Bharadwaja Rangavajhala…… డెబ్బై, ఎనభైయిల్లో వచ్చిన కొన్ని సినిమాలకు దర్శకత్వం పి.సాంబశివరావు అని పడేది కదా… ఆయనే ఈయన. పర్వతనేని సాంబశివరావు…
తను తీసిన చాలా సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లే రాబట్టుకున్నాయి. పైగా టేస్టున్న డైరక్టరు అనే ముద్ర కూడా ఉంది. ఆయన తీసిన సినిమాల్లో ఇంటింటి రామాయణం సూపర్ డూపర్ హిట్టు. ఆ తర్వాత కుమారరాజా, కొత్తల్లుడు.
Ads
కొత్తల్లుడు సినిమాకి ముళ్లపూడి వెంకటరమణతో స్క్రిప్టు రాయించుకున్నారు. ఇంటింటి రామాయణానికి జంధ్యాల రచయిత. ఇంటింటి రామాయణం నిర్మాత నవతా కృష్ణంరాజు గారు సాంబశివరావు గారికి ఏలూరు కాలేజీలో సహాధ్యాయి. సాంబశివరావుది ఏలూరు.
ఆయన అన్న పర్వతనేని గంగాధరరావు తెలుగు సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతులున్న స్టిల్ ఫొటోగ్రాఫర్. తర్వాత రోజుల్లో నవశక్తి పేరుతో బ్యానర్ ప్రారంభించి ప్రయోగాత్మక చిత్రాలతో పాటు భారీ చిత్రాలూ తీసి పాపులర్ అయ్యారాయన. ప్రభ కు పేరు తెచ్చిన నీడలేని ఆడది సినిమా కూడా నవశక్తి బ్యానర్ లోనే వచ్చింది.
ఏలూరులోనే డిగ్రీ చదివిన సాంబశివరావు యాభై దశకం చివరి రోజుల్లో ఇండస్ట్రీ ప్రవేశం చేశారు. అన్న గంగాధరరావుగారి రికమండేషన్ లో విక్రమ్ లాబొరేటరీస్ లో ఉద్యోగం చేశారు. అక్కడ నుంచీ సారధీ స్టూడియోస్ కి మారారు. ఆ పని నచ్చక … ప్రొడక్షన్ వ్యవహారాల్లోకి వచ్చారు.
మొత్తం హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. అది నవశక్తి బ్యానర్ లోనే వచ్చింది. ఆ సినిమా దర్శకుడు రామినీడు దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేరి అక్కడ నుంచీ ఆదుర్తి కాంపౌండుకు మారాడు. ఈ అనుభవంతో నవశక్తి బ్యానర్ లోనే అర్ధరాత్రి అనే సినిమా జగ్గయ్య హీరోగా తీయడం … అది హిట్టు కొట్టడం జరిగిపోయింది.
ఎస్వీఆర్ , శోభన్ బాబులతో తీసిన వంశోద్దారకుడు ఓ మోస్తరుగానే ఆడింది. అడవిరాముడు తర్వాత సత్యచిత్ర బ్యానర్ లో వచ్చిన మూడు చిత్రాలకూ ఆయనే దర్శకుడు. కృష్ణతో కాస్త ఎక్కువ సినిమాలు చేశారు. కృష్ణ రెండువందలో చిత్రం ఈనాడు కూడా సాంబశివరావు దర్శకత్వంలోనే రూపొందింది.
వాసిరెడ్డి సీతాదేవి మృగతృష్ణ నవలను సినిమాగా తీశారు. అన్నట్టు కొమ్మూరి వేణుగోపాల్రావు రాసిన ప్రేమనక్షత్రం కూడా సాంబశివరావు నేతృత్వంలోనే తెరకెక్కింది. ప్రేమ నక్షత్రం పాయింటుతోనే ఆ తర్వాత రోజుల్లో అన్నగారు సింహం నవ్వింది తీశారు. బాపుగారు పెళ్లి పుస్తకం తీశారు.
ఇంకో విశేషమేమంటే .. పర్వతనేని గంగాధరరావుగారు మంచికి మరో పేరు టైటిల్ తో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తీశారు. దాన వీర శూర కర్ణకు ముందు వచ్చిన ఆ సినిమా దెబ్బతింది. అయితే ఆ సినిమాకు సాంబశివరావు దర్శకత్వం వహించారు. పేరు మాత్రం సి.ఎస్.రావు అని పడుతుంది.
మంచికి మరో పేరు సంబంధించిన మరో విశేషం … ఆ సినిమాకు ఇషాన్ ఆర్య కెమేరామెన్ గా పనిచేయడం…
Share this Article