు… జపమాల తిప్పుకోవడం తప్ప..!
వ్యక్తిగత జీవితం.. సకల వివాదాల నిలయం!
దిగ్విజయ్ సింగ్ రాజకీయ జీవితం ఎంత వివాదాస్పదమో, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే చర్చనీయాంశం… డెబ్బై ఏళ్ల వయసులో ఒక టీవీ యాంకర్‌తో నడిపిన వ్యవహారం, ఆపై పెళ్లి… ఆయన నైతికతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి… “సకల అవలక్షణ పీడితుడు” అంటూ విపక్షాలు చేసే విమర్శలకు ఆయన ప్రవర్తనే ఆజ్యం పోసింది…
ప్రస్తుతం ‘దిక్కు’ లేని రాజా? …. 79 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ ప్రస్తుతం రాజకీయంగా ఒంటరి అయ్యారనే చెప్పాలి…
-
రాహుల్ మార్క్ పాలిటిక్స్…: కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ గాంధీ చేతుల్లోకి వెళ్లాక, పాత తరం నేతలను, ముఖ్యంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే వారిని పక్కన పెట్టడం మొదలైంది… ప్రస్తుతం రాహుల్ టీమ్‌లో దిగ్విజయ్ మాట చెల్లుబాటు కావడం లేదు… ఇప్పుడంతా రేవంత్ రెడ్డి వంటి కొత్త తరం నేతలే కాంగ్రెస్ కు దిక్కు…
-
సొంత రాష్ట్రంలోనూ విముఖత…: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు, ఇప్పుడు సొంత క్యాడర్‌లోనే ఆదరణ తగ్గింది… జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు పార్టీ వీడటానికి, కాంగ్రెస్ బలహీనపడటానికి దిగ్విజయ్ పంతాలే కారణమని ఒక వర్గం మండిపడుతోంది…
-
రాజ్యసభకే పరిమితం…: ప్రజల్లోకి వెళ్లి గెలిచే సత్తా తగ్గడంతో రాజ్యసభ సీటుతోనే కాలక్షేపం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది….
ముగింపు…? కాదు, ఇంకా ఉంది… వయసు పెరిగే కొద్దీ మనిషిలో మార్పు రావడం సహజం… కానీ, రాజకీయ నాయకుల విషయంలో ఆ మార్పు ‘ఓట్ల’ కోసం వస్తుందా లేక ‘ఆత్మశుద్ధి’ కోసం వస్తుందా అనేది ప్రజలకు బాగా తెలుసు… ఒకప్పుడు హిందూత్వాన్ని విమర్శించిన నోరు… నేడు రామనామం జపిస్తుంటే అది ‘పరివర్తన’ అని నమ్మే స్థితిలో జనం లేరు…
తెలంగాణ కోణం చూద్దాం… కేసీయార్ మజ్లిస్‌తో అంటకాగుతూ… ఒవైసీ మెప్పు కోసం, తన ప్రాపకం కోసం… హిందూగాళ్లు బొందుగాళ్లు అన్నాడు… రావణజన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అని కొక్కిరించాడు… అయోధ్య చందాలకు అడ్డుపడ్డాడు… భద్రాచలం రాముడిని అవమానించాడు… ఏమో… ప్రస్తుతం కనుచూపు మేరలో ఇక ఉద్దరించడానికి ఏమీలేదు…
అనారోగ్యం, మేనల్లుడి చేతుల్లోకి వెళ్లిపొయిన పార్టీ, ఛీ అని థూత్కరించిన సొంత బిడ్డ… ఏమో, ఆ రాముడే మళ్లీ కనిపిస్తాడేమో… అయోధ్య వెళ్లి, ఇదుగో ఈ దిగ్గీరాజాలాగే రాముడిని శరణు వేడుతాడేమో… కటకటాలపాలు కావద్దని, మరింతగా తెలంగాణ జనంలో చులకన, పలుచన కావద్దని…!!
Share this Article