Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పాపం పసివాడు సినిమా గుర్తుందా..? ఐతే ఇది చదవండి ఓసారి…

July 17, 2023 by M S R

Bharadwaja Rangavajhala……   విరామచంద్ … టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టారరుల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన దేవుడు చేసిన మనుషులు . ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచీ వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. మన పాపులర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ఆయనకు సమీప బంధువు. వి.రామచంద్రరావు సుదీర్ష సహాయ దర్శకత్వ అనుభవం తర్వాత చేసిన తొలి చిత్రం మరపురాని కథ.

ఆ సినిమా చూసి … నీ అభిప్రాయం రాసి పంపించు అని అప్పటికి చిన్నపిల్లాడైన యండమూరికి చెప్పారట రామచంద్రరావు. ఈయన రాసి పంపించారు. అదే ఆయన తొలి రచన. రాయాలనే తపనను ప్రేరేపించింది ఆ రచనే అంటారు యండమూరి. తెర మీద చెప్పిన కథ చెప్పకుండా చెప్పిన డైరక్టర్ గా రామచంద్రరావుగారికి ఓ పాపులార్టీ ఉంది. ఆయన ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకం. డిఫరెంట్ సబ్జక్టులతో సినిమాలు తీసేవాడాయన. అనుకోని పరిస్థితుల్లో విమానం కూలి ఓ కుక్కపిల్లతో సహా ఎడారిలో చిక్కుకుపోయిన పసివాడి కథతో తెరకెక్కిన పాపం పసివాడు సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. దాని దర్శకుడు రామచంద్రరావు గారే.

అట్టాగే అమ్మాయిగారు అబ్బాయిగారు అనే ఫ్యామ్లీ సబ్డక్టు … దానికి ముందు క్రైమ్ తరహా కథతో నేనంటే నేను .. వీటికంటే ముందు టైగర్ మూవీస్ బ్యానర్లో నెల్లూరు కాంతారావు తీసిన అసాధ్యుడు. ఇలా ఏ సినిమాకా సినిమా స్పెషలే. హీరో కృష్ణనీ హీరోయిన్ వాణిశ్రీని బాగా ప్రమోట్ చేసేవారాయన. పద్మాలయా బ్యానర్ లో తొలి బిగ్గెస్ట్ హిట్ దేవుడు చేసిన మనుషులు ఆయన రూపొందించినదే. అల్లూరి సీతారామరాజు రూపకల్పనకు కృష్ణకు ఉన్న ధైర్యం రామచంద్రరావే.

Ads

ఆ సినిమా తొలి షెడ్యూల్ కూడా పూర్తి కాకుండానే ఆయన కన్నుమూయడం విషాదం. అప్పటికి ఆయన వయసు కేవలం నలభై ఏడే … బిఎ ఆనర్స్ చేసిన రామచంద్రరావు చదువు కాకినాడ, తాడిపత్రి, కొవ్వూరు , మద్రాసుల్లో సాగింది. రామచంద్రరావులో మంచి నటుడు ఉన్నాడు. ఆయన హైస్కూలు రోజుల్లో మోనో యాక్టర్ గా పాపులార్టీ సంపాదించాడు. అలాగే అమ్మాయి పాత్రలు కూడా ఆయనతోనే చేయించేవారు.

కన్యాశుల్కంలో బుచ్చెమ్మ పాత్ర ఆయనకు చాలా పాపులార్టీ తీసుకువచ్చింది. అలాగే సాహిత్య రంగంలోనూ ఆయనకు ప్రవేశం ఉంది. విరామచంద్ అనే పేరుతో కవిత్వం రాసేవారాయన. ఒక్కోసారి నయాగరా అనే పెన్ నేమ్ ను కూడా వాడేవారాయన. ఈ సాహిత్యాభిలాషతోనే రాత పత్రిక నడిపాడు. సాహిత్య చర్చలు నిర్వహించేవాడు. మద్రాసులో చదువుకునే రోజుల్లో ఆంద్ర విద్యార్ధి విజ్ఞాన సమితికి అధ్యక్షుడుగా పన్జేశారు.

మంచి స్పీకర్ అనే పాపులార్టీ కూడా ఉండేదాయనకి .

