ఈరోజు ఈ వార్త చాలామందికి నచ్చింది… ఎందుకు నచ్చిందో చెప్పుకునేముందు… ఆ వార్తేమిటో సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఆమధ్య, నాలుగేళ్ల క్రితం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత నర్మద పరిక్రమ యాత్ర చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఓచోట ఆ బృందం చిక్కుబడిపోయింది… గుజరాత్‌లో ప్రవేశించాక ఓచోట (బహుశా భరూచ్ ఏరియా కావచ్చు) దట్టమైన అడవి, పర్వతాలు, చీకటి, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి… హఠాత్తుగా ఓ అటవీ శాఖ అధికారి ప్రత్యక్షమయ్యాడు, దారి చూపించాడు, గైడ్ చేశాడు, అన్నిరకాల సాయం అందించాడు… ఎవరయ్యా నీవు అనడిగితే అమిత్ షా మీకు సాయం చేయాలని ఆదేశించాడు, వచ్చాను అన్నాడు… తరువాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చారు… ఓ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు, తిండీతిప్పలు పట్టించుకున్నారు… మీకు సాయం చేయాలని మాకు సూచనలు అందాయి, మేం పాటిస్తున్నాం అన్నారు వాళ్లు… అలా మార్గమధ్యంలో ఇరుక్కుపోయిన టీంలో ఆయనతోపాటు తను లేటుగా పెళ్లిచేసుకున్న జర్నలిస్టు అమృత కూడా ఉంది… తన సహచరుడు ఓపీశర్మ రాసిన నర్మదకే పథిక్ పుస్తకాన్ని ఆవిష్కరించినప్పుడు దిగ్గీరాజా ఈ వివరాలు వెల్లడించాడు… సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా, రాజకీయ నాయకుల నడుమ ఈ సహకారం, ఆపదలో ఆదుకునే ధోరణి అవసరం అన్నాడు… నిజానికి తాను అమిత్ షాను ఎప్పుడూ కలవలేదనీ, ఐనా తన పట్ల ఆయన చూపించిన ఈ సానుకూలత తనను ఆశ్చర్యపరిచిందనీ, పలు మార్గాల్లో ఇప్పటికే ఆయనకు థాంక్స్ చెప్పాననీ అన్నాడు… ఇది వార్త…
నిజానికి అప్పుడు గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి… దిగ్విజయ్ సింగ్ కూడా ఈ నర్మద పరిక్రమ యాత్రను ఆధ్యాత్మికం కోణంలో ఏమీ చేయలేదు, జనంలో తిరుగుతూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగానే యాత్ర చేపట్టాడు… తను పక్కా ఆర్ఎస్ఎస్ ద్వేషి… ఆధారరహితంగా కూడా అనేకసార్లు ఆర్ఎస్ఎస్ మీద ఆరోపణలు గుప్పించేవాడు… సరే, అది తన రాజకీయ ధోరణిలో భాగం అనుకుందాం… కానీ ఆ రాజకీయ వాతావరణంలో సైతం అమిత్ షా తనకు ఆ అడవి కష్టాల్లో ఆదుకోవడం ఒక విశేషమే… తెల్లారిలేస్తే తమను తిట్టిపోసే దిగ్గీరాజాకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు అండగా నిలవడమూ విశేషమే… అయితే అన్నింటికన్నా విశేషం ఏమిటంటే..? దిగ్విజయ్‌సింగ్ దాన్ని అంతే పాజిటివ్‌గా స్వీకరించడం, బహిరంగంగానే ఈ ఎపిసోడ్ గురించి చెప్పుకోవడం..! నిజానికి దిగ్విజయ్ చాలా అంశాల్లో పక్కా నెగెటివ్ మైండెడ్… తనకు తొలిసారి ‘పాజిటివిటీ’ అంటే తెలిసొచ్చింది కావచ్చు బహుశా… మొత్తానికి నర్మద పరిక్రమ యాత్ర తనలో ఓ చిన్న పరివర్తనైనా తీసుకురావడం మంచిదే…
Ads
అసలు ఏమిటీ నర్మద పరిక్రమ యాత్ర..? నర్మద నది చుట్టూ ఓ ప్రదక్షిణ… ఎక్కడైతే యాత్ర మొదలుపెడతామో నది చుట్టూ తిరిగి మళ్లీ అక్కడికే వచ్చి చేరాలి… దాదాపు 3500 కిలోమీటర్లు… ఇప్పుడు చాలా టూరిజం ప్యాకేజీలు పదీపదిహేను రోజుల షెడ్యూల్‌తో అందుబాటులో ఉన్నాయి… సొంత వాహనాల్లో వెళ్లేవారు కూడా 20 రోజుల్లో ఆరామ్‌సే యాత్ర పూర్తి చేయొచ్చు… తగిన వసతి కూడా పలుచోట్ల దొరుకుతుంది… కానీ చాలామంది భక్తులు పాదయాత్రగా ఈ పరిక్రమ యాత్ర చేస్తారు… కనీసం అయిదారు నెలలు పడుతుంది… సుదీర్ఘ ప్రయాణం… దిగ్విజయ్ సింగ్ చేపట్టింది పాదయాత్రే… గంగను ఓ మాతగా పూజించినట్టే నర్మదను కూడా పూజిస్తారు… సాధారణంగా ఓంకారేశ్వర్ నుంచి బయల్దేరి, మళ్లీ అక్కడికే వచ్చి ముగిస్తారు యాత్రను… మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని అనేక ఆశ్రమాలు, గుళ్లు కవరవుతాయి…!! ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ అనుభవం చదువుతుంటే… మన తెలుగు నేతల సంస్కారరాహిత్యం, బూతుపురాణాలతో పోల్చుకుంటే సిగ్గనిపిస్తోందా..?!
Share this Article