చిత్రమేంటంటే…..
మొన్నటి దాకా తెగమొత్తేసిన వర్షాలు నిన్నటితో ఆగి పోయినియ్యి.
Ads
పెద్ద వీధిలో దేవీని నిలబెట్టేసేరు చింతా వారు. చాలా ఖర్చుపెట్టి ప్రోగ్రాములు జరిపించే వాళ్ళ పందిట్లో ప్రతి ఏటా ఆ తెనాలి బుర్రా సుబ్రమణ్యశాస్త్రిగారి నాటకం వుండి తీరాల్సిందే.
చింతామణి, శ్రీకృష్ణతులాభారం, సతీసక్కుబాయి, ఇలాగ. మా ఊళ్ళో ఎక్కువ సార్లు ఆడిన నాటకం చింతామణి… నా జీవితంలో నేనెక్కువ సార్లు చూసిన నాటకం ఆ చింతామణి.
***
ఊరి పెద్దవీధికి ఎడం పక్కన రాజేశ్వర స్వామిగుడి వుంటే కుడి పక్కన అర ఎకరం నేలలో చుట్టూ ప్రహారీ వుంటే లోపల గోపాలస్వామిగుడి. లోపలి కెళ్ళాలంటే ముఖద్వారం తెరుచుకుని కొంత దూరం నడిస్తే కనిపిస్తుందా గోపాలస్వామి గర్భగుడి. దాని చుట్టూరా ఖాళీగా వుంటుంది గాబట్టి డ్రామా ట్రూపు లోళ్ళందర్నీ అందులో పెడతారు.
శాస్త్రిగారి నాటకంతో నవరాత్రులు మొదలవుతున్నాయి గాబట్టి ఆవేళ మధ్యాహ్నమే ట్రూపుతో పాటు దిగిపోయిన ఆయన్ని చూడ్డానికి కోముట్లు చిన్నాగాడితో పాటు నేనుకూడా పరుగెట్టుకుంటా వెళ్ళేను.మూసేసున్న ఆ పెద్ద తలుపులోపల గెడపెట్టేసేరు. దాంతో ఆ గుమ్మం పక్కనే పొడగాటి ఊచలున్న ఆ కిటికీ దగ్గరకి జేరి లోపలున్న శాస్త్రిగార్ని ఎవరో సినిమా యాక్టర్‌ని చూస్తున్నట్టు చూస్తున్నాను.
పంచె లాల్చీలో హార్మోనియం పెట్టి ముందు కూర్చున్న ఆ శాస్త్రిగారు వాళ్ళ కళాకారులందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని పద్యాలు పాడతా మధ్య మధ్యలో జోకులేసి నవ్విస్తున్నారు.
రాత్రయ్యింది.
మా వూరి జనం మొత్తం అక్కడే ఉన్నారు.ఒట్టి కాకీనిక్కరు ఒంటినిండా ఎర్రకంకర దుమ్ముకొట్టుకు పోయున్న నేను స్టేజికి ముందు వరసలో తొక్కుడు హాన్మోనియం మనిషి పక్కనే దొంతిరి కాళ్ళ మీద కూర్చుని చూస్తున్నాను.
మొదలైన ఆ సతీసక్కుబాయి నాటకం మా గొప్పగా రక్తికడతా నడుస్తుంది. అత్తకీ సక్కుబాయికీ మధ్య గొడవ సీను మాంచి బిగ్గా సాగుతున్న టైములో ఆ అత్తగారి వేషం వేసే ఆవిడ కళ్ళు తిరిగిపడిపోడంతో లైట్లార్పి డేరా వేసేసేరు.
కాసేపటికి మొదలైనా నాటకం అదేంటో ఆ అత్తగారు లేకుండానే చెకచెకా పరిగెడతా పూర్తయ్యింది.
అయిపోయేకా అందరూ ఇళ్ళకెళ్తుంటే నేను మట్టుకు ఆ శాస్త్రిగారి ట్రూపులో అత్తవేషమేసినా ఆడమనిషికి ఏమయ్యిందో అని ఆ కిటికీ దగ్గర కెళ్ళేను.
కమిటీ సభ్యులైన చింతా అప్పారెడ్డిగారు, చింతా హరిగారూ మాట్లాడుకుంటున్నారు. ఆ వేషమేసినావిడ శాస్త్రిగారి భార్య జయలక్ష్మి. మూడు రోజుల్నించి జ్వరమంట ఆవిడకి.
