.
Devi Prasad C …… ఒంటరిగా నిలబడివున్న హీరో మీద తన జనంతోవున్న విలన్ (రాజకీయనాయకుడు) రెచ్చిపోతున్నాడు.
“మా కులపోడని, మా మతమోడని, మేము పడేసే చిల్లరకు అమ్ముడుపోయి మాకు ఓట్లేసే జనం గొర్రెలుకాక మరేమిటి? నీలాంటివాళ్ళు వందమంది వచ్చినా వాళ్ళను మార్చలేరు మమ్మల్ని ఆపలేరు” (సరిగ్గా సన్నివేశం ఇదేకాకపోయినా ఇలాంటిదే) అంటూ దర్శకులు కోడి రామకృష్ణ గారు సన్నివేశం చెబుతుంటే మధ్యలో కట్ చేసి “వెంటనే హీరో విలన్ మీదికి దూకి ఒక్క తన్ను తంతే ఎగిరిపడాలి విలన్” అన్నారు “కె.ఆదిత్య” గారు.
“లేదండీ, సినిమా మధ్యలోనే హీరోది అప్పర్‌హ్యాండ్ కాకూడదు” అని డైరెక్టర్ గారంటే “అన్ని మాటలన్నాక కూడా కొట్టకపోతే వాడేం హీరో సార్” అనేది ఆదిత్య గారి వాదన.
Ads
చర్చ వాడిగావేడిగా సాగుతోంటే ఆదిత్య గారి చేయి టీపాయ్ మీదున్న సిగరెట్ ప్యాకెట్ మీద పడింది. అంటే ఆయనకు కోపం వచ్చిందని అర్ధం. లేచి డోర్ తీసుకొని బైటికి వెళ్ళిపోయారు.
గురువుగారు నవ్వుతూ ఆదిత్య గారికి కోపం ఒచ్చినట్లుంది చూడండయ్యా అంటే మేము బైటికెళ్ళి సిగరెట్ కాలుస్తున్న ఆయనని శాంతింపచేసి తీసుకురావటం తరచూ జరుగుతుండేది. కధ బాగా రావాలన్నదే ఇద్దరి తపన.
ఎవరీ ఆదిత్య గారు?
తెలుగు సినిమా స్వర్ణయుగంలో గొప్ప చిత్రాలకు రచన చేసిన “సీనియర్ సముద్రాల” గారి మేనల్లుడు.
హాస్యరచనలో అగ్రగణ్యులైన “అప్పలాచార్య” గారికి తమ్ముడు.
“దర్శక శిఖరం కె.బాలచందర్” గారి వద్ద “మరోచరిత్ర” సినిమా మొదలుకొని ఎన్నో గొప్ప సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఆయనది.
ఆయన అసలు పేరు కె.సత్యం. మాకు గురుసమానులు.
కె.ఆదిత్యగా పేరు మార్చుకొని “ఈ ప్రశ్నకు బదులేది?” “యుగకర్తలు” “నవయుగం” చిత్రాలకు దర్శకత్వం వహించారు.
హాస్య నటులు “బాబూ మోహన్” గారు వెండితెరపై తొలిసారి కనిపించింది “ఈ ప్రశ్నకు బదులేది” చిత్రంలోనే.
బాల నటిగా నటించిన “మీనా”కు “నవయుగం” సినిమా ద్వారా తొలిసారి హీరోయిన్‌గా అవకాశం కల్పించింది ఆదిత్యగారే.
నటులు “ఆహుతి ప్రసాద్” గారికి ఆహుతి సినిమాకంటే ముందు తొలి అవకాశాలిచ్చిందీ ఆదిత్యగారే.
మా గురువు గారి సినిమాలకు, విజయేంద్రప్రసాద్ గారికి, ఎందరో యువదర్శకులకు, తమిళ దర్శకుడు “అట్లీ” వంటి వారికి కధా సహకారమందించారు. కొన్ని చిత్రాలలో నటించారు.
సాహిత్యం పైన, ప్రపంచ సినిమాలపైన అమోఘమైన పట్టుంది ఆయనకి.
కధా చర్చలలో ప్రత్యేకించి ఉద్వేగ భరిత సన్నివేశాలను ఆయన చెబుతున్నప్పుడు రోమాలు నిక్కబొడిచేవి.
లౌక్యం , ముఖస్తుతి వంటి మాటలు ఆయన నిఘంటువులో లేని పదాలు.
ఓ రాత్రి కధాచర్చలు జరుగుతున్నప్పుడు అక్కడికొచ్చిన ఓ పెద్ద స్టార్ హీరో కధకి అస్సలు సంబంధంలేని ఏవేవో సలహాలిచ్చారట.
“మీకు బదులుగా కెమేరా ముందు మేము డాన్సులు చేస్తే ఎంత అందంగా వుంటుందో మీరు చెప్పినట్టు కధ రాసినా అంతే ఉంటుంది “అన్నారట ఆదిత్యగారు. ఆ హీరో సైలెంట్‌గా వెళ్ళిపోయారట.
మరుసటిరోజు ఉదయం గురువు గారు ఆ విషయాన్ని చెబితే అందరూ అవాక్కయ్యారు.
ఓ నిర్మాత గారు అసిస్టెంట్ డైరెక్టర్లు గా పనిచేసే మాకు మంచి భోజనాలు పెడుతూ, అప్పుడప్పుడూ పార్టీలిస్తూ, జీతాలడిగితే మాత్రం “మీరందరూ బ్యాచ్‌లర్సే కదా మీకేం ఖర్చులుంటాయి” అని నవ్వేసి ఊరుకునేవాడు.
ఆ విషయం ఆదిత్య గారికి తెలిసి ఓరోజు పార్టీలో ఆ నిర్మాతతో” సినిమా కోసం ఎంతో కష్టపడే అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు. మీరు పార్టీలిస్తే సంతృప్తి పడిపోవటానికి మీ బానిసలు కారు.పెళ్ళిళ్ళు కాకపోతే మాత్రం వాళ్ళకు తల్లితండ్రులు బాధ్యతలు ఏమీవుండవా? ఆత్మాభిమానం ఉండదా వాళ్ళకి? ఇలాగే స్టార్స్‌కి ఎగ్గొట్టగలరా?” అంటూ క్లాస్ పీకటంతో మరుసటిరోజు జీతాలిచ్చాడా నిర్మాత.
కల్మషం లేని ఆగ్రహం ఆయనది.
కొలత వేయలేని వాత్సల్యం ఆయనది.
ఆయన మీది గౌరవంతో నా దర్శకత్వంలో “ఆడుతూ పాడుతూ” సినిమాలో ఓ పాత్రని ఆయనతో నటింపజేశాను.
అర్జునుడిని గొప్ప విలుకాడని పొగిడే సమాజం అతడిని వీరుడిగా తీర్చిదిద్దిన ద్రోణాచార్యుడిని విస్మరిస్తుంది.
పరిశ్రమలో ఎందరో విజయుల విజయాలకు వెనుక నీడలా నిలిచిన ఆచార్యులు మా ఆదిత్య గారు.
అనివార్యమైన మరణం ఆయనని భౌతికంగా మాకు దూరం చేసినా ఆయన జ్ఞాపకాలు మా మనసులకెప్పుడూ దగ్గరగానే ఉంటాయి. ______ దేవీప్రసాద్.
Share this Article