.
ఒక ఆశ్చర్యం ఏమిటంటే..? పెద్దగా మెంటల్ మెచ్యూరిటీ లేని, తొందరపాటు తత్వమున్న ఓ 19 ఏళ్ల సింగింగ్ కంటెస్టెంట్ ప్రవస్తి చేసిన ఆరోపణలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన మద్దతు లభించడం…
పాడతా తీయగా షోలో జడ్జిలు చంద్రబోస్, కీరవాణి, సునీతల వ్యవహారశైలి మీద, నిర్మాతల మీద ప్రవస్తి తీవ్ర ఆరోపణలే చేసింది కదా… నిజానికి అందులో చాలావరకూ ఆమె చిన్నపిల్లల మనస్తత్వాన్నే బయటపెడుతున్నాయి… రియాలిటీ షోల రియాలిటీ తెలిసీ ఏదో స్పందిస్తూ తిరగబడుతున్నది ఆమె…
Ads
తిరగబడటం వరకూ వోకే, కానీ చిన్న చిన్న అంశాలనూ భూతద్దంలో చూస్తూ, చూపిస్తూ నిందారోపణలకు దిగింది అనేది నిజం… ఆమె తల్లితో సునీత ఏకవచనంలో మాట్లాడిందట, సోవాట్, తెలంగాణ, రాయలసీమల్లో నువ్వు అంటారు తప్ప మీరు అనరు, గారు అనరు, ఐనంతమాత్రాన అగౌరవ పరచడం కాదు…
అంత లోతు పరిపక్వత ప్రవస్తికి ఉందని అనుకోలేం గానీ… పైగా నీకు ఈ డ్రెస్ సూట్ కాదమ్మా అంటే అది బాడీ షేమింగా..? ఎస్, పాటను బట్టి, కంటెస్టెంట్ రూపాన్ని బట్టి ఏ డ్రెస్ బాగుంటుందో అది సజెస్ట్ చేస్తారు, అది షేమింగ్ అంటే ఎలా..? (బొడ్డు కిందకు చీర కట్టమన్నారు, పొట్టిబట్టలు వేసుకొమ్మన్నారు అనే ఆరోపణలను నమ్మలేం…) ఇలాంటివి చాలా ఉన్నాయి…
ఎలిమినేషన్స్ ఉంటాయి, రియాలిటీ షోలకు చాలా లెక్కలుంటాయి… రాగద్వేషాలూ ఉంటాయి… కొన్ని లైట్ తీసుకోవాలి… ఆ మెంటల్ మెచ్యూరిటీ లేదామెకు… సరే, సునీత ప్లస్ జ్ఞాపిక నిర్మాతల్లో ఒకామె ఏవేవో వివరణలు ఇచ్చారు గానీ అవీ ప్రవస్తి విమర్శలకు తగిన కౌంటర్లుగా లేవు… పైగా ప్రవస్తి మరో వీడియో ఇచ్చి ఇవిగో ఆధారాలు అని చెప్పింది కానీ అవీ పేలవమే… ఐతే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఎంటైర్ మీడియా ప్రవస్తికి సానుభూతి తెలిపింది… పాడతా తీయగా టీమ్‌ను దోషిగా నిలబెట్టింది…
అదే ఆశ్చర్యం… హారిక నారాయణన్, నేహా, లిప్సిక వంటి ఎవరెవరో ఈ వివాదంలోకి జొరబడ్డారు… ఏవేవో చెబుతున్నారు… ఎక్కడో మీడియాలో కీరవాణి, చంద్రబోస్, సునీతల మీద ఎప్పటినుంచో ఎందుకోగానీ బాగా వ్యతిరేక భావనలు అక్యూములేట్ అవుతున్నట్టున్నాయి… అందుకే చాన్స్ దొరకగానే మొత్తం మీడియా ఇక అందుకుంది…
చాన్నాళ్ల క్రితమే కొరియోగ్రాఫర్ రఘు భార్య, సింగర్ ప్రణవి తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న పెంట వాతావరణం గురించి, దోపిడీ గురించి నిజాలెన్నో చెప్పింది… తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టుకుంది,.. ఎలాగూ ఇక అవకాశాలు రానివ్వరు అని తెలిసి..!
కీరవాణి విషయానికి వద్దాం, చాలా వివాదాలు… ముందుగా ఓ పాత ట్వీట్ చూడండి, తన తత్వం ఎంత వికృత్వంగా ధ్వనిస్తుందో పబ్లిక్ డొమైన్‌లో…
నెటిజనం బూతులు తిట్టేసరికి డిలిట్ చేసుకున్నాడు… మరోసారి కెరీర్‌కు ఫుల్ స్టాప్ అని వరుసగా ట్వీట్లు కొట్టాడు… వాళ్లో వీళ్లో కాదు రాజమౌళే బూతులు తిట్టినట్టున్నాడు, సైలెంట్… తెలంగాణ జాతిగీతం కంపోజ్ చేయడంలో అట్టర్ ఫెయిల్యూర్…
అప్ కమింట్ సింగర్స్‌తో చాకిరీ చేయించుకుంటాడనే విమర్శ… ఇలా బోలెడు… చంద్రబోస్ రాసిన ఓ చెత్తా పాటకు ఆస్కార్ రావడంతో జనంలో వాళ్ల పట్ల ఆదరణ పెరగకపోగా, ఆ దిక్కుమాలిన పాటకు పైరవీలు, లాబీయింగు ఖర్చుతో అవార్డులు తెచ్చుకున్నానే వ్యతిరేక భావన పెరిగింది చంద్రబోస్, కీరవాణిపై…
సునీత గురించి ఇక్కడ వదిలేద్దాం… ఆమె మీద కూడా పెద్దగా సదభిప్రాయం లేదు ఎవరికీ… కానీ మొత్తం మీడియా ఆ ముగ్గురి పట్ల ‘భలే దొరికార్రా’ అన్నట్టుగా స్పందిస్తోంది… పెద్దగా చరణ్ హోస్టింగు పట్ల వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు… నిజానికి తను ఒక హోస్ట్‌గా గొప్ప సక్సెస్ కాకపోవచ్చు తన తండ్రిలాగా… కానీ మరీ ఫ్లాప్ ఏమీ కాదు… మొదటితో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్…
జీతెలుగు, స్టార్‌మా సింగింగ్ షోలను వదిలేస్తే… (అవి పక్కా రొటీన్ ఎంటర్‌టెయిన్‌మెంట్, పర్‌ఫామెన్స్ షోలుగా మారిపోయి చాన్నాళ్లయింది… అవీ శ్రీదేవి డ్రామా కంపెనీ టైపు)… ఇక ఆహా ఓటీటీలో వచ్చే తెలుగు ఇండియన్ ఐడల్…
సునీతలాగే గీతమాధురి మీదా వ్యతిరేకత ఉంది… థమన్ సరేసరి… ఎప్పుడో ఏ ప్రవస్తియో అక్కడా నోరు విప్పితే మళ్లీ ఇదే కథ… మీడియా మళ్లీ పండుగ చేసుకుంటుంది… అది మాత్రం పక్కా…! ఇప్పటికే టీవీ సింగింగ్ రియాలిటీ షోల బండారం మొత్తం బద్దలవుతోంది..! ఈ పెంటను కదిలించడంలో మాత్రం ప్రవస్తి సక్సెస్.. కాకపోతే తన కెరీర్ మొత్తం పణంగా పెట్టి..!!
Share this Article