కొన్ని సమర్థించాలో, వ్యతిరేకించాలో తెలియదు… ఉదాహరణకు… తమిళనాడులోని కడలూరు… ఓ స్కూల్ పిల్లాడు… తన ఫ్యామిలీ ఫ్రెండయిన అమ్మాయితో లవ్వు… పరస్పర అంగీకారంతోనే ఆమె మెళ్లో తాళి కట్టబోతున్నాడు… హుటాహుటిన బిలబిలమంటూ పోలీసులు, అంగన్‌వాడీ సిబ్బంది చుట్టుముట్టారు… అబ్బాయి మీద పోక్సో కేసు పెట్టారు… అమ్మాయిని చిల్ట్రెన్ హోంకు పంపించారు…
అసలు చిల్డ్రెన్ హోం అంటే అదొక నరకం… అందులోకి ఆ పిల్లను తోసేయడం అంటే క్రూరమైన జైలుశిక్ష విధించడమే… ఆమె ఏం తప్పు చేసిందని..? ఎస్, స్కూల్ ఏజ్‌లో ఈ ప్రేమేంటి..? ఈ పెళ్లేంటి..? నాన్సెన్స్ అనుకోవచ్చు, కానీ ఆ వయస్సులో అమ్మాయికి ఏం తెలుసని..? మంచీచెడూ ఏమర్థమవుతాయని… సినిమాలు, వెబ్ సీరీస్, స్మార్ట్ ఫోన్లు, టీవీ సీరియళ్లు ఎన్ని లేవు ఆమెను చెడగొట్టడానికి..? అబ్బాయి కూడా అంతే… ఇందులో అత్యాచారమేముంది..? ఆ వయసులో వాడు చేసేదీ తప్పే… కానీ కెరీర్, లైఫ్ స్పాయిల్ చేసేంత కఠిన చట్టాన్ని ప్రయోగించాలా..? పోనీ, బాల్యవివాహ నిరోధ చట్టమో, ఇతర సెక్షన్ల కింద ఇంకేవో కేసులు పెట్టినా సమర్థించవచ్చునేమో…
కౌన్సిలింగ్ చేయలేరా..? చికాకు అనిపిస్తోంది కదా… చట్టాలను పోలీసులు ప్రయోగించే తీరు మీద విరక్తి కలుగుతోంది కదా… అవును, సాక్షాత్తూ ఆ రాష్ట్ర డీజీపీ శైలేంద్రబాబుకు కూడా చిరాకెత్తింది… మొన్న మూడో తేదీన ఎస్పీలందరికీ ఓ సర్క్యులర్ పంపించాడు… ‘‘పోక్సో కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయకండి, ప్రత్యేకించి పరస్పర అంగీకారంతో కలిసి బతికే మైనర్ల విషయంలో ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకొండి… ముందుగా 41ఏ సెక్షన్ కింద నోటీసులు పంపండి… డీఎస్పీ లేదా ఎస్పీ పర్మిషన్ లేకుండా ఒక్క అరెస్టు కూడా జరగడానికి వీల్లేదు’’ అనేది ఆయన ఆదేశాల సారం…
Ads
ఆయనకు బాగా చిరాకెత్తించిన అంశమేమిటో కూడా ఆయనే వివరించాడు… ‘‘పర్వత ప్రాంతాల్లో ఉండే గిరిజన జనాభాకు సంబంధించి కొన్ని కేసుల్ని పరిశీలించాలి… చాలా ఆదివాసీ, గిరిజన తెగల్లో 18 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు చేస్తారు… దాన్ని ఆచారంగా భావిస్తారు… ఒకేసారి మార్చలేం… మనమేమో సర్కారీ హాస్పిటళ్లలో ప్రసవాలను ఎంకరేజ్ చేస్తున్నాం… అది మంచిది కూడా… కానీ ఒక 17 ఏళ్ల అమ్మాయి డెలివరీ కోసం హాస్పిటల్‌కు వెళ్తే, పోలీసులకు వాళ్లు సమాచారం ఇచ్చారు…
వెంటనే పోలీసులు వెళ్లి పోక్సో కేసు పెట్టేశారు… ఆమె భర్తను అరెస్టు చేశారు… ఇలాంటివి బోలెడు… ఇక ప్రసవాల కోసం ఎవరు వస్తారు హాస్పిటళ్లకు..? ఇందులో ఆ అబ్బాయి చేసిన నేరమేముంది..? ఇదిలాగే కొనసాగితే ఇక ఎవరూ ప్రసవాల కోసం హాస్పిటళ్లకు రారు, తండాల్లో మంత్రసానులే దిక్కు అవుతారు… గిరిజన జనాభాను జనజీవన స్రవంతిలోకి రానివ్వాలా వద్దా..?’’ ఆయన సర్క్యులర్ టోన్ ఇదీ… నిజమే… ఓ లెక్క తీస్తే రాష్ట్రంలో 60 శాతం పోక్సో కేసులు ఇలాంటివేనట…
డీజీపీ కూడా అల్లాటప్పాగా ఏమీ ఆదేశాలు జారీ చేయలేదు… మద్రాస్ హైకోర్టు జువైనల్ జస్టిస్ కమిటీ, పోక్సో కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకే ఈ ఆదేశాలు… అంటే పోలీసులు కేసులు పెడుతున్న తీరు గిరిజన తండాల్లో ఒక అన్‌రెస్ట్‌ను క్రియేట్ చేస్తున్నట్టే కదా… నిజానికి పోక్సో చట్టంలోనే బోలెడు అస్పష్టత… చాలా కేసులు నిలబడవు… కానీ ఈలోపు ఆ నిందితులకు ఖర్చు, ప్రయాస, సొసైటీలో చిన్నతనం, చదువు, కెరీర్ అన్నీ గోవిందా… అన్నింటికీ మించి ఆ గిరిజన అమ్మాయి బాధితురాలు ఆ అబ్బాయి వల్లా..? ఆ చట్టం వల్లా..?! (ఈ కథనం కోసం వాడిన ఫోటో కేవలం ప్రతీకాత్మకం…)
Share this Article