మీ ఇంటికే సరుకులు… మీ ఇంటికే కూరగాయలు… అని ప్రచారం సాగుతుంటే ఏమిటీ అర్థం..? హోం డెలివరీ చేస్తారు అనే కదా…! కానీ సినిమా వాళ్ల ప్రచారానికి అర్ధాలు వేరుంటాయి… అసలు కొన్నిసార్లు అర్థాలే ఉండవు… ఆ పైత్యానికి మనమే ఏదో ఒక అర్ధాన్ని ఊహించుకుని.., మన దిక్కుమాలిన మెయిన్ స్ట్రీమ్ ‘కవర్లు’ తీసుకుని రాసిన వార్త కదా అని గౌరవించి… మనలోమనమే నవ్వుకుని, వాళ్లను క్షమించేయాలన్నమాట… ఈ వార్త ఓసారి చదవండి…
వీళ్లెవరో మనకు పెద్దగా అవుడియా లేదు… కానీ ఇంటి వద్దకే సినిమా అంటున్నారు కదా… ఎలాగూ థియేటర్లకు ఎవడూ పోవడం లేదు… మూతపడే పరిస్థితి… అందుకని చిన్న చిన్న వ్యాన్లనే మొబైల్ థియేటర్లుగా మార్చేసి… కాలనీల్లో, ఊళ్లల్లో తిప్పుతూ… సినిమా థియేటర్‌నే మన ముందుకు తీసుకువస్తున్నారేమో… కాస్త ఇంట్రస్టింగుగానే ఉంది కదాని చదివితే… ప్యూర్ వేస్ట్ వార్త… ఇది నిజానికి వాణిజ్య ప్రకటనగా వేయాల్సింది… సరే, సినిమా కవరేజీలో ప్రకటనలకూ, వార్తలకూ తేడా ఉండదు కదా…
Ads
ఒక నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలట, ఇవ్వగానే యాప్ లింక్ పంపిస్తారట, ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని, డబ్బు కట్టి సినిమా చూడాలట… అదీ ఒకరోజు మాత్రమేనట, తరువాత రోజు సదరు సినిమా మళ్లీ కనిపించదట… హబ్బ, చూశారా, మేమెంతటి టెక్నాలజీని తీసుకొచ్చామో అన్నట్టుగా ఉంది బిల్డప్పు, హైపు…
రాసినవాడి దయ, పాఠకుడి ప్రాప్తం… ఇలాంటి ప్రమోటర్ల భ్రమ, మన ఖర్మ అన్నట్టుగా ఉంది… ఫోన్లో సినిమా చూసే జ్ఞానం ఉన్న ప్రేక్షకుడికి, ఏ యాప్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకోవాలో తెలియదా..? జనం ఓటీటీలు చూడటం లేదా..? అసలు ఏటీటీ కూడా కొత్తదేమీ కాదు… ఎనీటైమ్ థియేటర్ అంటూ శ్రేయాస్ వాళ్లు చాలారోజులుగా ఒక ఏటీటీ రన్ చేస్తున్నారు కదా… అంతెందుకు..? వర్మ అయితే పే పర్ వ్యూ అంటూ తన సినిమాలన్నీ అలాగే జనం మీదకు వదులుతున్నాడు కదా…
అసలు ఫస్ట్ వీళ్లు రిలీజ్ చేసేదే ఓ డర్టీ సినిమా… అదేలెండి… డర్టీ హరి అనబడే ఓ బూతు చిత్రరాజం.., దానికి అప్పుడే ఎవరైనా కాపీకొట్టినచో, ప్రసారం చేసినచో చర్యలు తీసుకోబడును అంటూ హెచ్చరిక… ఈ బూతు సినిమాకు అంత సీన్ ఉందా..? పైగా ఈ సినిమా టికెట్లు సెలూన్లు, కిరాణ కొట్లు గట్రా… చివరకు మిల్క్ బూతులు సహా ఎక్కడపడితే అక్కడ దొరుకుతాయట… అబ్బచా… ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకునే ప్రేక్షకుడికి పేటీఎం, ఫోన్‌పే వంటి పేమెంట్ మెథడ్స్ తెలియవా..?
మరీ నవ్వొచ్చేది ఏమిటంటే… మాది వినేది కాదు, చూసే ఎఫ్ఎం అట… ఫోఫోవోయ్… అసలు నువ్వు పదే పదే ఎఫ్ఎం అనే మాట వాడటమే తప్పు, తప్పున్నర… ఏటీటీల్లో సినిమా చూసే ప్రేక్షకులు ఇలాంటి పిచ్చి డవిలాగులను చదివీ చదివీ, చూసీ చూసీ ముదిరిపోయారు… నవ్వుకుంటారు…!!
Share this Article