అప్పుడెప్పుడో… రవితేజ 1991లో నటజీవితం స్టార్ట్ చేస్తే… ఎన్నెన్నో చిన్నాచితకా పాత్రలు పోషించాక… పదేళ్ల తరువాత, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో గానీ తనకు కమర్షియల్ బ్రేక్ రాలేదు… ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయిలతో రెగ్యులర్ స్టార్ అయిపోయాడు… నా ఆటోగ్రాఫ్ సినిమాలో రవితేజలోని రియల్ నటుడు బాగా ఎక్స్పోజ్ అయ్యాడు… ఆ నటన చూసి చాలామంది ఇష్టపడ్డారు… తరువాత తను కూడా ఓ రొటీన్ కమర్షియల్ స్టార్ ఇమేజీ సంపాదించుకుని, ఆ ఫార్ములా సినిమాల్లో బందీ అయిపోయాడు… ఇతర హీరోల్లాగే తనకూ ఆ మాస్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది… ఇక అంతే… విక్రమార్కుడు, కిక్ దాకా దశ బ్రహ్మాండంగానే వెలిగింది… కానీ..?
రాను రాను జనానికి ఆ రొటీన్ మూస నచ్చలేదు, తన పాత్రల ఎంపిక బాగాలేదు, పైగా కొన్ని పర్సనల్ సమస్యలు కూడా వెన్నాడినట్టున్నయ్… వరుసగా సినిమాలు బోల్తాకొట్టసాగినయ్… అవే పాత్రలు, అదే బాడీ లాంగ్వేజీ… చివరకు నేలటికెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, కిక్-2, బెంగాల్ టైగర్ వంటి సినిమాలయితే సూపర్ ఫ్లాపులు… 2010 నుంచి దాదాపుగా ప్రతి పాత్ర ఫట్‌మని పేలిపోయింది బాక్సాఫీసు దగ్గర… 2019లోనయితే ఒక్క సినిమా కూడా లేదు… 2020లో మళ్లీ డిస్కో రాజా అంటూ తెరమీదకు వచ్చాడు… వయస్సు మీద పడుతోంది… ఏదో కవర్ చేస్తున్నాడు… సెకండ్ ఇన్నింగ్స్‌ను జనం పరీక్షకు పెట్టాడు… ప్చ్, వర్కవుట్ కాలేదు… చివరకు బుల్లితెర ప్రేక్షకులు కూడా తిరస్కరించారు… దానికి నిదర్శనం మొన్నటి ఏడో తారీఖును టీవీలో ఆ సినిమా ప్రసారం చేస్తే మరీ ఘోరంగా 4.64 రేటింగ్ వచ్చింది… (హైదరాబాద్ బార్క్ కేటగిరీ)… ఫ్లాపున్నర…
Ads
ఈ సినిమాను కొనుగోలు చేయడం ద్వారా జెమిని టీవీవాడు మరోసారి చేతులు కాల్చుకున్నాడు… హీరోల స్టార్డమ్ చూసి, ఇతర నటీనటులు, దర్శకుల పేర్లు చూసి అడ్డగోలు రేట్లకు కొంటున్నాడు… తీరా రేటింగ్స్ చూసి బేర్మంటున్నాడు… ఈ డిస్కో రాజా రేటింగ్స్ అయితే మరీ ఓ సాదాసీదా నాసిరకం సీరియల్ రేటింగులతో సమానం… ఒకటి మాత్రం నిజం… టీవీ ప్రేక్షకులు సినిమా హీరో పేరు చూసి, ఇమేజీ చూసి, పాత ట్రాక్ రికార్డు చూసి సినిమాలు చూడటం లేదు… మౌత్ టాక్ బాగా లేని సినిమాలను నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు… వాళ్లకు వినోదం కోసం బోలెడు ఆప్షన్లున్నయ్ టీవీలో… అవేవీ లేకపోతే ఓటీటీల్లో వెబ్ సీరీస్ ఉన్నయ్… అందువల్ల చేత మేం స్టారాధిస్టారులం, మేం వేసిందే వేషం, చేసిందే పాత్ర, చూడాల్సిందే, చూడక చస్తారా అనే భావజాల బందిఖానా నుంచి ఎవరైనా సరే బయటపడకతప్పదు… తప్పదు… క్రాక్ సినిమాలో బయటపడ్డాడా..? దాని థియేటర్ మౌత్ టాక్‌ను బట్టి రవితేజ స్టిల్ ఇప్పటికీ అదే పోకడలో ఉన్నాడు… చూద్దాం… టీవీ ప్రేక్షకులు ఆ సినిమాను ఏం చేస్తారో…!!
Share this Article