‘‘ఫ్యామిలీ టైప్ సార్’’ ‘‘కాలేజీ గర్ల్ సార్’’………… విటులను ఆకర్షించే ప్రయాసలో కామన్‌గా వినిపించే పదాలు ఇవి… తప్పుగా అనుకోకండి ఎం.ఎస్.రాజు భయ్యా… నువ్వు నీ తాజా అద్భుత చిత్రం ‘డర్టీ హరి’ గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలలో ‘‘ఫ్యామిలీ చిత్రం’’ ‘‘పాన్ ఇండియా చిత్రం’’ అని చెబుతుంటే అదే గుర్తొస్తోంది… అసలు సినిమా పేరులోనే ఆ డర్టీనెస్ ఉంది… ఆ డర్టీ వాసన ట్రెయిలర్లలోనూ గుప్పుగుప్పుమంటోంది… ప్రచారం నిండా అదే డర్టీనెస్… సరే, నీ టేస్టు నీ ఇష్టం… చూసేవాడు చూస్తాడు… బూతును ప్రజెంట్ చేయడంలో నువ్వు మొదటివాడివీ కాదు, చివరి వాడివీ కాదు… మసాలా కంటెంటు వీడియోలతో డబ్బుచేసుకునే ఓ యూట్యూబర్ స్థాయికి నువ్వు పడిపోయిన తీరు పట్ల జాలేస్తోంది…
అసలు నీకన్నా నమస్తే తెలంగాణను చూస్తే మరింత జాలేసింది… కాస్త వెగటుగా కూడా ఉంది… తెలంగాణ సాంస్కృతి, సామాజిక స్థితిగతులకు అద్దంలా మెరవాల్సిన జిందగీ అనే పేజీలో నీ డర్టీ హరి ఇంటర్వ్యూను అంత పెద్దగా వేసిన ఆ పత్రిక యాజమాన్యం పట్ల ఒకింత సానుభూతి కూడా కలిగింది… ఎస్, సినిమా పేజీలంటేనే సినిమాలకు ప్రమోషన్… తెలుగు సినిమా పేజీలు సినిమారంగంలో వస్తున్న ట్రెండ్స్ విశ్లేషించేంత పరిణతితో ఏమీ లేవు… ఉండవు… అంతా కవర్ బరువును బట్టి కవరేజీ బాపతే… కానీ మరీ ఒక డర్టీ టేస్టున్న సినిమా గురించి సినిమా పేజీలను దాటేసి, సాధారణ పేజీల్లో… అదీ గౌరమ్మ అని పేరు పెట్టుకున్న ఫ్యామిలీ పేజీల్లో… అంత పరిచేయడం… రియల్లీ పిటీ…
రాజు గారూ… ఒక హత్య చేసేవాడికీ, ఒక తప్పు చేసేవాడికీ తనదంటూ ఓ సమర్థన ఉంటుంది… సమాజం ఒప్పుకుంటుందా లేదానేది వేరే సంగతి… కానీ ఓ డర్టీ సినిమాను సమర్థించుకోవడానికి… ‘‘బూతుకూ శృంగారానికీ తేడా ఉంది… మాది బూతు కాదు…’’ అనే నీతిశతకాలు దేనికి..? ఆర్జీవీ కూడా ఇలాంటి డర్టీ సినిమాలే తీస్తుంటాడు… కానీ నీతులు చెప్పడు… పైగా ‘‘మా ఫ్యామిలీకి ఈ కథ చెప్పాను, మా నిర్మాత ఒప్పుకున్నాడు, ఏటీటీ ఓనర్స్ సరేనన్నారు…’’ వంటి మాటలు చెబుతున్నావంటేనే… నీలో ఏదో దోషభావన, దిగజారిన తీరుకు ఏదో సమర్థన చెప్పుకోవాలనే తపన కనిపించడం లేదా చెప్పు..?
Ads
ఏమంటివి..? ఏమంటివి..? ఇది పాన్ ఇండియా సినిమాయా..? ఔను మరి… బూతుకు భాషాభేదం ఏముంటుంది..? పాన్ గ్లోబల్ అని చెప్పాల్సింది… మాంచి మసాలా సీన్లు దట్టించి, కాస్త క్రైం ఫ్లేవర్ తగిలిస్తే సరి… ఈ చిల్లర టెక్నిక్ బోలెడుమంది ఫాలో అవుతున్నారు… వాళ్లకూ నీకూ తేడా ఏముంది రాజా..? ఒకప్పుడు మస్త్ పాపులర్ సినిమాలు తీసిన నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది..?
ఎట్టెట్టా… ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ మొదట సందేహించి, తరువాత కళ్లు తెరుచుకుని, ఈ సినిమా గొప్పదనం గ్రహించి, ఈ సినిమా విడుదలను తమ అదృష్టంగా స్వీకరించిందా..? అంటేనే అర్థమైపోతోంది కదా సదరు ఏటీటీ ఏ బాటలో పోదలుచుకున్నదో… నిజంగా అంత సీన్ ఉంటే బొచ్చెడు కంటెంట్ నింపడానికి నానా తిప్పలూ పడుతున్న ఆహా అనబడే అల్లువారి ఓటీటీ ఎందుకు ఈ సినిమాను వద్దనుకుంది..? అన్నట్టు… బోల్డ్నెస్ వేరు, డర్టీనెస్ వేరు…
నువ్వు చెప్పేది నిజమే గానీ… ఇండస్ట్రీలో అడ్డమైన సీన్లకు సై అనే హీరోయిన్లు, హీరోలు, దర్శకులు, నిర్మాతలు తరచూ చెప్పే డైలాగు ఉంది కదా… ’’కథ డిమాండ్ చేసింది‘‘ అని… అదో పిచ్చి జస్టిఫికేషన్… వ్యభిచార కంపెనీల కథ తీసుకుంటే… కథ డిమాండ్ చేసింది కదాని మొత్తం చూపించేస్తావా..? ఈ ప్రశ్నకు జవాబు చెబితే చాలు… డర్టీ హరి గురించి నువ్వు చెప్పే నీతిశతకం మొత్తం చదువుతాం… సరేనా..?
Share this Article