NOTE: IT’S AN IMPORTANT TOPIC. READ THE POST AND SHARE IT.
తెలియని నెంబర్ నుంచి మనకు ఫోన్ వస్తుంది. ‘మేం పోలీసులం మాట్లాడుతున్నాం. ఇది చాలా సీక్రెట్ సమాచారం. మీ పేరిట డ్రగ్స్ పార్సిల్ వెళ్లింది. మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మిమ్మల్ని అరెస్టు చేయడం గ్యారంటీ’ అంటారు.
ఉన్నట్టుండి ఈ ఫోన్ ఏంటో, ఆ బెదిరింపు ఏంటో మనకు అర్థం కాదు. మనల్నే కాకుండా మన ఇంట్లో ఉండేవారు ఆ కేసులో ఉన్నారనో, మన అమ్మాయి/అబ్బాయి పెద్ద క్రైంలో ఇరుక్కున్నారనో కూడా చెప్తారు. పోలీసులంటే సహజంగానే మనకు ఒకలాంటి బెదురు, వణుకు ఉంటాయి. వాళ్లతో పెట్టుకుంటే ఏం చేస్తారోనన్న భయం ఉంటుంది. కాబట్టి అవతలి వ్యక్తి చెప్పే మాటలు బుద్ధిగా వింటాం. మన గొంతులోని వణుకును బట్టి అవతలివారి గొంతులో శ్రుతి మరింత పెరుగుతుంది.
Ads
‘మీరెక్కడ పనిచేస్తారు? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? డ్రగ్స్ తీసుకుంటారా? మీకు ఎవరు అమ్ముతున్నారు?’ లాంటి ప్రశ్నలు వేస్తారు. అవతలివారి గొంతులో తీవ్రతకో, లేక డ్రగ్స్ అనే మాటకో మనం భయపడతాం. కొద్దిసేపు బెదిరింపుల పర్వం జరిగాక ‘ఇప్పుడేం చేయాలి సార్?’ అనే మాట మన నుంచి వస్తుంది. వెంటనే అవతలి నుంచి డీల్ మొదలవుతుంది.
రూ.50 లక్షల నుంచి మొదలైన బేరం రూ.5 లక్షల వరకూ తగ్గొచ్చు. అంతకంటే తక్కువ అంటే కష్టం అంటారు. మా పైసార్‌కి ఇవ్వాలి, ఆ పైన ఉండే ఆఫీసర్‌కు ఇవ్వాలి అని లెక్కలు చెప్తారు. పోలీసులంతా లంచాలు తీసుకుంటారన్న గట్టి నమ్మకం మనకు ఉంటుంది కాబట్టి మనం కూడా నిజమే అనుకుంటాం. చేతికి ఇవ్వొద్దు, ఫలానా అకౌంట్‌కి పంపండి అంటారు అవతలివారు. మనలో కొంత అనుమానం మొదలవుతుంది. వెంటనే అవతలినుంచి వీడియో కాల్ వస్తుంది. పోలీసు దుస్తులు వేసుకున్న ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆయన పోలీసే అని మనం ఫిక్స్ అయిపోతాం. బుద్ధిగా వాళ్లు చెప్పిన అకౌంట్‌కి డబ్బు పంపించి హమ్మయ్యా అనుకుంటాం.
అక్కడితో కథ అయిపోదు. వారం తర్వాత మళ్లీ ఫోన్ వస్తుంది. రూ.5 లక్షలు సరిపోలేదు, కేసు చాలా సీరియస్ అంటారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు, రేపు మిమ్మల్ని అరెస్టు చేస్తారని అంటారు. నమ్మకపోతే చూడమని వీడియోకాల్ చేసి అరెస్ట్ వారెంట్ చూపిస్తారు. అందులో మన పేరు స్పష్టంగా ఉంటుంది. వెన్నులో వణుకు పుడుతుంది. చచ్చీచెడీ మరో రూ.5 లక్షలు తెచ్చి వారు చెప్పిన అకౌంట్‌కి వేస్తాం. అక్కడితో వదిలితే ఓకే, లేకపోతే మళ్లీ ఇదే రిపీట్ అవుతుంది.
ఇటీవల కాలంలో విపరీతంగా జరుగుతున్న ‘Digital Arrest’ మోసాల్లో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా రకరకాల మోసాలు ఉంటాయి. మచ్చుకు కొన్ని ఇక్కడ చూడండి.
* నొయిడాకు చెందిన పూజా గోయల్ అనే డాక్టర్‌కు ఫోన్ చేసి ‘మీరు పోర్న్ వీడియోలు తయారు చేస్తున్నట్లు కేసు నమోదైందని’ బెదిరించారు. కేసు మాఫీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారి మాటలు నమ్మిన ఆమె రూ.60 లక్షలు చెల్లించి మోసపోయింది.
* ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ అలోక్ రంజన్‌కు గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసి ‘మీ క్రెడిట్ కార్డు బిల్ ఇంకా కట్టలేదని’ చెప్పారు. వారు అన్ని వివరాలూ సరిగ్గా చెప్పడంతో ఆయన నమ్మి వారికి రూ.32 వేల డబ్బు పంపించారు. అనంతరం తాను మోసపోయినట్లు గుర్తించారు.
* హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి తాము ఎయిర్‌పోర్టు నుంచి మాట్లాడుతున్నామని, మీకు ఇంటర్నేషనల్ పార్సల్ వచ్చిందని చెప్పారు. తనకెవరు పంపిస్తారని ఆమె అనుమానపడుతుండగా, పార్సల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని ఆమెను బెదిరించారు. ఆమె వారిని బతిమాలగా రూ.50 వేలు ఇస్తే వదిలేస్తాం అన్నారు. ఆమె తన వద్ద ఉన్న డబ్బు వారి ఖాతాకు పంపింది. ఆ తర్వాత అదంతా మోసం అని గ్రహించింది.
… ఇలాంటివి నిత్యం చాలా జరుగుతున్నాయి. బయటపడేవి కొన్నయితే, బయటకు రానివి పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్లు, రిటైరైనవాళ్లు, పెద్దగా చదువులేనివాళ్లు, కొత్తగా పట్టణాలకు వచ్చినవారిని నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఒక ప్రాంతంలో ఎవరెవరు ఉంటారు, వాళ్ల వివరాలేంటి, వాళ్లకు ఏ టైంలో ఫోన్ చేయాలి, వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు.. ఇలాంటి వివరాలన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. సైబర్ మోసగాళ్ల దగ్గర మన ఆధార్‌కార్టు, వోటర్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, మన బ్యాంకు డీటెయిల్స్, మన అడ్రస్.. ఇలా అన్ని వివరాలూ ఉంటాయి. మన డేటా భద్రంగా ఉందని అనుకోవడం మన అమాయకత్వం మాత్రమే.
అవతలివారు ఫోన్ చేసి, మన వివరాలన్నీ టకటకా చెప్పేసరికే సగం భయం పుడుతుంది. వాళ్లు ఏం చెప్పినా నమ్మేస్తాం. ‘పోలీసులు బయలుదేరారు. మీ దగ్గరకే వస్తున్నారు’, ‘చాలా సీరియస్ కేసు ఫైల్ చేశాం’, ‘ఎవరికైనా చెప్తే మీ పరువే పోతుంది’, ‘మీకు చదువుకునే పిల్లలు ఉన్నారు, ఆ తర్వాత మీ ఇష్టం’, ‘ఈ కేసుకు 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదు’.. ఇలాంటి డైలాగులు చెప్పి భయం పుట్టించి ఎటూ ఆలోచించుకోకుండా చేస్తారు. దాన్నే ‘Digital Arrest’ అంటారు. ఇటీవల కాలంలో చాలామంది ఈ విధంగా మోసపోతున్నారు.
ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?
* వాళ్లు మన వివరాలు చెప్పినా, మనల్ని అరెస్టు చేస్తామని వారెంట్లు చూపించినా భయపడకూడదు. కేసు ఏమిటి, ఎందుకు, వివరాలు ఏమిటి, జ్యూరిస్‌డిక్షన్ ఎక్కడ అని వారికి కౌంటర్ ప్రశ్నలు వేయాలి. దీంతో వాళ్లకు మనం ఏమిటో అర్థమవుతుంది.
* కాల్ రికార్డు చేయాలి. అవతలివారి వివరాలన్నీ అడగాలి. ఏ ఊరు, ఏ స్టేషన్, ఎస్సై ఎవరు, సీఐ ఎవరు అంటూ వాళ్లను ప్రశ్నించాలి. వాళ్లు నిజమైన పోలీసులైతే చెప్తారు. లేకపోతే తడబడతారు.
* నేను స్వయంగా వస్తాను, ఎక్కడికి రావాలో చెప్పమని అడగాలి. లేదా వాళ్లే వస్తానని అంటే భయపడకుండా రమ్మని చెప్పాలి. నిజంగా పోలీసులైతే అలా ముందుగా చెప్పి రావడం ఉండదు.
* వాళ్లు వీడియోకాల్ చేస్తే ఐడీ కార్డులు, చుట్టూ ఉన్న పరిసరాలను చూపించమని అడగాలి. ఫేక్ పోలీసులైతే ఆ పని చేయలేరు.
* కేసు ఫైల్ చేశాం, స్టేషన్‌కు రావాలి, 10 ఏళ్ల జైలు లాంటి డైలాగులు చెప్తే ‘మా ఫ్యామిలీ లాయర్ మీతో మాట్లాడతాడు. మీ నెంబర్ ఇవ్వండి. మేమిద్దరం కలిసి స్టేషన్‌కి వస్తాం’ అని చెప్పాలి. లాయర్ పేరు చెప్తే చాలావరకు నేరగాళ్లు భయపడి, జారిపోయే అవకాశం ఉంది. – విశీ
Share this Article