ఆ తర్వాత మా ఏరియాలో ఎక్కడ శాస్త్రిగారి నాటకం ఆడినా అద్దిసైకి లేసుకుని వెళ్ళిపోతా వుండేవోడ్ని. సత్యహరిశ్చంద్ర, అనార్కలి, తారాశశాంకమూ, రోషనార అలా అన్ని నాటకాలూ చూసేసేను
ఒక ఏడాది పెద్ద పందిట్లో ఆ శాస్త్రిగారికి సంబంధించిన ఒక ఇన్సిడెంటు చూసిన కొన్నాళ్ళకి మద్రాసు వెళ్ళిపోయేను.
డైరెక్టరైన తర్వాత జ్యోతిచిత్ర, సినీహెరాల్ట్, శివరంజని లాంటి పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నాటకాల ప్రసక్తి వచ్చినప్పుడల్లా “నా జీవితంలో నేను ఎక్కువ సార్లు చూసింది బుర్రా సుబ్రమణ్య శాస్త్రిగారి నాటకాలు” అని చెప్పడంతో పాటు ‘ఆ శాస్త్రిగారు ఎక్కడైనా కనపడితే చూద్దాం వారిని’ అని కూడా అన్నాను.
***
మళ్ళీ చాలా ఏళ్ళు గడిచిపోయినియ్యి.
ఫిలిం నగర్లో ఆనంద్ సినీ సర్వీస్ దగ్గర్లో ఉన్న కేరెక్టర్ ఆర్టిస్ట్ బాలాజీ ఇంటి మీద సినిమా ఆఫీస్. రాజమండ్రీ చందన రమేష్ గారి పెట్టుబడితో (మేకప్) జయకృష్ణగారి ఆద్వర్యంలో తయ్యబోయే ఆ సినిమాకి నేను డైరెక్టర్ని.
నా పాత సినిమాల్తో పోలిస్తే కాలనీలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వుండటం తప్ప చాలా గమ్మత్తైన కథ.
చాలా కారెక్టర్లున్న ఆ కథలో నాటకాల్లో ఆడవేషాలేసుకుని ఇప్పుడు పెద్దోడైపోయిన ఒక కేరెక్టరు. అప్పుల వాడొచ్చినప్పుడల్లా గెటప్ మార్చేస్తా వుంటాడు.
కథంతా విన్న జయకృష్ణగారు “ఈ వేషానికి బుర్రా సుబ్రమణ్యశాస్త్రి గారైతే భలే గుంటది” అన్నారు.
కరెంట్ షాక్ కొట్టినట్టైంది నాకు. కొంచెం తేరుకున్నాకా “చాలా మంచి సజెషనిచ్చేరు. అయితే ఈ కామెడీ కేరెక్టరు ఆ శాస్త్రిగార్లో పలుకుద్దా? ఇంకెవర్నన్నా అనుకుందాం” అన్నాను.
గట్టిగా. నవ్వేసిన జయకృష్ణగారు “పచ్చి విలన్ లుక్కుండే ఆనందమోహన్ కనక మాలక్ష్మీ రికార్డింగ్ డేన్స్ ట్రూపులో కామెడీ చేసేడు. లేడీస్ టైలర్లో విలన్ వెంకటరత్నం వేషమేసిన ప్రదీప్ శక్తి , ఏప్రిల్ 1 విడుదలలో జగన్నాథం బాబాయి నంటా బోల్డు కామెడీ చేసేడు. ఈ మధ్య తీసిన ఔను…. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారులో జీవా సంగతేంటీ?”
అర్థమైన నేను “ఆ శాస్త్రిగారు తెనాలిలో వుంటారు గదా?” అన్నాను.
“ఇక్కడే ఉంటున్నారిప్పుడు…. మన సినిమాల్లో వాడిన మంచి మంచి చీరలు ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చినప్ప
ట్నుంచీ మనకి మంచి ఫ్రెండైపోయేరు నాకు…. ఎప్పుడెళ్దాం మరీ?” అన్నారు.
***
టోలీ చౌకీ దగ్గర పద్మనాభనగర్‌లో ఒక డాబా యింట్లో వుంటున్న ఆ బుర్రా సుబ్రమణ్యశాస్త్రిగారి దగ్గరకెళ్ళేకా ఇప్పుడు పెద్దోడైపోయినాయన్ని అలా చూస్తున్నాను. ఆడవేషంలో ఆనాటి అందాల రాశిని అలా చూస్తానే వున్నాను.
నా చూపులేం అర్థంగాని ఆయన నవ్వుతా జయకృష్ణగారితో మాట్లాడి నా వేపు తిరిగినప్పుడు పసలపూడిలో సక్కుబాయి ఆడినప్పటి ఆ ఇన్సిడెంటు గుర్తు చేస్తే “ఏనాటి మాట…. ఆ వేషమేసిన నా భార్య జయలక్ష్మి జ్వరమొచ్చి పడిపోలేదు. వేవిళ్ళు మా అబ్బాయి సాయి కడుపులో వున్నాడప్పుడు” అన్నారు.
“మీ అబ్బాయి సాయా?” అన్నారు జయకృష్ణ.
“అదేనండీ ఇప్పుడు డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్”
“అవునా!!!” అన్న జయకృష్ణగారు వచ్చిన పని చెప్పేరు.
ఆయన చెయ్యాల్సిన కారెక్టర్ గురించి చెపితే మొత్తమంతా విని చాలా సంబరపడి పోతా “ఈ వయసులో నా జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర ఇది అద్భుతం గా చేద్దాం ”అన్నారు.
కాసేపయింది.
ఆయన్ని కుదిపేస్తా రకరకాల ప్రశ్నలేసేను.
నవ్వుతా సమాధానాలు చెపుతుంటే వింటన్నాం.
మామూలుగా స్త్రీ వేషం మగోడేస్తే ఇట్టే దొరికిపోతాడు. ఆ శాస్త్రిగారు ఆడవేషం వేస్తేమట్టుకి మగోడ్రా అని పోల్చుకోడం ఎవడి తరం కాదు.
ఆయన చీరకట్టు ఒక అద్భుతం అనాలి. ఒకసారి తెనాలిలో ‘చింతామణి’ నాటకం ఆడినప్పుడు “ఆయనంత అందంగా ఆడోళ్ళెవరైనా చీరకట్టు కుంటే వారికి వెయ్యినూట పదహార్లు బహుమానం” అని చాటింపు వేసేరంట. వెయ్యి నూటపదహార్లంటే ఆ రోజుల్లో చిన్న మొత్తం కాదు గదా? కానీ,ఏ ఆడమనిషీ ముందుకొచ్చే సాహసం చెయ్యలేదు.అదేంటంటే “ఆయన లాగ మేం కట్టుకోలేం” అంటా తేల్చి చెప్పేసేరా ఆడోళ్ళు.
వింటున్న నేను రెప్పార్పకుండా ఆయన్నే చూస్తుంటే “రాత్రుళ్ళు ఈ లేడీ గెటప్ వేసుకునే మీకు ట్రబు ల్సెప్పుడన్నా వచ్చినియ్యా సార్?” అన్నారు జయకృష్ణ.
“ఒకసారి అన్నవరం రైల్వేస్టేషన్‌కీ, ఆఊరికీ మధ్యలో వున్న గోపాలపట్నం అనే ఊరనుకుంటాను అక్కడో ఇన్సిడెంటు జరిగింది” అన్నారు శాస్త్రి.
“ఏం జరిగిందండీ?” అన్నారు జయకృష్ణ.
మొదలైన చింతామణి నాటకం జరుగుతుండగా బాగా తాగేసొచ్చిన నలుగురు కుర్రోళ్ళు స్టేజికి దగ్గరగా జనం మధ్యలో కూర్చున్నారు.
స్టేజి మీద శాస్త్రిగారి అభినయం అందం చూస్తున్న వాళ్ళకి మతిపోతుంది. పాత్రలో ఇన్వాల్వయిపోయి చేస్తున్న ఆ చింతామణిని చూస్తున్న వాళ్ళలో రకరకాల ఆలోచన్లు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికి ఈ చింతామణిని అనుభవించి తీరాల్సిందే అన్న నిర్ణయానికొచ్చేసేరు.
స్టేజి మీద చిత్ర సుబ్బిశెట్టి, శ్రీహరి కాంబినేషన్ మొదలవడంతో కాస్త విరామం దొరికిన శాస్త్రి కాలకృత్యం తీర్చుకుందారని ఆ స్టేజి వెనక కాస్త దూరంగా వున్న ఆ పొలాల వేపు కదిలేరు. అది చూసిన కురోళ్ళు ఆయన్ని ఫాలో అవడం మొదలెట్టేరు.
అలా కొంత దూరమెళ్ళేకా ఫాలో అవుతున్న అల్లరి మూక శాస్త్రి మీద విరుచుకుపడిపోయి ఆయన్నెత్తుకుని ఆ పొలాల్లోపలి బోరింగ్ షెడ్డులోకి తీసుకుపోతున్నారు.
“ఆగండ్రా నేను మగాడ్ని” అనా శాస్త్రి అరుస్తున్నా వినడం లేదాళ్ళు.”
ఆ షెడ్లోకి తీసుకెళ్ళిపోయి బట్టలు లాగేసిన వాళ్ళకి జాకెట్ లోపల గుండ్రటి స్పాంజీలూ బయటపడ్డంతో మతోయింది. తాగింది మొత్తం దిగిపోయింది.
