అనుకున్నట్టే అయ్యింది… దిల్ రాజు గుణం తెలిసిందే కదా… మరి ఇన్ని ఊళ్లల్లో జనం మందలుమందలుగా వచ్చి ఉచితంగా బలగం సినిమాను చూస్తుంటే ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడని అనుకున్నదే… అదే జరిగింది… అప్పట్లో బ్రహ్మం గారి చరిత్ర నాటకాన్ని రాత్రంతా ప్రదర్శించేవాళ్లు… ఊరుఊరంతా కదిలి వెళ్లేది… నిద్రొస్తే అక్కడే పడుకునేది… ఇప్పుడు అదే రేంజులో బలగం సినిమాను జనం ఓన్ చేసుకుంటున్నారు… చూస్తున్నారు…
దీన్ని నిర్మాత దిల్ రాజు ఎలా చూడాలి..? తన సినిమా ఇంతగా జనంలోకి పోతున్న తీరు చూసి గర్వపడాలి… కానీ అలా ఆనందపడితే దిల్ రాజు ఎలా అవుతాడు..? దిల్ రాజు అంటేనే డబ్బులు… జనం గుండెల లబ్ డబ్బులు కాదు… తనేమీ తెలంగాణ ప్రేమికుడు కాదు, తెలంగాణతనాన్ని ఓన్ చేసుకునే కేరక్టర్ కూడా కాదు… ఇంతగా జనం కదిలిపోయి చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నా సరే… తను ఓర్వలేకపోతున్నాడు… ఠాట్, ఏమిటీ జనజాతరలు అనుకున్నాడు…
Ads
ఇదుగో ఇలా కంప్లయింట్ చేశాడు పోలీసులకు… అన్నింటికన్నా ఘోరం ఏమిటంటే అందులో ఈ సినిమా జనప్రదర్శకులను యాంటీ సోషల్ అని ప్రస్తావించడం…! ఎందుకయ్యా అంటే… ఓటీటీ ప్రసారం హక్కులు పొందిన అమెజాన్ నుంచి ఈ సినిమా వీడియోను కాపీ చేసుకుని, జనానికి షేర్ చేస్తూ ఈ యాంటీ సోషల్ శక్తులు తన సంపాదనకు బొక్క పెడుతున్నారట… ఈ పైరసీ యాక్టివిటీని అడ్డుకోవాలని కోరుతూ దిల్ రాజు ఈ ఉచిత జనప్రదర్శనలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు…
అసలు అమెజాన్‌లో ఈ వీడియో డౌన్ లోడ్ ఆప్షన్ ఇచ్చింది ఎవరు..? డౌన్ లోడ్ చేసుకోవచ్చుననే సమ్మతి కాదా అది..? ఒకసారి డౌన్ లోడ్ చేసుకున్నాక దాన్ని ఇతరులకు షేర్ చేస్తే ఏమిటి..? జనానికి ప్రదర్శిస్తే తప్పేమిటి..? ఆ కోణంలో ద్రోహం ఏముంది..? అనైతికం ఏముంది..? పైరసీ చేయడం ఏముంది..?
తమ ఫిర్యాదుకు బలం ఉండడానికి బలగం సినిమాను దొంగతనంగా కాపీ చేసి, జనానికి షేర్ చేస్తున్నారని దిల్ రాజు కంప్లయింట్‌లోె పేర్కొన్నాడు… అమెజాన్ నుంచి వీడియోను దొంగతనంగా కాపీ చేసుకునే అవకాశం ఉందా అసలు..? స్క్రీన్ షాట్‌కూ చాన్స్ ఉండదు కదా…!! సో, ఓటీటీ నుంచి నేరుగా ఓ డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శిస్తే… లీగల్‌గా మాత్రం కేసు పెట్టే చాన్స్ ఉండదు… పోలీసులు ఈ కోణంలో మాత్రమే ఆలోచించాలి… ఇక్కడ డిజిటల్ కంటెంట్ చోరీ లేదు, పైరసీ లేదు…
సినిమా ఎక్కువ రోజులు నడవదు అనుకున్నది తనే… అంచనా వేసుకున్నదీ తనే… ఏదో వచ్చినకాడికి వెంటనే అమెజాన్‌కు అమ్ముకున్నదీ తనే… అరెరె, థియేటర్ రన్ ఇన్నిరోజులు ఉంటుందని అనుకోలేదు అనుకుంటూ గింజుకుంటున్నాడు… తీరా ఆ ఓటీటీ నుంచి డౌన్ లోడ్స్ చేసుకుంటే తనెందుకు అడ్డుపడాలి..? అది అమెజాన్ సమస్య… పోనీ, థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయి సంపాదన పడిపోతుందనేది దిల్ రాజు అభిప్రాయం, బాధ అనుకుందాం… ఓటీటీలో ప్రసారం స్టార్టయ్యాక సహజంగానే థియేటర్ ప్రేక్షకులు తగ్గిపోతారు… పైగా ఇప్పుడు ఊళ్లల్లో ఉచితంగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరూ థియేటర్లకు వచ్చి సినిమా చూసే బాపతు కాదు, నిలువు దోపిడీ కేంద్రాలుగా మారిన థియేటర్లకు జనం రావడమే మానేస్తున్నారు… ఆ థియేటర్ల సిండికేట్ కూడా దిల్ రాజుదే అని మనం గమనించాలి ఇక్కడ…
సో, దిల్ రాజుకు దాసోహపడిపోయి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాజం ఉద్వేగాల్లో కదిలిపోతున్న తీరుకు అడ్డుకట్ట వేస్తుందా..? ఇదేమైనా శాంతిభద్రతల సమస్యా..? ఊళ్లన్నీ ఏకమవుతున్న ఉద్వేగమే కదా… దానికీ తెలంగాణ ప్రభుత్వం మోకాలడ్డుపెడుతుందా..? థియేటర్లలో తప్ప ఇంకెక్కడా చూడొద్దని ఆంక్షలు, నిషేధం విధిస్తుందా..? తెలంగాణ సమాజం కావాలా..? దిల్ రాజు కటాక్షవీక్షణాలు కావాలా..? అనుకోకుండా దక్కిన అనూహ్య విజయం ఇది… ఇక సొమ్ము చేసుకునే పనిలోపడ్డాడు ఈ వినోదవ్యాపారి…!
నిజానికి దీన్ని పైరసీ నిర్వచనం కిందకు చేర్చవచ్చా..? చివరగా :: ఓటీటీలో షోను ఒకరిద్దరు లేదా కుటుంబం మాత్రమే చూడాలని ఏమైనా రాసిపెట్టి ఉందా..? పోనీ, ఊళ్లల్లో ఉచిత ప్రదర్శనకూ ఓ రేటు పెట్టేయకూడదా రాజయ్యా భాయ్… అవునూ… ఈ అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే పేరిట ఈ ఉచిత ప్రదర్శనలకు హాజరైన వాళ్ల మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటారా..?!
ఇప్పటిదాకా బలగం మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తోంది అంటూ సోషల్ మీడియాలో కుటిల రచ్చకు పూనుకుంటున్న వాళ్లూ, పెయిడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్లూ ఇక మొదలుపెట్టండి… దిల్ రాజుకు డప్పులు కొట్టడం…!! బలగం సినిమాకు మద్దతుగా ఏం రాస్తున్నా సరే, మనసులో ఏదో కలుక్కుమనేది… మనం ఈ దిల్ రాజును పెంచుతున్న పాపం మూటగట్టుకుంటున్నామా అని…!! ఒక మిత్రుడు సోషల్ మీడియాలో ఇలా స్పందించాడు… ‘‘ఇకపై నేను దిల్ రాజు తీసిన ఏ సినిమాను కూడా చూడను’’… #Idontwatchdilrajumovies…
Share this Article