Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏపీ అంటేనే డర్టీ పాలిటిక్స్…! ఏపీ కమలం కూడా మినహాయింపు కాదు…!!

October 11, 2024 by M S R

.

(మార్తి సుబ్రహ్మణ్యం) బీజేపీ అంటే సిద్ధాంతాల మడి కట్టుకునే పార్టీ అని చాలామంది నమ్మకం. భారతీయులంతా సోదరులు, సోదరీమణులనే టైపులో కనిపిస్తుంటారు. పెద్ద పెద్ద బొట్లు, చేతులకు రక్షలు, మెడలో రుద్రాక్షలు, ఒంటిపై కాషాయం కండువాతో కనిపించే ‘కమలం’లో ‘కామశాస్త్రజ్ఞుల’ సంఖ్య పెరగడం, ఆ పార్టీ సంప్రదాయవాదులను కలవరపరుస్తోంది.

ఎన్నికల ముందు ఒంగోలులో మహిళా మోర్చా నేత ఒకరు.. తనను జిల్లా పార్టీ నేత, రాష్ట్ర పార్టీ అగ్రనేత వద్దకు పంపించారని, పిల్లల ఆకలి తీర్చేందుకు తాను తప్పు చేయక తప్పలేదంటూ.. ఆ బాధితురాలు పంపిన వీడియో నాయకత్వానికి చేరింది. బట్ నో యూజ్. పైగా సదరు బాధితురాలితో సుఖించిన అప్పటి రాష్ట్ర నాయకుడికి, జాతీయ నాయకుడి హోదా ఇచ్చేసింది.

Ads

ఇంతకూ ఆ బాధితురాలిని, రాష్ట్ర నేతాశ్రీ వద్దకు ‘శ్రమదానం’ కోసం పంపిన ఆ జిల్లా నేత.. పాపం ఆ మహిళా నేతకు చేస్తానన్న సాయం చేయలేదట. అప్పట్లో ఇది పార్టీలో కలవరం సృష్టించింది. ఆ వీడియోనే నాటి రాష్ట్ర నేతకు ఎంపీ సీటు రాకుండా చేసింది. అదే వీడియో అప్పట్లో ఆయన ప్రత్యర్ధికి ఆయుధమయింది.

తాజాగా గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు వనమా నరేంద్ర, మాజీ జిల్లా అధ్యక్షుడు, మీడియా ప్యానెల్ ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ తమ పదవులు కోల్పోయేందుకు, కారణమైన హానీట్రాప్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎపిసోడ్‌లో గతంలో మాజీమంత్రి అంబటి రాంబాబుతో ఫోన్‌లో మాట్లాడి, సోషల్‌ మీడియా ద్వారా ఆయన కొంపముంచిన సుకన్య అనే మహిళనే.. ఈ లేటెస్ట్ ‘కమల శృంగారనైషధం’లోనూ కేంద్రబిందువు కావడం విశేషం.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్నికల ముందు వరకూ వైసీపీలో కొనసాగిన సుకన్య అనే కార్యకర్త, ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆమె ఎవరి సమక్షంలో చేరారు? ఎవరు చేర్చారన్నది జిల్లా నేతలకు సమాచారం లేదు. ఆ తర్వాత బీజేపీలో చురుకుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, అప్పటి అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆమెతో సన్నిహితంగా ఉండేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు నాయకులకు, పాటిబండ్ల- వనమాకు పొసగేది కాదు. ఆ ఇద్దరు నాయకుల తీరుపై అప్పట్లో పాటింబడ్ల వర్గం రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో, ఒక నేతను పదవుల నుంచి నాయకత్వం తప్పించింది. దానితో ఆయన తన మిత్రుడైన ఓ జిల్లా నేతతో కలసి, పాటిబండ్ల- వనమాను హానీట్రాప్ చేయించారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

అందుకే ముందు సుకన్యతో.. వనమా మాట్లాడిన వీడియో లీక్ చే సిన ఆయన ప్రత్యర్ధి వర్గం, తాజాగా పాటిబండ్ల నగ్న వీడియో కూడా వ్యూహాత్మకంగా లీక్ చేయడం కలవరం సృష్టించింది. ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ కాగా, నాయకత్వం దిద్దుబాటుకు దిగక తప్పలేదు. వారిద్దరినీ పార్టీ పదవులకు రాజీనామా చేయమని ఆదేశించింది. దానితో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. వారిద్దరితో వీడియోలో మాట్లాడిన సుకన్యను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