అదంతా విన్న జయకృష్ణ “మీరంత అందంగా తయారైతే ఆళ్ళేంటీ ఎవరు మోసపోరండీ?… మీకు చాలా బిరుదులొచ్చినియ్యి గదాండీ?” అన్నారు.
శాస్త్రి అభినయానికి ముగ్దులైన విశ్వనాథ సత్యనారాయణ “నాట్యాచార్య” బిరుదుతో సత్కరించారు. కొండవీటి వెంకటకవి “నాట్య మయూరి” అన్నారు. “నాట్యకళాప్రపూర్ణ”, “అభినయం” “విశారద”, “కళారత్న” ఇలా అందుకోని బిరుదుల్లేవు. ప్రేక్షక దేవుళ్ళయితే “అభినయ సరస్వతి” అంటా దణ్ణమెట్టారు.
“అవమానాలు కూడా జరిగుంటాయే?”
ఇది 1980 నాటి ముచ్చట. ప్రసిద్ధ నటి భానుమతీ రామకృష్ణ భరణీ పిక్చర్స్ బ్యానర్ మీద “భక్తదృవ మార్కండేయ” సినిమా మొదలెట్టబోతున్నారు. అందులో పాత్రధారులంతా పదేళ్ళలోపు పిల్లలే. ఆడిషన్స్ జరుగుతున్నాయి.
ఆ సినిమాలో తన కొడుకుతో వేషం వేయించాలని (ఇవాళ మార్కెట్లో ఉన్న మాటల రచయిత బుర్రా సాయిమాధవ్) భార్యతో పాటు భానుమతిగారింటి కెళ్ళేరు.
తననెవరో కలవడానికొచ్చేరని పనోడు చెపితే హాల్లోకొచ్చిన భానుమతి గార్ని చూసిన దంపతులిద్దరూ లేచి చేతులెత్తి నమస్కరించేరు.
కనీసం కూర్చోమని కూడా అనకుండా “ఎవరూ?” అన్నారు.
“అమ్మా! నా పేరు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి స్టేజి మీద ఆడవేషాలు వేస్తాను. ఈమె నా భార్య జయలక్ష్మి” అన్నారు.
ఇంకో మాటకి సందివ్వకుండా ఆమెని చూసినా భానుమతి గారు “నువ్వు మగ వేషాలేస్తావా?” అన్నారు వెటకారంగా.
శాస్త్రిగారి అహం దెబ్బతింది. “సాక్షాత్ శారదా స్వరూపులూ… సాటి కళాకారులైన మిమ్మల్ని ఒకసారి చూద్దామనొచ్చేం. చూసేం…. చాలు ఇక శలవ్” అనేసి భార్యా బిడ్డతో పాటు బయటికొచ్చేసేరు.
1971…. ఇదే మద్రాసులో ఇంకో మర్చిపోలేని అనుభవం …………
త్యాగరాయ నగర్లో ఉన్న వాణీ మహల్లో చింతామణి టికెట్ నాటకం ఏర్పాటు చేసేరు.
ప్రచారం కూడా ఘనంగానే జరిగింది.
కొంగర జగ్గయ్యగారంటే చాలా అభిమానం అయిన శాస్త్రిగారు ఇన్విటేషన్ తీసుకుని సతీసమేతంగా వారింటికెళ్ళేరు.
హాల్లో కూర్చున్న ఈ దంపతుల దగ్గర కొచ్చిన జగ్గయ్యగార్ని చూడగానే లేచి నమస్కారం చేస్తూ తనని పరిచయం చేసుకున్న శాస్త్రి క్లుప్తంగా నాటకం విషయం చెపితే అనీజీగా విని అయిష్టంగా చూసిన జగ్గయ్య “నాటకాలంటే నాకంత ఇంట్రస్ట్ లేదండీ పైగా తీరిక కూడా లేదు. క్షమించాలి రాలేను” అంటా ముఖం మీదే చెప్పేసేరు.
చివుక్కు మంది శాస్త్రిగారి మనసు. ఆయన రానన్నందుకు కాదు. రంగస్థలం నించొచ్చినా యనిలా మాటాడినందుకు.
లోపలికెళ్ళిపోతా వెనక్కి తిరిగిన జగ్గయ్య “నాటకం ఎక్కడా అన్నారు?” అనడిగితే వాణీ మహలని చెప్పేరు శాస్త్రి.
“సరే ..నాకా వేళ అటెళ్ళే పనుంది. దారే కాబట్టి కాసేపు కూర్చుని వెళ్తాను” అనేసి లోపలికెళ్ళిపోయేరు.
చెప్పినట్టే ప్రోగ్రామ్ టైముకొచ్చిన జగ్గయ్య తనకి కేటాయించిన సీట్లో కూర్చున్నారు.
తెల్లని చీర, రవికతో విరబోసుకున్న కురులని సవరించుకుంటా ఒడిలోని వీణని మీటుతా వయ్యారంగా ఆ రంగస్థలం మీద సాక్షాత్కరించిన శాస్త్రిగారిని చూసిన జగ్గయ్య ఒక అద్భుతాన్ని చూసినంత ఇదయ్యేరు.
దేవాలయం సీన్‌తో మొదలైన నాటకం గంటల తరబడి నడుస్తానే వుంటే కాస్సేపుండి వెళ్తానన్న జగ్గయ్య మరి కదల్లేదు.
అభినయం రసాధిదేవత బుర్రా సుబ్రమణ్య శాస్త్రి కళాకౌశలానికి ముగ్ధుడైపోయిన ఆ కళావాచస్పతి ఆ నాటకం ఆద్యతం చూసేక ఆనందం పట్టలేక గ్రీన్ రూమ్లోకెళ్ళి శాస్త్రి గార్ని అమాంతంగా కౌగలించేసుకుని “నాటకం నించొచ్చిన వాడ్ని తల్లిలాంటి నాటకాన్ని తక్కువ చేసి మాటాడినందుకు సిగ్గు పడ్తున్నాను… మీరు సాక్షాత్ నటరాజ మూర్తి. మాలాంటి సాధారణ నటులకి సాధ్యం కాని నటనా కౌశలం మీది….” అంటా ప్రశంసలతో ముంచెత్తడమే గాకుండా ఇంటికి ఆహ్వానించి ఘనంగా సత్కరించేకా, చాలా ఖరీదైన వెండివీణ బహుమానంగా ఇచ్చేరు.
తన అభిమాన నటుడు ఇలా గొప్పగా మెచ్చుకోవడం తో పొంగి పోయిన శాస్త్రి ,తిరిగి వాళ్ళ తెనాలి వచ్చేరు.
ఆయన చేతిలో ఆ వెండి వీణ లేక పోవడంతో “ఎక్కడ అది?” అన్నారు భార్య జయలక్ష్మి.
“ఎక్కడా?….. అనుకుంటా?” గుర్తుచేసుకున్నశాస్త్రి…“ఆ జ్ఞాపికని రైల్లో మర్చి పోయినట్టున్నాను.జ్ఞాపకాన్ని మట్టుకు మనసులో దాచుకున్నాను”.అన్నారు.
బుర్రాగారి జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఒకటుంది.
మహాకళాకారుడిగా ప్రేక్షకుల నీరాజనాలందుకున్న శాస్త్రిగారి వైభవం మసకబారేకా అడపాదడపా మాత్రమే నాటకాలాడుతుండేవారు. లేకపోతే కొత్త ఆర్టిస్టుల్ని తయారు చేస్తా నాటకాలు డైరెక్ట్ చేస్తా ఉండేవారు.
ఆ టైములో శాస్త్రిగార్ని కల్సిన ఒక సీనియర్ నటుడు ఆయన్ని తన నాటకంలో బుక్ చెయ్యాలనుకున్నాడు తప్ప అడ్వాన్స్ ఇయ్యలేదు.
తాగుబోతైన ఆ నటుడి మాటల్లో ఎంత వరకూ నిజముందో అర్థంగాని శాస్త్రి ఆ నాటకానికి అటెండవ్వకపోడంతో అక్కడతని నాటకం ఆగిపోయింది. దాంతో శాస్త్రి గారి మీద పగబట్టేడా నటుడు.
తర్వాతొక రోజు నాటకం ఉండటంతో ఆ నటుడి ఊళ్ళో కొచ్చిన శాస్త్రిగార్ని అందరి ముందూ నిలదీసేడు. అనరాని మాటలన్నాడు. నీవల్ల బోల్డు నష్టపోయాను. అదంతా కడితే గానీ కదల్నివ్వను అంటా చెట్టుక్కట్టేసేడు.
అదంతా చూస్తున్న ఊరి జనం కల్పించుకోడంతో బయటపడ్డారు శాస్త్రి.
ఇది జరిగిన కొన్నాళ్ళకి అతనితో కలిసి నటించాల్సొస్తే ఏం జరగనట్టే వెళ్ళి నటించిన శాస్త్రిలో గొప్పదనం చూసి క్షమించమన్నాడా నటుడు.
నవ్వేసిన శాస్త్రి అతని భుజమ్మీద చెయ్యేసేరు.
జయకృష్ణ గారడుగుతుంటే సమాధానాలు చెపుతున్న శాస్త్రిగారు “అలా నన్నే చూస్తారేంటీ మీరేం మాటాడ్రా?” అన్నారు.
నవ్వేసిన నేను “చాలా చెప్తున్నారు గానీ మా వూళ్ళో జరిగిన ఒక ఇన్సిడెంటు గురించి చెప్పడం లేదు ”అన్నాను.
“ఏంటదీ?” అని శాస్త్రిగారడుగుతుంటే మధ్యలో కొచ్చిన జయకృష్ణగారు “గుర్తుంటే ఆ ఇన్సిడెంటేదో మీరు చెప్పండి” అన్నారు.
చెప్పడం మొదలెట్టేను నేను.
పసలపూడి చిన్న దేవీ సెంటర్లో ఎన్టీవోడి గులెబకావళి కథ సినిమా వేస్తున్నారని కుందేటి వెంకన్నతో ఊరంతా టముకు వేయించడంతో ఈ చింతావోరి పందిట్లో జనమంతా ఆ చిన్నదేవీ సెంటర్ పందిట్లోకెళ్ళిపోతున్నారు.
అదంతా చూస్తున్న కర్రికృష్ణారెడ్డి గారు అప్పారెడ్డిగారి దగ్గర కొచ్చి “ఎప్పుడూ లేంది ఇదేంటీ?” అనేటప్పటికి ఆయన భుజమ్మీద చెయ్యేసినా అప్పారెడ్డి“మనమేం ఇదవ్వక్కర్లేదు ఇయ్యాల మన పందిట్లో మన రాష్ట్రంలోనే మా గొప్పోడైన బుర్రా సుబ్రమణ్య శాస్త్రిగారి నాటకం చూస్తుండు జనాలెలాగొచ్చి పడతారో….. ఇదిగో కృష్ణా…. మనూరి జనమే గాదు పొరుగూళ్ళ నించి కూడా సవ్వారీబళ్ళ మీద దిగిపోతారు జనం ….చూస్తుండు” అంటా నవ్వేరు.
గోపాలస్వామి గుళ్ళోపలి శాస్త్రిగారి ట్రూపులో మేకప్పులవుతున్న నటీనటుల్లో చిన్న టెన్షన్ మొదలైంది. భవానీ శంకరం వేషమేసే మోహన్‌రావు డ్రామా టైము కొచ్చేస్తానని చెప్పేడు గానీ ఇంకా రాలేదు. ఇంకో పక్కనించి చూస్తుంటే టైమయిపోతుంది.
ఇప్పుడెలాగా అంటా తెగ ఆలోచిస్తున్న శాస్త్రిగారి దృష్టి డ్రసర్ కోటయ్య మీద పడింది.
చూడ్డానికి బానే వుండే కోటయ్య మేకప్ వేస్తే ఇంకా బాగుంటాడు. ఇంకాలోచించడం మానేసిన శాస్త్రి ఆ కోటయ్యని కూర్చోబెట్టి ప్యాన్‌కేక్ తో నామం పెట్టేసేరు.
అర్థంగాని కోటయ్య ఏంటంటే చెప్పేరు.
అదిరిపోయినా డ్రసర్ కోటయ్య “ఒక్క ముక్క డైలాగు రాదు నాకు. నేను భవానీ ఏంటండి బాబూ?” అంటా ఒణికి పోతుంటే అదేం పట్టించుకోని శాస్త్రి భవానీగా రెడీ చేసేసేరు కోటయ్యని.
“స్టేజ్ మీద నేనేం మాటాడాలీ?” అని ఒణికిపోతున్నా కోటయ్య అడుగుతుంటే “అంతే గదా మరీ…. ” అన్న డైలాగ్ మట్టుకి నేర్పేరు శాస్త్రి.
అదే ముక్క అనుకుంటా స్టేజ్ మీదకి ఎంటరయ్యేడు కోటయ్య.
భవానీ శంకరం డైలాగులు కూడా చింతామణి డైలాగులుగా మార్చేసి “ఈ రోజు చక్కగాపూర్తిగా ముస్తాబయినావు ఏమిటి కధ? అనేగా మీ చూపులోని అంతర్యం…..” అనగానే! “అంతే గదా మరీ….” అనేసేడు కోటయ్య.
“కొత్త బేరం తగిలింది లేండి?”
“అంతే గదా మరీ?”
చివరికా భవానీ, శంకరం పద్యాల్ని కూడా డైలాగులుగా మార్చేసేరు.
“తాతలనాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చిపోశాననేగా మీరంటున్నదీ? తల్లిదండ్రుల ఇల్లు దాయాదులకి విక్రయించి మిమ్మల్ని వస్తువులు ఎవరు చేయించమన్నారండీ?” అని శాస్త్రిగారే భవానీ పోర్షన్ కూడా చదివేస్తుంటే ఈ నాటకం తెల్సినోళ్ళంతా ముక్కు మీద వేలేసుకుని చూస్తున్నారు. కాళ్ళకూరి వారి చింతామణి వింతగా కనిపిస్తుందాళ్ళకి.
కొందరు ఈ ప్రక్రియని కాస్త ఎంజాయ్ చేస్తున్నా, మిగతా వాళ్ళకి మట్టుకి చెప్పలేనంత కోపం వచ్చేయడంతో ఆ జనం చిన్నదేవి పందిట్లో సినిమా కెళ్ళి పోతుంటే ,ఈ చింతావారి పెద్ద పందిరి ఖాళీ అయిపోతుంది.
“నాటకం ఆపండి” అంటా పెద్ద అరుపు.
స్టేజ్ మీదున్న శాస్త్రిగారితో పాటు నటీనటులంతా స్టన్నయి పోయేరు.
శాస్త్రిగారి దగ్గర కొచ్చేసిన చింతా అప్పారెడ్డి గారు “ప్రతీ ఏటా మా సొంత బంధువుల్లా మిమ్మల్ని పిల్చుకుంటున్నాం. అలాంటి మీరు చెయ్యాల్సిన పనేనా ఇది?” అన్నారు.
“కాళ్ళకూరి వారి చింతామణా ఇది?” అన్నారు చింతా కృష్ణగారు.
చాలా విసురుగా అక్కడి కొచ్చేసినా కర్రి కృష్ణారెడ్డి “వీడా భవానీ శంకరుడు….మేంగానీ పెనికేరు పిచ్చాస్పటల్నుంచొచ్చేమను కుంటున్నారా? చూడండి జనం అవతల పందిట్లోకెలాగెళ్ళిపోతన్నారో” అంటా అరిచేరు.
“చాల్చాలండి… స్టేజి ఖాళీ చేసెళ్ళండి. డబ్బులు దమ్మిడీ ఇవ్వం” అంటా హరిగారరుస్తుంటే హడిలిపోయేరాడ్రామా ట్రూపోళ్ళు.
అందర్నీ సముదాయిస్తా ఆ పందిరి పెద్దల మధ్యలో కొచ్చిన శాస్త్రిగారు. “మాది పొరపాటే మాలో ఒక కళాకారుడు రాకపోడం వల్ల ప్రదర్శన ఆగకుండా చేద్దామనే ప్రయత్నంలో ఇలా చేసేను తప్ప దైవసమానులైన ప్రేక్షక దేవుళ్ళని అవమానించాలని కాదు” అన్నారు.
“సరే ఇప్పుడే మంటారండీ?” అన్నారు అప్పారెడ్డి.
“తప్పుని సవరించుకునే అవకాశం నాకు కల్పించండి” అన్నారు.
“జనమంతా అవతల పందిట్లో కెళ్ళిపోయి కాళీ అయిపోయిన ఈ పందిట్లో ఇప్పుడేం సవరించు కుంటారు?” అన్నారు కర్రి కృష్ణ.
“నాకు చేతనైంది చేస్తాను. నచ్చితేనే మాకు డబ్బులివ్వండి.”
నవ్వేసిన కృష్ణగారు “నచ్చితేనే డబ్బులివ్వండి అంటున్నారు గదా ఎలాగా నచ్చదు మాకు.” అనేసి కూర్చున్నారు.
అదే చింతామణి వేషధారణతో చిడతలు పట్టుకుని హరికథ ప్రారంభించిన శాస్త్రిగారు, కాళ్ళకూరివారి నాటకాన్ని క్షణాల్లో హరి కథగా మార్చేసేరు. అన్ని పాత్రలూ ఆయనే అయిపోయేరు. శాస్త్రిగారే చింతామణి, శాస్త్రిగారే శ్రీహరి, శాస్త్రిగారే భవానీ శంకరుడు, శాస్త్రిగారే బిల్వమంగళుడు, శాస్త్రిగారే రాథ, శాస్త్రిగారే దామోదరుడు, శాస్త్రిగారే కృష్ణుడు.
యవనికపై మహాద్భుతం ఒకటి ఆవిష్క్రుతమైంది. ఆ చిన్నపందిట్లో కెళ్ళిపోయిన జనాలు పొలోమంటా తిరిగొచ్చేస్తుంటే నిమిషాల్లో పదిరెట్ల జనాల్తో నిండిపోయిందీ పెద్దపందిరి.
వేదిక మీద ఒక మహాకళాకారుడి విశ్వరూపం విచ్చలవిడికాంతులతో నిండిపోతుంటే మా జనమంతా బుర్రా సుబ్రమణ్య శాస్త్రిగారికి సాష్టాంగపడిపోయేరు.
***
హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘ఆంధ్రకేసరి’ నాటకం.
ప్రకాశం పంతులుగా చాట్ల శ్రీరాములు గారయితే, ఆయన తల్లి వేషం సుబ్రమణ్యశాస్త్రిగారు. మహానుభావులు నటిస్తున్న నాటకమవడం వల్ల జనాల్తో కిక్కిరిసి పోయుందా హాలు.
నాటకం మొదలైంది.
హాలంతా నిండిపోయినా జనం నిశ్శబ్దంలో లీనమై చూస్తున్నారు. పాత్రలు చేసేవాళ్ళంతా వాళ్ళ పాత్రల్లో లీనమైపోతున్నారు.
గత కాలంలో చేసిన వాటికంటే చాలా భిన్నమైన తొంభయ్యేళ్ళ విధవ పాత్రలో విలీనమై ,సంలీనమైపోతున్న శాస్త్రిగారు నటిస్తున్నట్టు లేదు ప్రవర్తిస్తున్నట్టుంది.
ఇంతలో….
ఊహించని పరిణామం స్టేజీ మీద….
కథరీత్యా పక్షవాతంతో పడిపోవాలి ఆ పంతులుగారి అమ్మగారు. నిజంగా పక్షవాతం వచ్చేసిందా శాస్త్రిగారికీ!!! అన్నంత అనుమానమొచ్చేలాగ ఎడమ చేతినీ ఎడమ కాలినీ తిప్పేసి, ముఖాన్ని మొత్తమొంకరా, కళ్ళు పరమ పెద్దవీ చేసేసి ఒకటే ఒణికిపోతున్నారు.
చూస్తున్న జనాల్లో ఒణుకు, ఆందోళన మొదలైంది. ఆయనకి నిజంగానే పక్షవాత మొచ్చేసిందని తెగ ఇదైపోతున్నారు.
అలా అవుతా మంచం మీద పడిపోడంతో బేలెన్స్ తప్పినా మంచం పల్టీ కొట్టింది.
దాంతో కింద పడిపోయేరు శాస్త్రి. ఇలాంటి పరిస్థితిలో ఇంకో నటుడైతే లేచి కుంటుకుంటా తెరవెనక్కి వెళ్ళిపోడమో, లైట్లార్పమంటా అరవడమో చేస్తారు.
ఇక్కడ రివర్సు. ఆ డబ్భైయ్యేళ్ళ శాస్త్రిగారలా చెయ్యలేదు. తగిలిన కముకు దెబ్బల్ని లెక్కచెయ్యలేదు. పాత్రని రక్తికట్టించడం కోసం ఆయన అవస్థలాయన పడ్తుంటే మతులోయినట్టు చూస్తున్నారు. జనాలు.
అద్భుతంగా రక్తికట్టినా క్లైమాక్స్ సీను పూర్తవడంతో తెరపడింది.
లేచిన జనం నాటకంతో పాటు తల్లిపాత్ర గురించి మాటాడుకుంటా బయటికొస్తుంటే కొందరు గ్రీన్‌రూమ్‌లో కెళ్తున్నారు.
అంతా వెళ్ళిపోయేకా రక్తమొస్తున్న ఒక దెబ్బకి టించరు ముంచిన దూది రాసుకుంటా నన్ను చూసేరు శాస్త్రిగారు.
ఈ ప్రదర్శన గురించిన మాటాడ్డం అయ్యేకా “నా ఆశలన్నీ సినిమాలో మీరిచ్చిన గమ్మత్తైన ఆ వేషం మీదుంది. ఆ వేషాన్ని చాలా అద్భుతం చేద్దాం. ఈ వయసులో కొత్త బుర్రాని చూపిద్దాం జనానికి. నా నట జీవితంలో ఈ చివరి దశ వేరు అనిపించేలా చేద్దాం. మళ్ళీ నా శుక్ర మహర్ధశ మొదలవుతుందనుకుంటున్నాను….” అంటా ఆవేశంగా మాట్లాడేస్తుంటే “లేదండీ ఆ సినిమా ఆగిపోయింది.ఇంకెప్పటికీ తియ్యరు దాన్ని” అన్న మాట ఎలా చెప్పాలా అని అవస్థ పడ్తున్నాన్నేను.
***
Share this Article