.
తెలుగు వాళ్లంటే అలుసే ఎవడికైనా..? మనకు భాషా సంకుచితత్వం లేదు గనుక..! ఎవడినైనా మనోడే అనుకుంటామే తప్ప మనల్ని మాత్రం ఎవడూ ‘మనోడే’ అనుకోడు గనుక..!
ఇతర భాషల్ని ఆలింగనం చేసుకుంటామే తప్ప విషాన్ని, విద్వేషాన్ని గుమ్మరించం గనుక..! ఇది అలుసో, బలహీనతో, భారీ ఔదార్యమో, అత్యంత విశాల హృదయమో గానీ… మనం అన్నీ లైట్ తీసుకుంటాం గనుక..!
Ads
ఉదాహరణకు… సినిమా టైటిళ్లు… ఏ కర్నాటకలోనో, ఏ తమిళనాడులోనో గమనించండి… వాళ్ల భాషలోకి గనుక వేరే భాషల సినిమాలు డబ్ చేయబడితే వాళ్ల భాషలోనే టైటిళ్లు పెట్టబడాలి… లేకపోతే రప్ఫారప్పాయే…
మరి తెలుగు..? సింపుల్‌గా వాళ్ల ఒరిజినల్ భాషల టైటిళ్లనే తెలుగు లిపిలో రాసి వదిలితే సరి… తెలుగు ప్రేక్షకులు ఎడ్డి గాడిదలు కదా, థియేటర్లకు పడీపడీ వచ్చి చూస్తారు అనే అలుసు వచ్చేసింది వాళ్లకు… ప్రత్యేకించి తమిళం, మలయాళం నిర్మాతలకు…
అంతేనా..? మన ప్రభుత్వాలూ ‘దేడ్ దిమాకులే… ఆయా భాషల్లో మరీ చౌక టికెట్ రేట్లు ఉంటే, అవి తెలుగులోకి అడ్డదిడ్డంగా డబ్ చేసి వదిలితేనేమో మన తెలుగు రాష్ట్రాల్లో డబుల్, ట్రిపుల్ రేట్లకు అంగీకరించేస్తాయి… పైగా ప్రిరిలీజ్ వేదికల మీద ఆ డబ్బింగ్ సినిమాల్ని కూడా ‘ఇవీ తెలుగు స్ట్రెయిట్ సినిమాలే’ అని చాటింపు వేస్తుంటారు… మనం అలుసు కదా…
టైటిళ్ల సంగతికొద్దాం… కొన్నాళ్లుగా చూసిన కొన్ని టైటిళ్లు… ‘కరుప్పు, ‘కంగువ, ‘వేట్టయాన్, ‘పొన్నియన్ సెల్వన్, ‘ఈటీ, ‘వలిమై, ‘రాయన్, ‘తంగలాన్, ‘అమరన్, ‘అయలాన్, ‘తుడురం, ‘ఎంపురాన్, మంజుమ్మల్ బాయ్స్… జస్ట్, ఇవి శాంపిల్స్… ఇలా ఎన్నో వచ్చాయి… వాటికి ఆయా భాషల్లో ఏమర్థాలున్నాయో ఎవడికి కావాలి..? తెలుగులో టైటిళ్లు మాత్రం పెట్టరు… వాళ్ల భాషనే రుద్దేస్తారు…
ఇప్పుడిదంతా ఎందుకూ ఉంటే..? ఓ వెధవ (ఈ మాట ఉద్దేశపూర్వకంగానే వాడినట్టు గమనించగలరు) తెలుగులో పూకీ (Pookie) అనే టైటిల్‌తో పోస్టర్ ఒకటి రిలీజ్ చేశాడు… ఏమో, ట్రెయిలరో, టీజరో, ఫస్ట్ గ్లింప్సో తెలియదు గానీ ప్రచారం ప్రారంభించాడు… ఆ నిర్మాతకు గానీ, ఆ బయర్‌కు గానీ భయం లేదు… అందుకే ఆ టైటిల్…
ఆ పదం చదవగానే తెలుగులో ఏం అర్థం స్పురిస్తుందో అందరికీ తెలుసు… నిజానికి పాశ్చాత్యంలో పూకీ అంటే బేబ్, హనీ, స్వీట్ హార్ట్ వంటి ప్రియంగా, ముద్దుగా సంబోధించే పదం… నిజానికి పెంపుడు జంతువులను ఎక్కువగా పిలుస్తారు ఇలా…
మంగుళూరు ప్రాంత తుళు భాషలో ఈ పదానికి అర్థం ఏమిటో తెలుసా..? పిత్తు… అవున్నిజమే, మీరు చదివింది… ఆపానవాయువు..! సరే, ఆ భాషలో ఏ అర్థముంటే మనకేల గానీ, తెలుగులో పూకీ ఏమిట్రా అని తెలుగు నెటిజనం అదే పదాల్ని వాడి, చాలా నాటుగా ఎక్కీదిగేసరికి… టైటిల్ మార్చేశారు… ఏమనీ..? బూకి… అంటే..?
అదీ తెలుగు పదం కాదు… ఏదో ఒకటి… పూకి కాకపోతే సరి… ఏదో ఓ బూకి, ఇదీ కాదంటే మరో పీకి, ఇంకో కాకి… తెలుగే కానక్కర్లేదు, ఆ పదానికి అర్థమూ అక్కర్లేదు… తెలుగు ప్రేక్షకులు కదా, చల్తా… ఇదీ బయ్యర్లకు ఏమాత్రం భయం లేని ధీమా…
సరే, బూకి అంటే ఏమిటో తెలుసా..? ఉర్దూలో దగ్గరగా వినిపించే అర్థం ఆకలి… (బూఖ్)… జపనీస్‌లో ఆయుధం అని..! అవునూ, టైటిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ఒకటి ఏడుస్తుంది కదా… వీటికి వర్తించదా..? తెలుగులో ఉండాలని ఏమీ సూచించదా..? అడగదా..? నిర్దేశించదా..? పోనీ, సెన్సారోడు కంటెంట్ చూస్తాడే తప్ప టైటిళ్లకు పర్మిషన్ ఇవ్వదా..? ఇవ్వకూడదా..? చేతకాదా..?!
Share this Article