దర్శకుడుగా ఆయన టాలెంట్ ప్రపంచానికి తెలియచేసిన నాటకం అంతర్యుద్దం. అంతర్ కళాశాల నాటక పోటీల్లో దానికి ఉత్తమ ప్రదర్శన పురస్కారం దక్కింది. ఈ నాటక పోటీల్లోనే తాపీ చాణక్యతో పరిచయం ఏర్పడింది. తను దర్శకుడవగానే రోజులు మారాయి సినిమాకి తన దగ్గర అసిస్టెంట్ గా వి.రామచంద్రరావుకు అవకాశం కల్పించారు చాణక్య. ఆ తర్వాత ఆమంచర్ల శేషగిరిరావు, జి.విశ్వనాథం, కమలాకర కామేశ్వరరావు, పినిసెట్టి, సి.పుల్లయ్య తదితర దర్శకుల దగ్గర కూడా పన్జేశారు. సహాయ దర్శకుడుగా ఆయనది సుదీర్ఘ కెరీర్. వి.మధుసూదనరావు రాజ్యలక్ష్మీ వారి చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న రోజుల్లో రామచంద్రరావు ఆయన దగ్గర పన్జేసేవారు. గుడిగంటలు, వీరాభిమన్యు, గూఢచారి 116 సినిమాలకు ఆయన పనిచేశారు.

అప్పుడు డూండీని ఎట్రాక్ట్ చేశారు రామచంద్రావు. మరపురాని కథ స్క్రిప్టు అనుకున్నప్పుడు డూండీ గారు తిన్నగా రామచంద్రరావును పిల్చి నువ్వే ఈ కథను డైరక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అప్పగించేశారు. సరిగ్గా డూండీ ఈ నిర్ణయం చెప్పడానికి కాస్త అటూ ఇటూగా నెల్లూరు కాంతారావు కూడా డైరక్షన్ ఆఫర్ ఇచ్చి ఉన్నారు. అలా ఆయన దర్శకుడు అనిపించుకున్న తొలి చిత్రం అసాధ్యుడే గానీ విడుదలైన తొలి చిత్రం మాత్రం మరపురాని కథే.

డైరక్టర్ అనిపించుకున్నప్పుడు సెట్స్ మీదా తనకేమీ కొత్తగా అనిపించలేదనేవారు రామచంద్రరావు. దర్శకుడుగా ఓనమాలు తాపీ చాణక్య చెపితే వ్యాకరణం కమలాకర దగ్గర నేర్చుకున్నాననేవారట ఆయన. చెప్పే విషయం పాతదే అయినా కొత్తగా ఎలా ప్రజంట్ చేయాలి అనే టెక్నిక్కు తెల్సింది మాత్రం డూండీ స్నేహంలోనే అని చెప్పేవారాయన. సహాయ దర్శకుడుగా సహకార దర్శకుడుగా సుమారు పన్నెండేళ్ల పాటు పన్జేసిన తర్వాత దర్శకుడయ్యాడాయన. రచయితలతో కూర్చుని స్క్రిప్ట్ వర్క్ చేయించడం ఆయనకు చాలా ఇష్టం. తను చదివిన పుస్తకాల్లోంచీ అనేక సన్నివేశాలను సినిమాల కోసం క్రియేటివ్ గా వాడుకునేవాడట ఆయన.

దేవుడు చేసిన మనుషులు అనే టైటిల్ గురజాడ అప్పారావు గారిది. శ్రీశ్రీ సలహా మేరకు ఈ టైటిల్ తన సినిమాకు వాడుకున్నారాయన. తెలుగులో ఆ సినిమా తర్వాత చాలా మల్టీ స్టారర్లు వచ్చాయిగానీ .. దాన్ని మించినది మాత్రం రాలేదు. ఆయన చూపిన బాణీలోనే అల్లూరి సీతారామరాజు సినిమాను తెరకెక్కించేశారు కృష్ణ. పోరాట సన్నివేశాలను మాత్రం కె.ఎస్.ఆర్ దాస్ చిత్రీకరించారు. ఆయనకు సంబంధించిన ఫ్యామ్లీ ఫొటోలు ఇస్తానని యండమూరి వాగ్దానం చేశారు .. మరి ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పలేను. ఆ తర్వాత కల్సినప్పుడల్లా నేను అడుగుట … ఆయన నవ్వి ఈసారి అనుట జరుగుతూనే ఉన్నది మరి …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions