కులగజ్జి రాజకీయాలే కాదు… ఏపీ రాజకీయాలు ఎంత భ్రష్టుపట్టిపోయాయంటే… చివరకు ఓ పద్నాలుగేళ్ల బాలిక లైంగిక వేధింపులకు బలైపోతే, ఆ పిల్ల శవం మీద పేలాలు ఏరుకుంటున్నారు నేతలు, పార్టీలు, పత్రికలు, టీవీలు ప్లస్ సోషల్ మీడియా… సమాజం కుళ్లి కంపు కొడుతోంది…!! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ విజయవాడ అమ్మాయి మరణానికి కారకుడు వినోద్ జైన్ అనే యాభయ్యేళ్ల వ్యక్తి… ప్రస్తుతం ఏవగింపు పుట్టిస్తున్న పార్టీల ధోరణి చూస్తుంటే, ఆ అమ్మాయి మరణాన్ని పొలిటికల్‌గా ట్విస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించే ప్రతి జర్నలిస్టు, ప్రతి లీడర్, ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్టు కూడా వినోద్ జైన్‌కు ఏమీ తక్కువ కాదు…
ఒక్కడు కూడా ఆ అమ్మాయి కోణంలో మాట్లాడడు… నాలుగు పేజీల సూసైడ్ లెటర్ రాసి, అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నదీ అంటే ఆమె ఎంత వేదనను అనుభవిస్తోందో అర్థం చేసుకోవాలి… వాడు సొసైటీలో పెద్దమనిషిగా చెలామణీ అవుతుంటాడు, ఆ పిల్లతో అసభ్యంగా బిహేవ్ చేస్తుంటాడు… ఎవరికి చెప్పుకోవాలో తెలియదు… చెప్పుకున్నా ఈ వ్యవస్థలేవీ ఆమె రక్షణకు రావు… అదీ ఆమె పేరు బయటపడకుండా, మళ్లీ ఆ జైనుడు ఆమె జోలికే కాదు, ఇంకెవరికీ జోలికీ వెళ్లకుండా చేసే ఓ యంత్రాంగం కావాలి… అది లేదు, నిజానికి అదే కదా ఆలోచించాల్సింది…
దిశ చట్టమైతేనేం… దశ చట్టమైతేనేం… అత్యాచారం జరిగాక, ఆత్మహత్యలో, హత్యలో జరిగాక చట్టం వచ్చి కాపాడుతుందా..?
హైదరాబాద్ షి-టీమ్స్‌లా, ఇంకా అంతకుమించి… నేరం జరగకముందే, పకడ్బందీగా నేరస్థుల పనిపట్టే వ్యవస్థ, సమాజం నుంచి ఆ భరోసా ఆడపిల్లలకు, మహిళలకు అవసరం… ఇప్పుడు ఈ అమ్మాయి ఆత్మహత్య విషయానికి వస్తే… ఆ వయస్సులో ఆడపిల్లలకు భయం ఉంటుంది… సున్నితత్వం, అల్లరి అవుతామనే భయం… సరే, వాడు వేధించాడు, ఈమె సూసైడ్ చేసుకుంది, క్లియర్‌గా మరణవాంగ్మూలం కూడా రాసింది… ఐనా సరే…
Ads
ఏం జరిగింది..? వాడు టీడీపీ వాడు అంటూ వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందడానికి, టీడీపీని బదనాం చేయటానికే అధికంగా ప్రయత్నించింది… గతంలో చంద్రబాబు వాడి కోసం ప్రచారం చేసిన ఫోటోలు, కేశినేనితో దిగిన ఫోటోల్ని విస్తృతంగా టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చింది… వెంటనే టీడీపీ ఎందుకు ఉలిక్కిపడాలి..? నో, నో, మావాడు కాదు, మంత్రి వెల్లంపల్లికే అనుచరుడు, నిజానికి ఫస్ట్ బీజేపీలో ఉండేవాడు, జస్ట్, మధ్యలో టీడీపీలోకి వచ్చిపోయాడు అంటూ ఆ కంపు బురదను ప్రతి పార్టీకి పూసే ప్రయత్నం చేసింది టీడీపీ… సిగ్గుమాలిన పని…
సో, వాట్… వాడెవడో నేరస్థుడు అయితే పార్టీ బాధ్యత వహించదు కదా… పార్టీలో లక్షల మంది కార్యకర్తలు ఉంటారు, ఎవడో ఏదో చేస్తే పార్టీ ఎందుకు ఉలిక్కిపడాలి..? వాడు నేరస్థుడే అయితే చట్టప్రకారం చర్యలు తీసుకొండి అని ఎందుకు తలెత్తి డిమాండ్ చేయలేకపోయింది… అమ్మాయిలని వేధించినవాడు మా పార్టీ అయితేనేం, మీ పార్టీ అయితేనేం, మీరెంత సీరియస్ చర్యలు తీసుకున్నా మేం సపోర్ట్ చేస్తాం అని ఎందుకు చెప్పలేకపోయింది..? వైసీపీకి అదే రోగం, టీడీపీకి అదే రోగం… ఒకడిమీద ఒకడు బురద జల్లుకుని ఇష్యూను రాజకీయం చేసి, పెంట పెంట చేసేశారు…
ఇక్కడ టీడీపీకి కొన్ని ప్రశ్నలు… మీరు ప్రచారం చేస్తున్నట్టు ఆ జైనుడు వెల్లంపల్లికి అనుచరుడే అనుకుందాం, టీడీపీ కాదు అనుకుందాం… మరి మీరెందుకు ఉలిక్కిపడ్డారు… పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసినట్టు..? మీ పార్టీ వాడే కాదన్నట్టుగా ప్రచారం చేశారు కదా, మీరు సస్పెండ్ చేశారు అంటేనే మీ పార్టీవాడు అని అంగీకరించినట్టే కదా… పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పాపపరిహారమా..? ఉపశమనమా..? అదేమైనా శిక్షా..?
ఈ శవరాజకీయంలో మీడియా మరింత దుర్మార్గమైన పాత్ర… సిగ్గూశరం ఏమీ లేదు… తమ అభిమాన పార్టీలకు దాస్యం చేయడం, సాయం చేయడం… వాడు తెలుగుదేశం వాడు కదా… సాక్షి రెచ్చిపోయింది… పేజీల కొద్దీ నింపిపారేసింది… ఫస్ట్ పేజీ బ్యానర్… చంద్రబాబుతో, టీడీపీతో వాడి సాన్నిహిత్యం ఫోటోల్ని కుమ్మేసింది… ఈనాడుకు ఇటు ఉండే దమ్ములేదు, అటు నిలిచే ధైర్యం లేదు… నప్పతట్ల ధోరణి… కనీసం అమ్మాయి వైపు నిలబడి, జరిగిన దుర్మార్గాన్ని భిన్న కోణాల్లో ప్రజెంట్ చేయాలనే సోయి కూడా చచ్చిపోయింది… అపార్ట్‌మెంట్ పెద్దమనిషి నీచబుద్ధి అంటూ మూడో పేజీలో మమ అనిపించేసింది… అందులోనూ అధికశాతం రాజకీయ కంపే… నిజానికి సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజూ లక్ష నీతులు చెప్పే ఆంధ్రజ్యోతి…
పత్రిక అని చెప్పుకోవడానికి కూడా దానికి అర్హత లేనట్టుగా… రాష్ట్రమంతా ఇంత ప్రచారం సాగుతుంటే, ఆ వార్తను విజయవాడ జిల్లా పేజీల్లో వేసింది… అది కూడా ‘శవరాజకీయం’ అంటూ వినోద్ జైన్‌కూ టీడీపీకి లంకెపెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది, అది నిజం కాదు అన్నట్టుగా, భుజాలు తడుముకుంటూ… టీడీపీకన్నా ఎక్కువ బాధపడిపోయింది… ఎందుకు ఈ ఉలిక్కిపాట్లు..?
జరిగిన దుర్మార్గం ముఖ్యమా..? లేక వాడికీ టీడీపీకి సంబంధం లేదంటూ పారిపోవడమా..? తప్పు చేసినవాడు ఏ పార్టీ వాడయితేనేం..? అసలు తప్పు ఏమిటో, వాడెవడో, వాడి గతేమిటో, సిస్టం ఫెయిల్యూర్ ఎక్కడో రాసి ఏడవొచ్చు కదా… టీవీల దరిద్రం కూడా ఇలాగే పొలిటికల్ పోలరజైషనే… వాటి పాత్రికేయం మరీ నీచస్థాయి… అమ్మా, తల్లీ… క్షమించు, మన చుట్టూ బోలెడుమంది వినోద్ జైనులు..!! (వాడు వీడు అని సంబోధించడం మామూలుగానైతే తప్పే, కానీ వీడికి పాత్రికేయ మర్యాద అక్కర్లేదు..)
Share this Article