2012… అంటే పదేళ్ల క్రితం… కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన జారీ చేసింది… ఎవరికైనా టీబీ ఉన్నట్టు ఖరారైతే ఏ మెడికల్ షాపుకు వెళ్లినా సరే, ఏ కార్పొరేట్ హాస్పిటల్ కౌంటర్ దగ్గరకు వెళ్లినా సరే, ప్రభుత్వ హాస్పిటల్‌కు వెళ్లినా సరే… పేరు రాసుకుని, వివరాలు రాసుకుని ఓ మందుల కిట్
ఇవ్వాలి… ఆ కోర్సు ఖచ్చితంగా రోగి వాడాలి… ఆ మందుల ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది…
ఏమైంది..? చాలా ప్రభుత్వ పథకాల్లాగే అదీ కొండెక్కింది… ఈరోజు ఈనాడులో ఓ స్టోరీ చదివితే ఇదీ ఆ స్కీంలాగే ఉంది అనిపించింది… ఫీల్డ్‌లో జరుగుతున్నది ఏమిటంటే… ఎవరికైనా టీబీ లక్షణాలు కనిపిస్తే, ఎప్పటిలాగే, అలవాటైనట్టుగానే ఓ ఫిజిషియన్ దగ్గరకో వెళ్తే… వాళ్లు అసలు విషయం చెప్పకుండానే చకచకా మందులు రాసి, మెడికల్ షాపుల్లో కొనిపిస్తున్నారు… అది అసలే ఎయిర్ బార్న్… రోగి దగ్గు, తుమ్ము ద్వారా గాలిలోనూ వ్యాప్తి చెందుతుంది… ఇంట్లో ఇతరులకూ డేంజర్… అందుకే జాగ్రత్తలు తీసుకోవడం కోసమైనా డాక్టర్లు రోగికి, కుటుంబసభ్యులకు విషయమేమిటో, తీవ్రత ఏమిటో చెప్పాలి…
ఈనాడులో ఆ వార్త చదివాక ఇవన్నీ గుర్తొచ్చాయి… వార్త నిజం… కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదికలో ఈ పాయింట్స్ చూడగానే మంచి వార్త అని గమనించి పట్టుకోవడం గుడ్… అంతే… ఇక మొత్తం వార్తంతా తీవ్రంగా నిరాశపరిచింది… ఈనాడులో డెస్కులు ఎంత నిర్లిప్తంగా పనిచేస్తున్నాయో తెలిసి జాలేసింది… నిజానికి ఇది మంచి వార్త… ఇంకాస్త వర్క్ జరిగితే సమాజానికి ఉపయోగకరం… ఆ సోయి కూడా లేకపోతే ఎలా..?
Ads
విషయం సీరియస్… ఏటా 60, 70 వేల కేసులు నమోదవుతున్నాయి… సగటున రెండు వేల మంది మరణిస్తున్నారు… తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగం నిర్లక్ష్యానికి గురవుతున్నది… కానీ టీబీకి సంబంధించి మంచి మందుల్ని ప్రభుత్వ డాక్టర్ల వద్ద అందుబాటులో ఉంచుతున్నారు… ప్రైవేటుగా మెడికల్ షాపుల్లో ఏవో పిచ్చి బ్రాండ్ల మందులు కొనడంకన్నా ప్రభుత్వ సప్లయ్ మందులు మేలు… అయితే ఫుల్ కోర్స్ ఖచ్చితంగా వాడాలి…
లేకపోతే రెసిస్టెన్స్ వచ్చేసి, ప్రమాదకరంగా మారొచ్చు… ప్రాణాంతకమూ కావొచ్చు… క్షయ ఇప్పుడు చాలామంది చదువుకునే పిల్లలకు వస్తోంది… ఇంటర్, ఆపైన చదివేవారికి… పిల్లలు తమకు క్షయ అని బయటికి చెప్పుకోలేరు… ఇబ్బందిగా ఫీలవుతారు… అన్నింటికీ మంచి మందులకుతోడు మంచి ఆహారం అవసరం రోగికి… ఒకరిద్దరు ఫిజిషియన్ల అభిప్రాయాలు యాడ్ చేసి, జాగ్రత్తల్ని పేర్కొని, వ్యాప్తి మార్గాల్ని, రోగ లక్షణాల్ని మరింత వివరంగా ప్రజెంట్ చేస్తే మంచి స్టోరీ అయి ఉండేది…
ఎంతసేపూ ఆ టేబుల్‌లో కనిపించిన అంకెల్నే ఇటూఅటూ అక్షరాల్లో రాసేస్తే ఎలా..? పైగా సగం స్టోరీ నెలకు రోగికి ఇచ్చే 500 సాయం మీద కాన్సంట్రేట్ చేసి ఉంది… ఈనాడులో డెస్క్ పనితీరు ఎంత పేలవంగా ఉందో చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ… అసలు సమస్య ప్రభుత్వం ఇచ్చే 500 కాదు… క్షయ తీవ్రతను, పెరుగుతున్న ప్రమాదాన్ని చెబుతూ పాఠకుల్లో అవేర్‌నెస్ క్రియేట్ చేయడం… వేరే పత్రికలకు ఎలాగూ ప్రజావార్తలు చేతకావు… చివరకు ఈనాడు సైతం… ‘‘క్షయ’’పథంలో…! ఎలాగూ ఆరోగ్యసర్వం తెలిసిన ప్రతిభావంతులైన సుఖీభవ సంపాదక బృందం ఉందిగా, వాళ్లు ఈ కేస్ డీల్ చేస్తే బాగుండేది..!!
Share this Article