అసలే విద్యాబాలన్… అప్పట్లో డర్టీపిక్చర్ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులను ఊపేసింది… లావెక్కినా సరే, ఆమె అంటే చాలామందికి ఈరోజుకూ లవ్వే… ఇక తరువాత చదవండి… మధ్యప్రదేశ్… అక్కడ ఓ ఆటవిక మంత్రి… సారీ, అటవీ మంత్రి ఉన్నాడు… పేరు విజయ్ షా… అసలే మంత్రి… ఆ హోదాతోనే కొన్ని అవలక్షణాలు అకస్మాత్తుగా సంతరించుకుంటాయి కదా… పైగా అటవీ మంత్రి… అహం దెబ్బతిన్నది… ఎందుకు..? ఈ కథేమిటి..?
విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించే కొత్త సినిమా పేరు షేర్ని… అంటే తెలుగులో సివంగి అని అర్థం… మరి సివంగి సినిమా అడవుల్లోనే కదా తీయాలి… (పూర్వకాలంలో శతృఘ్న్ సిన్హా, శ్రీదేవి నటించిన సినిమా పేరు కూడా షేర్ని)… సరే, కరోనాకు ముందు అప్పట్లో కొంత సినిమా తీశారు… కరోనా వచ్చిపడటంతో షూటింగు ఆగిపోయింది… మళ్లీ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ సినిమా షూటింగులకు పర్మిషన్లు ఇస్తున్నారు కదా… అలాగే మధ్యప్రదేశ్ కూడా షూటింగులకు వోకే అనేసింది…
Ads
బతికిపోయాం దేవుడా అనుకున్న ఈ సినిమా యూనిట్ మధ్యప్రదేశ్, బాలాఘాట్ అడవుల్లో షూటింగు స్టార్ట్ చేసింది… కొద్దిరోజులుగా ఆ పరిసరాల్లోనే అడ్డా వేసి, నానా తిప్పలూ పడుతూ షూటింగు చేసుకుంటోంది… అడవుల్లోకి వెళ్లి షూటింగు చేసుకోవటానికి అనుమతి కూడా తీసుకున్నారు…
ఇలా అన్ని జాగ్రత్తలతోనే షూటింగు చేసుకుంటున్నారు పాపం… మన మంత్రి గారికి విషయం తెలిసింది… విద్యాబాలన్ అంటే కాస్త లవ్వు ఉన్నట్టుంది… బాలాఘాట్ వెళ్లాడు… డిన్నర్‌కు పిలిచాడు… సరదాగానో పిలిచాడో, సరసానికే పిలిచాడో… ఆమె విద్యాబాలన్ కదా, ఫోఫోవోయ్, నువ్వు అటవీ మంత్రివి అయితే నాకేంటి..? ఈ అడవులకు రాజువయితే నాకేంటి..? అనుకుని బ్లంటుగా రెఫ్యూజ్ చేసిపారేసింది… శెభాష్..,
కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకొస్తుంది కదా… మంత్రికి కోపమొచ్చింది… అటవీ అధికారులను పిలిచి బండబూతులు తిట్టాడు… వాళ్లు తెల్లవారే సినిమా షూటింగ్ వ్యాన్లను అడవుల్లోకి పోనివ్వలేదు… ఇదేమిటయ్యా, అనుమతి తీసుకున్నాం కదా అంటే… జస్ట్, రెండు వాహనాలను మాత్రమే లోపలకు అనుమతిస్తాం అని బాలాఘాట్ జిల్లా అటవీ శాఖాధికారి తేల్చిచెప్పేశాడు…
రెండు వాహనాల్లో వెళ్లి షూటింగ్ ఎలా..? దీంతో షూటింగ్ ఆగిపోయింది… వీళ్లు అడవుల్లోకి వెళ్లనివ్వరు… అంతా గందరగోళం… ఇది కాస్తా రచ్చరచ్చ అయ్యింది… పత్రికల్లో వార్తలొచ్చాయి… అసలే మహిళాగౌరవం, మన్ననా, మన్నూమశానం అంటారు కదా మీ బీజేపీ వాళ్లు, మరి ఇదేమిటి సారూ అంటూ కొందరు విలేఖరులు ఆయన్ని పట్టుకుని కడిగేశారు, సారీ, అడిగేశారు… కానీ తను రాజకీయ నాయకుడు కదా…
‘అబ్బెబ్బే… మీరంతా తప్పులో కాలేశారోయ్… నిజానికి నేను బాలాఘాట్ వచ్చానని తెలిసి… ఎవరైతే షూటింగులకు అటవీ అనుమతులు తీసుకున్నారో వాళ్లే నన్ను రాత్రి విందుకు గానీ, మధ్యాహ్నభోజనానికి గానీ రమ్మని ఆహ్వానించారు… నేనేమో మస్తు బిజీ, మీకు తెలుసు కదా… ఇప్పుడు కాదు లేవోయ్, మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానులే అన్నాను… ఇందులో ఆమె నా ఆహ్వానాన్ని తిరస్కరించడం మాటేముంది..?’ అని ప్లేటు మార్చేశాడు… ప్చ్… సినిమా వాళ్ల కష్టాలు నిజంగా సినిమా కష్టాలే సుమీ…
Share this Article