కాగా మార్ఫింగ్- ఏఐ టెక్నాలజీ వాడి తనను అప్రతిష్ఠపాలు చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని పాటిబండ్ల చెప్పారు. ఆ వీడియో తనది కాదన్నారు. పాటిబండ్ల వీడియోలో అవతలి మహిళ ఎవరన్నది కనిపించలేదు. అయితే బయటకొచ్చిన వనమా వీడియోలో అసభ్యకరమైన దృశ్యాలేవీ లేవు. ‘ఇద్దరం కలసి మందుకొడదాం’ అన్న మాటలే వినిపించాయి. అంటే దీన్నిబట్టి.. రికార్డు చేసిన పూర్తి వీడియో కాకుండా, ఎడిట్ చే సిన ఒక పార్టు మాత్రమే లీక్ చేశారని స్పష్టమవుతోంది.

అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా, మాజీ అధ్యక్షుడు పాటిబండ్లతో మాట్లాడిన సుకన్య వీడియో.. బయటకు ఎలా లీకయిందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదంతా రహస్య వ్యవహారం కాబట్టి, సహజంగా అలాంటి వీడియోను వారిద్దరూ రికార్డు చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ సరదాకు, మధుర జ్ఞాపకాల కోసం రికార్డు చేసుకున్నా దానిని ఎవరికీ పంపించరు. మరి ఆ వీడియో ఎలా లీకయింది?

అంటే వనమా- పాటిబండ్లతో వైరం ఉన్న ఆ ఇద్దరే, సుకన్య ద్వారా వారిని హానీట్రాప్ చేయించారా? ఆ ఇద్దరే పాటిబండ్ల- వనమా వీడియోలు లీక్ చేశారా? వనమా స్థానంలో తన మనిషిని జిల్లా అధ్యక్షుడిని చేయాలన్న వ్యూహంతోనే హానీట్రాప్ చేయించారా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇదీ.. గుంటూరు జిల్లాలో ‘కమల శృంగార’ కహానీ!

ఇప్పుడు వారిద్దరినీ పార్టీ పదవుల నుంచి తప్పించారు. బాగానే ఉంది. మరి ఎన్నికల ముందు ఒంగోలులో జరిగిన ఇలాంటి శృంగార ఘట్టంలో అడ్డంగా దొరికిపోయిన.. పాత్రధారి- సూత్రధారితో, ఎందుకు రాజీనామా చేయించలేదన్న చర్చకు తెరలేచింది. ఎన్నికల ముందు ఒంగోలు జిల్లాకు చెందిన ఓ అగ్రనేత.. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కీలక నేత వద్దకు, మహిళా మోర్చాకు చెందిన మహిళను ‘శ్రమదానం’ కోసం పంపించారు.

ఆర్థిక సమస్యల్లో ఉన్న ఆ నాయకురాలిని ఆదుకుంటానని హామీ ఇచ్చిన ఆ జిల్లా అగ్రనేత, తన జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కీలక నేత బస చేసిన హోటల్‌కు పంపించారుట… అయితే సదరు జిల్లా నేత, తనకు చేస్తానన్న ఆర్ధిక సాయం ఎంతకూ చేయకపోవడంతో.. ఆ మహిళా కార్యకర్త ఆవేదనతో ఒక వీడియో విడుదల చేసింది. ‘ ఆ జిల్లా నాయకుడు పదవి కోసం తనను రాష్ట్ర కీలక నేత వద్దకు పంపించాడ’ని, ఆయన పేరు కూడా వెల్లడించింది.

అలా రాష్ట్ర నేతల వద్దకు మహిళలను పంపించడం ఆ జిల్లా నేతకు అలవాటేనని, అయితే మహిళల అవసరాన్ని వాడుకునే ఆ జిల్లా నేత చేసిన అన్యాయాన్ని గుర్తించి, తనకు న్యాయం చేయమని నేరుగా రాష్ట్ర నాయకత్వానికే ఆ వీడియో పంపింది. ఇది బీజేపీ రాష్ట్ర నేతలు, ఒంగోలు జిల్లా నేతలకు తెలిసిన వ్యవహారమే. వాటికి సంబంధించిన ఆడియో- వీడియో అందరి ఫోన్లకూ చేరాయి.

తర్వాత ఎన్నికల ముందు విజయవాడలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షుల సమావేశానికి హాజరైన జాతీయ నేతల దృష్టికి, ఆ వ్యవహారం వెళ్లడంతో ఆ వీడియోపై చర్చ జరిగింది. దానిపై నివేదిక ఇవ్వాలని జాతీయ నేతలు ఆదేశించారు. అయితే ఇప్పటికీ దానిపై జాతీయ పార్టీకి నివేదిక పంపిన దాఖలాలు లేవు. విచిత్రంగా.. తర్వాత ఆ రాష్ట్ర నేతకు జాతీయ నాయకుడిగా ప్రమోషన్ రాగా.. ఆయనకు మహిళా నేతతో ‘శ్రమదానం’ చేయించిన ఒంగోలు నేతకూ, జిల్లా స్థాయి ప్రమోషన్ లభించడం విశేషం. అయితే ఆ వీడియోనే సదరు రాష్ట్ర నేతకు, ఆయన కలలుకన్న ఎంపీ టికెట్ రాకుండా కొంపముంచిందన్న ప్రచారం లేకపోలేదు. ఆ వీడియోను ‘పైకి’ పంపించిన ఓ రాష్ట్ర కీలక నేత లక్ష్యం కూడా నెరవేరింది.

తాజా గుంటూరు జిల్లా అగ్రనేతలతో రాజీనామా చేయించిన నేపథ్యంలో, ఈ పాత కథ కొత్తగా చర్చల్లోకి వచ్చింది. ఆ జాతీయ నాయకుడితో రాజీనామా చేయించని రాష్ట్ర నాయకత్వం.. జిల్లా నేతలతో మాత్రం ఎలా రాజీనామాకు ఆదేశిస్తుందన్న లా పాయింట్‌పై చర్చ జరుగుతోంది.

కాగా తాడేపల్లిగూడెంలో వెలుగు చూసిన.. పార్టీకి పెద్ద దిక్కులాంటి ఓ సీనియర్ నేత ‘శృంగారనైషధం’ కూడా, అప్పట్లో చర్చనీయాంశమయిన విషయం తెలిసిందే. దేశం కోసం- పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నామని ‘ప్రచారం చేసుకునే, ఇలాంటి ‘ప్రముఖు’ల చీకటి ర హస్యాలు.. ఇలాంటి సందర్భాల్లో వెలుగులోకి వస్తుండటం, పార్టీ సంప్రదాయవాదులకు వేదన కలిగిస్తోంది.

గతంలో రాష్ట్ర పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఒక సీనియర్ నేతపై కూడా.. ఇలాంటి ‘మానవ బలహీనతలకు సంబంధించిన ఆరోపణలు’ రావడంతో, ఆయనను ఉత్తరాదికి బదిలీ చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఒక వెలుగువెలిగిన ఓ తెలుగుతేజం.. ఇలాంటి ‘మానవ బలహీనత’లకు సంబంధించిన ఆరోపణలు- ఫిర్యాదులతోనే సుదీర్ఘకాలం తెరమరుగై.. మళ్లీ ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో, తెరపైకి రావడాన్ని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

ఇప్పుడు రాష్ట్ర కమిటీలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు ‘మహిళా నేత’ అన్న పేరుంది. అమలాపురం, కాకినాడ ప్రాంతాల్లో ఆయనపై చాలామంది మహిళలు ఫిర్యాదు చేయడం, అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు వాటిని సెటిల్‌మెంట్ చేసిన వైనాన్ని గోదావరి జిల్లా బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక చాలాకాలం క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ నేత వివాహితను తీసుకువెళ్లారంటూ.. స్వయంగా ఆమె భర్త, ఢిల్లీ పార్టీ ఆఫీసు ఎదుటే ధర్నా చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె కనిపించకపోవడం విశేషం.

సిద్ధాంతాల పునాదులు, సంస్కృతీ సంప్రదాయాల ఇటుకలపై నిర్మించిన బీజేపీలో.. ఇలాంటి అనైతిక చర్యలు పెరిగిపోవడానికి కారణమేమిటన్న దానిపై, జాతీయ నాయకత్వం ఇప్పటిదాకా దృష్టి సారించకపోవడమే విచిత్రం. ఫలితంగా మిగిలిన పార్టీలకూ-బీజేపీకి తేడా లేదన్న భావన.. ప్రజల్లో స్ధిరపడేందుకు కారణమవుతోందన్న ఆవేదన, పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది…..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions