ఏక్తాకపూర్ డర్టీపిక్చర్ సీక్వెల్ ప్లాన్ చేస్తోందని వార్త… కొన్ని ఆలోచనలు ముసురుకునేలా చేసింది… సదరు వార్తలో ఆకర్షించిన పాయింట్స్ ఏమిటంటే… సీక్వెల్ ప్లాన్స్ తెలియగానే కృతిసనన్, తాప్సీ పన్ను అర్జెంటుగా, విడివిడిగా ఏక్తాను కలిశారట… చాన్స్ మాకే కావాలని అడిగారట… ముందైతే కథ రెడీ కానివ్వండి, తరువాత చూద్దాం అని ఆమె అభయహస్తం చూపించిందట…
నిజానికి మళ్లీ విద్యాబాలనే బెటర్ అనుకున్నారట గానీ, ఆమె కాస్త ఎక్కువ బరువు పెరిగి, డర్టీ మసాలాకు పనికిరాదేమో అనుకుని, కంగనా రనౌత్‌ను అడిగారట… ఈమధ్య నాకు చాలా గుడ్ గరల్ ఇమేజీ వచ్చింది, డర్టీ పాత్రలు వేస్తే ఇమేజీ పాడవుతుంది, సారీ, నేను చేయలేను అని చాలా మర్యాదగా ఆమె తిరస్కరించిందట… గతంలో అవసరార్థం డర్టీ పాత్రలు వేసింది గానీ ఇప్పుడు వేయడం లేదట…
వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్‌లోనే షూటింగ్ మొదలుపెట్టేద్దాం, నువ్వయితే మంచి మసాలా కథ రాసేసెయ్ అని ఏక్తా సినీ రైటర్ కనక థిల్లాన్‌కు పురమాయించిందట… మరో మగ రైటర్‌ను కూడా ఆమెకు ఈ స్టోరీ రైటింగు కోసం జతచేసిందట… వార్త ఇంతే… కృతిసనన్, తాప్సీ పన్ను ఆ పాత్ర కోరుకోవడంలో తప్పులేదు… కారణాలు… 1) వేశ్య పాత్ర వేస్తే, నటనకు స్కోప్ ఉంటుందనే భ్రమలు ఇంకా ఉన్నాయి… పైకి డర్టీనెస్ కనిపించినా వ్యాంపులు, ఐటం గరల్స్ జీవితాల్లో కూడా బరువైన, లోతైన విషాదం ఉండి, తమకు పేరు తీసుకొస్తుందనేది వాళ్లిద్దరి ఆశ… 2) హీరోయిన్ సెంట్రిక్ పాత్రల మీద వాళ్లిద్దరికీ ఈమధ్య ఆసక్తి బాగా పెరిగింది… ఏ మగ పాత్ర డామినేషనూ ఉండదు కదా… 3) ఒక్కసారి ఏక్తాకపూర్ క్యాంపులో చేరితే అవకాశాలకు ఢోకా ఉండదు…
Ads
ప్రస్తుతం ఏ హిందీ సినిమా సక్సెస్ కావడం లేదు… కశ్మీర్ ఫైల్స్, గంగూభాయ్, భూల్‌భులయ్యా తప్ప పెద్ద పెద్ద సినిమాలన్నీ ఫట్… మరి ఈ ఢమాల్‌కాలాన్ని బ్రేక్ చేయడం ఎలా..? ఇదే ఆలోచించినట్టుంది ఏక్తా… అసలే తనది పెద్ద వినోద వ్యాపారం… ఆల్ట్ బాలాజీ ఓటీటీ, బాలాజీ టెలిఫిలిమ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్… అసలు ఏక్తాకపూర్ అంటేనే ఓ ఇండస్ట్రీ… అందులోనూ సూపర్ హిట్ డర్టీపిక్చర్ సీక్వెల్ అంటే మాటలా..? అసలు బాలాజీ, ఏక్తా సంస్థ అంటేనే బూతు, వెగటు, డర్టీ… మితిమీరిన అశ్లీలం… ఓటీటీల్లో పరిమితులు దాటిన అసభ్యతకు ఏక్తాయే కారణం… సోవాట్..? ఆమెను ఎవరు ఆపగలరు..? తన బయోపిక్ తనే తీయించుకున్న కేరక్టర్ ఆమె…
అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ హిందీలో రీమేక్స్ చేసేవాడు… జితేంద్రే హీరో… ఆ స్టెప్పులు, ఆ డిష్యూం డిష్యూం చెక్కకత్తుల ఫైట్లలాంటి ఉత్తుత్తి పోరాటాలు ఉండేవి… ఆ జితేంద్ర బిడ్డే ఏక్తా… ప్రేక్షకుల అజ్ఞానం చిన్న వయస్సులోనే అర్థం చేసుకుంది… బాక్సాఫీసుకు డబ్బులు పెట్టే మగపర్సు ఓపెన్ చేయాలంటే బూతు, అశ్లీలం తప్పనిసరి అని అర్థం చేసుకుంది… అందుకే డర్టీ పిక్చర్ పేరు సిల్క్ స్మిత బయోపిక్ అయినా… అందులో తనకు కావల్సిన మాస్, బూతు కంటెంట్ తీసుకుని, మిగతావి వదిలేసింది…
ఇష్టారాజ్యంగా స్మిత ఒరిజినల్ జీవితకథకు క్రియేటివ్ ఫ్రీడం తీసుకుంది… మసాలా కంటెంటు నింపేసింది… స్మిత జీవితంలోని నిజమైన విషాదాన్ని, ఆమె తత్వాన్ని పట్టుకోలేకపోయింది… కేవలం స్మిత అందచందాలు, ఆ వ్యాంప్ కేరక్టర్‌నే తీసుకుని డర్టీపిక్చర్ తీసింది… ఏక్తా అదృష్టం పాడుగాను… విద్యాబాలన్ ఆ పాత్రలోకి అమోఘంగా పరకాయ ప్రవేశం చేసింది… స్క్రిప్టు భలే కుదిరింది… ఇంకేం… కాసులేకాసులు… స్మిత పేరిట ఆ డర్టీ పిక్చర్ సొమ్ముచేసుకుంది…
ఇప్పటికైనా ఏక్తాకు అలాంటి కంటెంటే కావాలి… డర్టీ పిక్చర్ సినిమాలోనే స్మితను చంపేశాము కదా… మరేటి..? సో, వేరే కథ కావాలి… అది ఎవరి కథో ప్రస్తుతానికి సస్పెన్స్… అదీ ఇలాగే తీస్తారు… జబర్దస్త్ మాస్ మసాలా కంటెంట్‌తో సినిమా తీస్తారు… ఎలాగూ ఇది డర్టీ పిక్చర్ సినిమాకు సీక్వెల్ కాదు… ఆ పాత కథకు కొనసాగింపూ కాదు… జస్ట్, ఆ పేరు వాడుకోవడం… ఆమె అసలే ఏక్తా కదా…
బ్రహ్మచారిణి… ఈ బంధాలు, పెళ్లిళ్లు, ఆంక్షలు, మగపెత్తనాలు జాన్తానై… ఇండస్ట్రీలో కనిపించే ప్రేమల్లోని డొల్లతనం తనకు తెలుసు… అందుకే పెళ్లి చేసుకోలేదు, కోదు కూడా… 2019లో సరోగసీ ద్వారా ఓ పిల్లాడిని కన్నది… రవికపూర్ అని పేరు పెట్టుకుంది… అంతే ఇక… నో పుస్తెలు, నో మెట్టెలు… ఆమె డర్టీపిక్చర్ సీక్వెల్ కథను పురమాయించిన కనికా థిల్లాన్ ఎవరో తెలుసా..?
మన బొడ్డు రాఘవేంద్రుడు ఉన్నాడు కదా… ఆయన కొడుకు ప్రకాష్… అదుగో ఆయన్ని పెళ్లి చేసుకుంది కనికా… ఒరిజినల్‌గా పంజాబీ… రచయిత్రి… మూడు నవలలు రాసింది… మణిరత్నం రావణ్ సినిమాకు రైటర్ ఆమే… అంతేకాదు, మన అనుష్కను నాశనం చేసిన జీరో సైజ్ సినిమా రైటర్ కూడా ఆమే… ఇదీ తెలుగుతో ఆమె రిలేషన్… తరువాత ప్రకాష్‌కు డైవోర్స్ ఇచ్చిపారేసి, తన కో-రైటర్ హిమాంశు శర్మను పడేసింది… ఇక డర్టీ పిక్చర్ రైటింగులో తలమునకలైంది… ఇక డర్టీపిక్చర్ ఎవరి కథో, ఎలా ఉంటుందో వేచిచూడాలి..!!
Share this Article